ఆలేరుకు ముందున్న పేరు ఏమిటో తెలుసా ?
x
Ranganaika Swamy deity (16th Century)

ఆలేరుకు ముందున్న పేరు ఏమిటో తెలుసా ?

ఇపుడున్న ఆలేరుకు ఆ పేరు ఎలాగ వచ్చిందో తెలుసా ?


ఆలేరు నియోజకవర్గం ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉంది. ఈ పేరువెనుక చరిత్రలో రెండు రకాల ప్రచారాలున్నాయి. ఇంతకీ ఇపుడున్న ఆలేరుకు ఆ పేరు ఎలాగ వచ్చిందో తెలుసా ? చరిత్రకాలంలో ఇఫుడున్న ఆలేరు చిన్న ఊరు. ఆ వూరి చుట్టూ అడవులుండేవి. అప్పుడప్పుడు అడవిలో నుండి పెద్దపులులు ఊరిమీదకు వచ్చేవి. ఒకసారి అడవిలోనుండి పెద్దపులి వచ్చినపుడు ఊరిలోని ఆవుల మందొకటి పెద్దపులిని తిరిమికొట్టిందట. దాంతో పెద్దపులినే తరిమికొట్టిన ఆవులున్న ఊరు కాబట్టి ఆవులూరు తర్వాత ఆవులేరు అని బాగా ప్రసిద్ధిచెందింది. చివరకు ఆవులేరే కాలక్రమంలో ఆలేరుగా స్ధిరపడిపోయింది.

మహిషాసురమర్దిని 8,9వ శ.

ఇక రెండో ప్రచారం ఏమిటంటే ఆరు ఏరులు పారే ఊరు కాబట్టే ఆలేరుగా ప్రసిద్ధిచెందిందట. దీనికి ఆధారం ఏమిటంటే ఒకరాజు ఆరుఏరులుపారే ఊరుమీదుగా రంగనాయకుని విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకుని వెళుతున్నపుడు విగ్రహం ఉన్న బండి ఒక ఏరులో దిగబడిపోయింది. ఎంతమంది సైనికులు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా బండిని ఏరులో నుండి బయటకు తీసుకురాలేకపోయారు. చేసేదిలేక రాజుతో పాటు పరివారమంతా రాత్రికి ఆక్కడే బసచేసింది. ఆ రాత్రి రంగనాయుకుడే రాజు కలలో కనబడి ‘శ్రీరంగపట్నంలో సప్త కావేరులున్నట్లే ఇక్కడ కూడా ఏడుపాయలు ప్రవహిస్తున్న కారణంగా ఇక్కడే తన విగ్రహాన్ని ప్రతిష్టించాల’ని ఆదేశించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రంగనాయకుడు కలలో కనిపించినట్లుగానే రాజు ఆరుఏరులున్న ప్రాంతంలోనే దేవాలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ విషయం రంగనాయుకుని గుడిపూజారి కీర్తిశేషులు కొండమయ్యగారి భార్య ద్వారా జనాలందరికీ తెలిసింది. ఏడు ప్రవాహాలు ఉండటం వల్ల ఏరులవూరే క్రమేణా ఆలేరుగా స్ధిరపడిందని చరిత్రలో ఉంది.

రంగనాయకస్వామి(16వ శ.)

దీనికి సంబంధించిందే మరో ప్రచారం కూడా ఉంది. బ్రిటీషువారి కాలంలో ఆలేరు పేరును ఏదో సందర్భంలో శిలాఫలకాల మీద తెలుగులో అలయార్ అని, ఇంగ్లీషులో Alair అని ఒక తమిళ శిల్పి చెక్కాడట. దాంతో బ్రిటీషు వాళ్ళు ఇంగ్లీషులోని పేరునే పరిగణలోకి తీసుకుని ఆలేర్ అని స్ధిరపరిచారని ప్రచారంలో ఉంది. బ్రిటీషు వాళ్ళు పలికిన, రాసిన Alair పేరే ఇప్పటికీ ఇంగ్లీషులో ఆలేరుకు స్ధిరపడిపోయిందని ప్రచారంలో ఉంది. అయితే ఆవులఏరు-ఆవులేరు-ఆలేరుకు రెండువేల సంవత్సరాల చరిత్రుంది కాబట్టి అప్పటికి ఈ ఊరికి ఇంగ్లీషు పేరు వచ్చే అవకాశమే లేదని కొందరు చరిత్రకారులు ఖండిస్తున్నారు. ఎక్కువమంది చరిత్రకారులు ఆవులేరే పరిణామక్రమంలో ఆలేరుగా స్ధిరపడిందని అభిప్రాయపడుతున్నారు.

