హరీష్ గోలేమిటో అర్ధంకావటంలేదే
x
Harish Rao

హరీష్ గోలేమిటో అర్ధంకావటంలేదే

ముఖ్యమంత్రి పర్యటన పై ఎన్నికల కమిషన్ తో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు


బీఆర్ఎస్ ఎంఎల్ఏ, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు వ్యవహారం మరీ విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనలను నిలిపేయాలని గోలచేయటమే విడ్డూరంగా ఉంది. పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రేవంత్ రాష్ట్రవ్యాప్త పర్యటనలను నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించాలని హరీష్(Harish Rao) డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. పంచాయితీ ఎన్నికలు(Panchayat elections) జరుగుతున్నది గ్రామస్ధాయిలో. రేవంత్ పర్యటిస్తున్నది జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో. గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి(Revanth)రేవంత్ జిల్లా కేంద్రాలకు, మున్సిపాలిటీల్లో కూడా పర్యటించకూడదని హరీష్ చెప్పటం విచిత్రంగానే ఉంది. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదన్నరేళ్ళు మంత్రిగా పనిచేసిన హరీష్ కు ఎన్నికల నిబంధనలు అంతమాత్రం తెలీకుండానే ఉంటుందా ?

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముఖ్యమంత్రి లేదా మంత్రుల అధికారపర్యటనలు ఉండకూడదన్నది ఎన్నికల నిబంధన. నిబంధనల ప్రకారమే రేవంత్ పంచాయితీల్లో పర్యటించటంలేదు. కొత్త హామీలు కూడా ఏమీ ఇవ్వటంలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇందిరమ్మ చీలర పంపిణీని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం చీరలపంపిణీని కూడా నిలిపేసిన విషయం అందరికీ తెలిసిందే. చీరలపంపిణీ పథకంలో లబ్దిదారులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలే కాబట్టి పంపిణీని నిలిపేయాలని కమిషన్ ఆదేశించగానే ప్రభుత్వం కూడా నిలిపేసింది. కొత్త పథకాలు లేదా హామీలను కూడా రేవంత్ ఎక్కడా ప్రకటించటంలేదు. అయినా హరీష్ బాధేమిటో అర్ధంకావటంలేదు.

మూడువారాల పాటు పంచాయితీ ఎన్నికలు జరిగితే మూడువారాలూ రేవంత్ సచివాలయం దాటి బయటకు అడుగుపెట్టకూడదు అన్నట్లుంది హరీష్ వాదన. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ లో పర్యటనను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించి ఎన్నికల కమిషన్ వెంటనే రేవంత్ మీద కేసు నమోదుచేయాలని హరీష్ డిమాండ్ చేయటం ఆశ్చర్యమే. ఇలాంటి డిమాండునే మూడురోజుల క్రితం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న రేవంత్ మీద చర్యలు తీసుకోవాలని కమిషన్ కు కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే.

కవిత, హరీష్ డిమాండ్లపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజియేందర బోయి స్పందించారు. కలెక్టర్ ఏమన్నారంటే రేవంత్ పర్యటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన పై ఎన్నికల కమిషన్ తో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో సీఎం నిరభ్యంతరంగా పర్యటించవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ విషయం కవిత, హరీష్ కు తెలీకుండానే గోలచేస్తున్నారా ? తెలుసు తెలీకుండా ఎందుకుంటుంది ? తెలిసినా కూడా రేవంత్ కు వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడాలి, ఆరోపణలు, విమర్శలు చేయాలన్న తాపత్రయం తప్ప ఇంకోటికాదు.

రేవంత్ పర్యటనల్లో తప్పులేదు : దుద్దిళ్ళ

పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రేవంత్ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించకూడదన్న బీఆర్ఎస్ డిమాండ్ అర్ధరహితమని పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సీఎం పర్యటనలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి పర్యటిస్తున్నది జిల్లా కేంద్రం లేదా మున్సిపాలిటి పరిధిలో మాత్రమే అని మంత్రి గుర్తుచేశారు. రేవంత్ పర్యటనల విషయంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ అనవసరంగా గోలచేస్తున్నట్లు శ్రీధర్ బాబు మండిపడ్డారు.

Read More
Next Story