ఒక్కో నక్సలైట్ ఏరివేతకు సర్కార్ పెట్టే ఖర్చు ఎన్ని కోట్లంటే...
x

ఒక్కో నక్సలైట్ ఏరివేతకు సర్కార్ పెట్టే ఖర్చు ఎన్ని కోట్లంటే...

ఎదురు కాల్పులు.. నక్సలైట్లు.. భధ్రతా దళాలు.. మరణాలు.. పెద్ద ఎదురుదెబ్బ వంటి పదాలు మనకు తెలుసు. కానీ ఒక్కో నక్సలైట్ ను చంపడానికి పెట్టే ఖర్చు వింటే ఆశ్చర్యపోతారు


పౌరహక్కులంటూ జీవితాంతం పలవరించిన డాక్టర్ కె.బాలగోపాల్ 15వ సంస్మరణ జరుగుతున్న రోజే (అక్టోబర్ 7) అక్కడ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాదాన్ని మరో రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ ప్రకటించారు. చరిత్రలో అక్టోబర్ 7కి పెద్ద ప్రాధాన్యత ఉంది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో అది మరచిపోలేని రోజు. ఆనాటి జారిస్ట్ రష్యాలో కమ్యూనిస్టులు తిరుగుబాటు చేసి అక్టోబర్ మహావిప్లవానికి నాందీ పలికిన రోజు. డాక్టర్ బాలగోపాల్ పౌరులు, హక్కులు, రాజ్యాంగమంటూ అటు జమ్మూ కాశ్మీర్ మొదలు ఇటు కన్యాకుమారి వరకు- ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికల్లా కాలికి బలపం కట్టుకుతిరిగారు. చివరికి నల్లకోటేసుకుని కోర్టుల చుట్టూ తిరిగారు. వీధి పోరాటాలు చేశారు. హక్కులో అంటూ గొంతెత్తి అరిచారు. ఎవరు విన్నా వినకపోయినా తాను చెప్పాల్సింది చెప్పారు. పాలకుల తీరును ఎండగట్టారు. రాజ్యాంగ పరిథిలో మీకుండే హక్కులేమిటో బాధ్యతలేమిటో తెలుసుకోమని చెవినిల్లు కట్టుకుని పోరితే.. వామపక్ష తీవ్రవాదులే పౌర హక్కులకు పెద్ద ఆటంకమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

ప్రతి ఏటా చెప్పినట్టే ఈ ఏడాదీ ఎంతమంది వామపక్ష తీవ్రవాదుల్ని చంపారో, మరెంతమందిని దొరకబుచ్చుకున్నారో, ఇంకెందర్ని లొంగదీసుకున్నారో వంటి వివరాలు కూడా అమిత్ షా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. వామపక్షతీవ్రవాదులంటే జనాంతికంగా మనందరికీ తెలిసిన నక్సలైట్లు లేదా మావోయిస్టులు. అదే ఈశాన్య రాష్ట్రాలలోనైతే కమ్యూనిజంతో ప్రభావితమై వేర్వేరు పేర్లతో మూలవాసుల బతుకుల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. లేదంటే హక్కుల కోసం గళం విప్పుతున్నవారు.