కాలాముఖాచార్యుడు 10వ శతాబ్దం

చరిత్రకారుడు కందూరి ఈశ్వరదత్తు రాసిన ‘ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం’ ప్రకారం కల్యాణీ చాళుక్యుల ఏలుబడిలో ఆలేరు ఒక కంపణం. కంపణం అంటే ఒక దేశవిభాగం. కన్నడభాషలో కంపణం అంటే కొన్ని గ్రామాలను కలిపే మండలం లేదా విషయం. ఇక్కడ విషయం గ్రామాలు, ఊర్లు కాబట్టి కంపణం అంటే మండలం అనే తీసుకోవాలి. కాబట్టి చరిత్రక ఆధారాల ప్రకారమే ఆలేరు 40-60 గ్రామాలకు పరిపాలనా కేంద్రంగా ఉండే పాలకప్రాంతంగా అంటే పెద్ద మండలంగా ఉండేదని అర్ధమవుతోంది. చాళుక్య చక్రవర్తి జగదేకమల్లుని కాలంలో కొల్లిపాక-7000 విభాగంలో ఆలేరు 40వ కంపణంగా ఉండేదని చరిత్రలో గ్రంధస్ధమై ఉంది. ఆలేరు 40వ కంపణంలో పడమరవైపు భువనగిరి దాకా, దక్షిణాన పులిగిళ్ళ, సుంకిశాల దాక, తూర్పున వెల్మజాల దాక, ఉత్తరాన కొన్నె దాకా ఆలేరు విస్తరించినట్లుగా చరిత్ర చెబుతోంది.

ఆలేరు పాటిగడ్డ మీద పరుపురాతిబండ మీద చెక్కివున్న రాతిబొద్దులు(కప్యూల్స్) 4న్నర వేల సం. కిందటివి...నక్షత్రరాశి చిత్రం కావచ్చు.



ఆలేరులోని రెడ్డికాలువ ఒడ్డున ఆలేరు శాసనం బయటపడింది. నల్లగొండ జిల్లా శాసనసంపుటి-1లో ఆలేరు శాసనం 42వది. రెడ్డికాలవ ఒడ్డున దొరికిన శాసనం క్రీస్తు శకం 1125 కాలంనాటిది కావచ్చని చరిత్రకారులు అంచనా వేశారు. ఆలేరుకు చరిత్రలో చాలా ప్రాధాన్యతే ఉందని ప్రముఖ చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలంగాణా ఫెడరల్ తో చెప్పారు. ‘ఆలేరుకు చరిత్రలోని పేర్లగురించి గుడిపూజారి కొండమయ్యగారి భార్య తమకు ఎన్నోసార్లు చెప్పి’నట్లు హరగోపాల్ గుర్తుచేసుకున్నారు. ‘చరిత్రలో ఆలేరు(ఆవులేరు)కి ఎంతో ప్రాధాన్యత ఉండేదన్న విషయం చారిత్రక ఆధారాల కారణంగా అర్ధమవుతోంద’ని హరగోపాల్ అన్నారు. ఆలేటి కంపణం-చరిత్ర అనే పుస్తకాన్ని కూడా హరగోపాల్ రాశారు. అందులో ఆలేరుకు సంబంధించిన చారిత్రక విశేషాలను పొందుపరిచారు.

Read More
Next Story