బీఆర్ఎస్ తో అవసరం బీజేపీకే ఎక్కువుందా ?
x
kcr and bandi

బీఆర్ఎస్ తో అవసరం బీజేపీకే ఎక్కువుందా ?

బీఆర్ఎస్ అవసరం కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువుంది. ఎలాగంటే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్ధిరంగానే ఉంది.


కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతు బీఆర్ఎస్ అవసరం తమకన్నా కాంగ్రెస్ కే ఎక్కువుందని చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అవసరమని బండి అబిప్రాయపడ్డారు. పైకి చూస్తే బండి చెప్పింది నిజమే అనిపిస్తుంది కాని అది పూర్తిగా నిజంకాదు. బీఆర్ఎస్ అవసరం కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువుంది. ఎలాగంటే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్ధిరంగానే ఉంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చినా మిత్రపక్షం సీపీఐకి ఉన్న ఒక్క సీటుతో పాటు బీఆర్ఎస్ ఫిరాయింపులు 10 ఎంఎల్ఏలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్ధిరంగానే ఉంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను కూలదోసి అధికారంలోకి రావాలని అనుకున్నా బీఆర్ఎస్ కు సాధ్యంకాదు.

ఎందుకంటే బీఆర్ఎస్ కున్న బలం ఇపుడు 28 మాత్రమే. ఈ బలంతో అధికారంలోకి రావటం బీఆర్ఎస్ కు అయ్యేపనికాదు. కాంగ్రెస్ అధికారంలోనే ఉన్నా బీఆర్ఎస్ ఎంఎల్ఏల బలం అవసరం లేకపోయినా రేవంత్ ఎందుకు కారుపార్టీ ఎంఎల్ఏలను లాగేస్తున్నట్లు ? ఎందుకంటే ప్రతీకార రాజకీయాలే అనిచెప్పాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, టీడీపీలని ఎలాగ ఇబ్బంది పెట్టారో ఇపుడు రేవంత్ కూడా అదే పద్దతిలో వెళుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కుంటున్నారంటే దానర్ధం కాంగ్రెస్ కు అవసరమైకాదు. కేసీఆర్ ను జీరో చేయటమే రేవంత్ రెడ్డి టార్గెట్ కాబట్టే ఒక్కో ఎంఎల్ఏని లాగేసుకుంటున్నారు.

ఇక బీజేపీ విషయం చూస్తే కమలంపార్టీలో ఎంతమంది కారుపార్టీ ఎంఎల్ఏలు చేరినా ఎలాంటి ఉపయోగముండదు. అధికారంలోకి ఏ పార్టీ రావాలన్నా సింపుల్ మెజారిటి 62 మంది ఎంఎల్ఏలుండాలి. బీజేపీకి ఇపుడున్నది ఎనిమిది మంది మాత్రమే. బీఆర్ఎస్ లో ఉన్న 28 మంది కలిసినా రెండుపార్టీలు అధికారంలోకి వచ్చేది లేదు. మరెందుకు బీజేపీకి బీఆర్ఎస్ అవసరం ఉంది ? బీజేపీకి బీఆర్ఎస్ బలం ఎక్కడ అవసరం అంటే రాజ్యసభలో. లోక్ సభలో అంతంతమాత్రం బలంతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయేకి రాజ్యసభలో సరిపడా బలంలేదు. ఏబిల్లు పాస్ అవ్వాలన్నా లోక్ సభలో ఎలాగో అలా నెగ్గించుకున్నా రాజ్యసభలో కష్టమే. 229 మంది ఎంపీలున్న రాజ్యసభలో ఏ బిల్లు నెగ్గాలన్నా అధికారపార్టీకి కనీసం 115 మంది ఎంపీలుండాలి. ఇపుడు రాజ్యసభలో ఎన్డీయేకి ఉన్నది 110 మంది ఎంపీలు మాత్రమే.

బీఆర్ఎస్ గనుక బీజేపీకి మద్దతిస్తే నరేంద్రమోడికి కాస్త టెన్షన్ తగ్గుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ ఎంపీలున్నారు. బీఆర్ఎస్ ఇపుడు ఎన్డీయేలో లేనట్లే ఇండియా కూటమిలో కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ నలుగురు రాజ్యసభ ఎంపీలతో బీజేపీకి మద్దతుగా నిలిస్తే మిగిలిన ఒక్క ఎంపీ ఓటును మోడి ఏదోవిదంగా సంపాదించుకుంటారు. లేకపోతే ఐదుఓట్ల కోసం నానా అవస్తలు పడాలి. ఇదే సమయంలో బీఆర్ఎస్ జాతీయస్ధాయిలో ఇండియా కూటమికి మద్దతుగా నిలిచినా కూటమికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే రాజ్యసభలో బిల్లులను ఓడించేంత బలం ఇండియా కూటమికి లేదు.

బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీల మద్దతుతో ఎన్డీయే కూటమి బిల్లులను నెగ్గించుకునే అవకాశం ఉందికాని ఇండియా కూటమికి బిల్లులను ఓడించేంత బలంరాదు. ఏ కోణంలో చూసినా బీఆర్ఎస్ అవసరం కాంగ్రెస్ కన్నా బీజేపీకే చాలా ఎక్కువుంది. కాబట్టి బండి సంజయ్ చెప్పింది పూర్తిగా అబద్ధమని తేలిపోతోంది. అయినా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు లేకపోతే విలీనం అన్నది బండి సంజయ్ స్ధాయిలో తేలేది కాదని అందరికీ తెలిసిందే. అటు నరేంద్రమోడి, ఇటు కేసీఆర్ అనుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. బండి చెప్పారనో లేకపోతే వ్యతిరేకించారనో జరగాల్సింది జరగకమానదు.

Read More
Next Story