ఇదే సందర్భంలో అమిత్ షా గత పదేళ్లలో వామపక్ష తీవ్రవాదులెందర్ని మట్టుబెట్టామనే విషయమూ చెప్పారు. ఛత్తీస్‌ఘడ్ లో 85 శాతం మావోయిస్టుల్ని, దేశవ్యాప్తంగా సీపీఐ-మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు 14మందిని హతమార్చినట్టు చెప్పారు. ఇదే ట్రెండ్ ను కొనసాగించి 2026 మార్చి నాటికి అసలు మావోయిస్టుల్నే లేకుండా చేస్తామన్నారు. అభివృద్ధి ఫలాలేమిటో స్థానికులకు రుచి చూపిస్తామన్నారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ ప్రాంతంలో ఏకంగా 31 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ లో కాల్చివేసిన 72 గంటల తర్వాత (అక్టోబర్ 4) కేంద్ర హోం మంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ 31 మందితో కలిసి ఈ ఏడాదిలో ఇప్పటికి 237 మంది మావోయిస్టుల్ని కాల్చేసినట్టయిందని అమిత్ షా అధికారికంగా చెప్పారు. వీళ్లు గాక మరో 812 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో 723 మంది లొంగిపోయారు. 2026 మార్చినాటికి దేశంలో నక్సలైట్లు, మావోయిస్టులనే వారే లేకుండా చేస్తామని, 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామన్నారు. "వామపక్ష తీవ్రవాదులు సృష్టించిన అంథకారాన్ని తొలగించి వారి చేతుల్లో బందీలుగా ఉన్న ప్రాంతాలను విముక్తం చేసి స్ధానికులందరికీ రాజ్యాంగబద్ధంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తాం. వాళ్లను కొత్తయుగంలోకి తీసుకువెళ్తాం" అన్నారు అమిత్ షా.

ఈ దేశ పౌరులందరికీ అన్నీ అందాలనే దాన్లో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. అయితే అమిత్ షా చెప్పే " ఈ నిర్మూలన" అర్థమేమిటన్నదే ప్రశ్న. అంటే మావోయిస్టులు, నక్సలైట్లను చంపేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు పౌరహక్కుల సంఘాల వాళ్లు. "ఛత్తీస్‌ఘడ్ లోని అబూజ్ మడ్ అడవుల్లో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో అక్టోబర్ 4న జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది నక్సలైట్లు చనిపోయారని ఛత్తీస్ ఘడ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు హెూరా హోరీగా జరిగినట్లు చెబుతున్న ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు బలగాలకు చిన్న గాయం కూడా కాకుండా నక్సలైట్లు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం చూస్తే దీనిని 'ఎదురుకాల్పులు' అని నమ్మటం అసాధ్యం. మావోయిస్టులను లేదా వారి సహాయకులను అనేక ఇతర అనైతిక, చట్ట వ్యతిరేక మార్గాల ద్వారా చంపేసి ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లటం ప్రభుత్వాలు సర్వసాధారణంగా చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక పక్షానికే జరిగిన నష్టం చూస్తే అలాంటిదే జరిగిందని మేం బలంగా నమ్ముతున్నాం" అని మానవహక్కుల వేదిక ప్రకటించింది.

