బీఆర్ఎస్ పై కవిత ఆరోపణలు, క్షమాపణలు..కేటీఆర్ కు తలనొప్పేనా ?
x
Kavitha in Janambata and KTR in jubilee Hills Road show

బీఆర్ఎస్ పై కవిత ఆరోపణలు, క్షమాపణలు..కేటీఆర్ కు తలనొప్పేనా ?

ఉద్యోగాల భర్తీ, అవినీతి పరిపాలన, సామాజికతెలంగాణ, టెలిఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై కవిత మాట్లాడుతు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఫెయిలైందని అంటున్నారు


జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపుకు ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నానా అవస్తలు పడుతుంటే మరోవైపు చెల్లెలు, జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో(Jubilee Hills by poll) గెలుపు బీఆర్ఎస్ కు చాలా అవసరం. అందుకనే కేటీఆర్(KTR) రాత్రనక, పగలనకా నియోజకవర్గంలో ప్రచారం చేస్తు, రోడ్డుషోలు చేస్తున్నారు. ఇదేసమయంలో జనంబాట పేరుతో పాదయాత్రచేస్తున్న కల్వకుంట్ల కవిత(Kavitha) ప్రతిరోజు జనాలతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగా కవితచేస్తున్న వ్యాఖ్యలు కేటీఆర్ కు పెద్దతలనొప్పిగా తయారవుతున్నాయి. ఉద్యోగాల భర్తీ, అవినీతి, పరిపాలన, సామాజికతెలంగాణ, టెలిఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై కవిత మాట్లాడుతు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఫెయిలైందని అంటున్నారు.

ముందు ఉద్యోగాల భర్తీ గురించి నిరుద్యోగులతో మాట్లాడినపుడు తమ ప్రభుత్వం చేయాల్సినన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదని అన్నారు. బీసీసంఘాల నేతలతో మాట్లాడుతు భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము కాని సామాజికతెలంగాణను సాధించుకోలేకపోయినట్లు అంగీకరించారు. అంటే పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో బీసీలను పట్టించుకోలేదని అంగీకరించటమే కదా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్లు అంగీకరించారు. ఒకవైపు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ తో పాట అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోర్టులో పిటీషన్లు వేసి న్యాయపోరాటంచేస్తున్నారు. ఇదేసమయంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించటమే కాకుండా హరీష్, సంతోష్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించటం పెద్ద సంచలనమైంది.

కాంగ్రెస్ హయాంలో అరాచకాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ రౌడీషీటర్ అంటు కేటీఆర్ ప్రచారం చేస్తుంటే మరోవైపు కవిత మాట్లాడుతు తనభర్త టెలిఫోన్ను కూడా బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ చేయించినట్లు పెద్ద బాంబు పేల్చారు. సొంత బావ ఫోన్ను ఎవరైనా ట్యాప్ చేయిస్తారా అంటూ పేరు ప్రస్తావించకుండా కేటీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. పార్టీ తరపున పోటీచేస్తున్న మాగంటి సునీతకు ఓట్లేయాలని అడుగుతు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. పాదయాత్రలో కవిత మాట్లాడుతు కేటీఆర్ పై రివర్సులో ఆరోపణలు చేస్తున్నారు. సొంతచెల్లెలుకు అన్యాయంచేసి, అవమానం చేసి ఇంట్లోనుండి బయటకు వెళ్ళేట్లు కుట్రలు చేశారంటు కేటీఆర్ పై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

ఇక అమరవీరుల త్యాగాల గురించి కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీని బాగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయంచేయటంలో తాను ఫెయిలైనట్లు అంగీకరించి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే తమ ప్రభుత్వం 580 మందికి మాత్రమే పదవులు, ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించినట్లు అంగీకరించారు. అందరికీ అవకాశాలు కల్పించలేకపోయిన విషయంలో తాను క్షమాపణలు కోరుతున్నానని, వారి తరపున కొట్లాడలేకపోయినట్లు అంగీకరించారు.

జనంబాటలో కవిత బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను అంగీకరిస్తు క్షమాపణలు చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలను, క్షమాపణలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ తదితరుల గురించి కవిత చేసిన వ్యాఖ్యలను ప్రచారంలో రేవంత్, మంత్రులు గుర్తుచేస్తున్నారు. ఇంటిబిడ్డనే మోసంచేసి తరిమేసిన కేటీఆర్ ఇక అభ్యర్ధి మాగంటి సునీతకు ఏమి న్యాయంచేస్తాడో ఆలోచించాలని ఓటర్లకు సూటిగా చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై కవిత చేసిన సామాజికతెలంగాణ వ్యాఖ్యలను రేవంత్, మంత్రులు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో 1.30 లక్షలమంది బీసీ ఓటర్లున్నారు.

కాంగ్రెస్ హయాంలో అరాచకాలు జరుగుతున్నాయని, అభ్యర్ధి రౌడీషీటర్ అంటు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు, ప్రచారంపై రేవంత్, మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. ఎలాగంటే సొంత బావతో పాటు వేలాదిమంది ఫోన్లను ట్యాప్ చేయించటం, పోక్సో కేసుతో పాటు మరెన్నో కేసులున్న సల్మాన్ ఖాన్ను పార్టీలో కేటీఆర్ చేర్చుకోవటం లాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షకోట్లరూపాయలను దోచుకోవటం లాంటి అనేక కుంభకోణాలను రేవంత్, మంత్రులు జనాలకు గుర్తుచేస్తున్నారు. తనపైన, పార్టీపైన కవిత చేస్తున్న ఆరోపణలు ఒకవైపు వాటి ఆధారంగా రేవంత్, మంత్రులు చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్ సమాధానాలు చెప్పుకోవటానికి నానా తంటాలుపడుతున్నారు. మొత్తంమీద కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్-కవిత ఒక వ్యూహం ప్రకారం ఆరోపణలతో దాడులుచేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో ‘శతృవుకు శతృవు మిత్రుడు’ అనే నానుడి కేటీఆర్-రేవంత్-కవిత విషయంలో వాస్తవం అవుతున్నట్లే ఉంది.

Read More
Next Story