"దేశ ప్రధానమంత్రి, హెూంమంత్రి, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ నక్సలైట్లను ఏరివేస్తామంటున్నారు. అంటే నక్సలైట్లను నిర్మూలిస్తామనీ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అంటే చంపేస్తామనే అర్థం. అందుకోసం లక్షలాది మంది భారత సైన్యాలను, పోలీసులను నక్సలైట్ ప్రాంతాల్లో మోహరించారు. తమకు నచ్చని వారిని చంపేయటం అనే మాఫియా నీతిని ప్రజాస్వామ్య దేశాల్లో పారిపాలకులు కలిగివుండటం, అదే తమ విధానం అని బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, అనైతికం. ఇది నాగరిక సమాజం ఆమోదించదగ్గ విషయం కాదు" అని మానవహక్కుల వేదిక నాయకులు- బాలగోపాల్ సంస్మరణ సభలో- తీర్మానం చేశారు.
ఛత్తీస్‌ఘడ్ లోనే కాదు మరెక్కడ ఎన్ కౌంటర్ జరిగినా పోలీసులు మానవ హక్కుల సంఘాల వారిని గాని ఇతర రాష్ట్రాల నిజనిర్ధారణ కమిటీలను గానీ రానివ్వరు. ఇది జగమెరిగిన సత్యం. ఆనవాళ్లన్నీ చెరిగి పోయిన తర్వాతో లేక చెరిపేసిన తర్వాతనో సంఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్లనిస్తారు. అనేక సందర్భాలలో కోర్టులు ఈ తీరును తప్పుబట్టాయి కూడా. పాలకులు ప్రచారమే యదార్థమైతే హక్కుల సంఘాలను అడ్డుకోవాల్సిన పనిలేదు. అయినా అడ్డుకుంటున్నారంటే వారి ప్రచారంలో వాస్తవాలు లేవనీ, వారు చేసే ఎన్కౌంటర్లు దారుణమైన హత్యలనీ అర్థం తప్ప మరొకటి కాదు అని మానవ హక్కుల వేదిక ఆరోపించింది. ఇలా నక్సలైట్లను వెతుకుతూ, వేటాడి చంపడం అనే అనాగరిక విధానాన్ని ప్రభుత్వం
వెంటనే మానుకోవాలని కోరింది. మధ్య భారతంలోని వనరులను కొల్లగొట్టడం కోసం స్థానిక ఆదివాసీ జీవితాలను చిన్నాభిన్నం చేసే హక్కు తమకు లేదనే విషయం పాలకులు గ్రహించాలని కూడా మానవహక్కుల వేదిక డిమాండ్ చేసింది. నక్సలైట్లు వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి గిరిజన బతుకుల్లో వెలుగులు నింపాలని చూస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వాలపై యుద్ధం చేయలేరన్నది అందరికీ తెలిసిందే.
ఒక్కో నక్సలైట్ ను చంపెందుకు పెట్టే ఖర్చు ఎంతంటే...
గత పదేళ్లలో అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక వామపక్ష తీవ్రవాదం పీచమణిచే కార్యక్రమానికి 14,367 కోట్లు కేటాయిస్తే అందులో ఇప్పటికి 12వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇందులో రూ.3వేల 590 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సాయం కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఖర్చు చేశారు. అంటే మిగిలిన 8 వేల 410 కోట్ల రూపాయలను నక్సలైట్లు లేదా మావోయిస్టులను నిర్మూలించేందుకు ఖర్చు పెట్టారు. సగటున ఏటా 841 కోట్ల రూపాయలు ఈ నక్సలైట్ల నిర్మూలనకు ఖర్చు చేసినట్టు అర్థమవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికి 237 మందిని చంపేశారు. ఈ లెక్కన ఒక్కో నక్సలైట్ ను ఏదో పేరిట చింపేసేందుకు పెడుతున్న ఖర్చు సుమారు 3 కోట్ల 55 లక్షల రూపాయలు. ఈ ఎన్ కౌంటర్లన్నీ నకిలీవేనని, ఇవన్నీ సర్కారు హత్యలేనని బాలగోపాల్ మొదలు కన్నాభిరాన్ వరకు పౌరహక్కుల సంఘాల వాళ్లు ఆరోపించారు. ఇప్పుడీ లెక్కలు చూస్తుంటే అది నిజమేమోననిపిస్తోందంటున్నారు విజయవాడకు చెందిన న్యాయవాది రామమోహన్. వచ్చే రెండేళ్లలో ఇంకెంత మొత్తం ఖర్చు పెడతారో చూడాలి.

ప్రజలు సన్నద్ధం కాకుండా ఏ పోరాటమైనా పాక్షికమే. ఏకపక్షమే. ప్రభుత్వాలకుండే సాధన సంపత్తి ముందు చిన్న చిన్న గ్రూపులకు ఉండే శక్తిసామర్థ్యాలు స్వల్పమే. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అణచివేసిందో మన ముందున్న ప్రత్యక్ష సాక్ష్యం. ఇటీవలి చరిత్రలో శ్రీలంకలో ఎల్.టి.టీ.ఇ. ని పాలకులు ఎంత నిర్దయగా ఏకకాలంలో అణచివేశారో ప్రత్యక్షంగా చూశాం. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాన్ని తట్టుకుని బతికిబట్టకట్టడ మంటే మాటలు కాదు. అయితే ప్రజాస్వామ్యంలో నిరసించే హక్కుంది. హక్కుల కోసం గళం విప్పే ఛాన్స్ ఉంది. అందులో భాగమే నక్సలైట్ల పోరాటం కూడా. దీన్ని ప్రభుత్వంపై యుద్ధంగా భావిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మూలసూత్రాలకే విఘాతం.


Read More
Next Story