చంద్రబాబును చూసి రేవంత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందా ?
x
Revanth and Chandrababu

చంద్రబాబును చూసి రేవంత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందా ?

రేవంత్ పడుతున్న అవస్తలు చూస్తుంటే సామెత వర్తించదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి


ఆరుమాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత అందరికీ తెలిసిందే. అయితే అందరివిషయంలోను ఆ సామెత నిజం అవుతుందని అనుకునేందుకు లేదు. రేవంత్ పడుతున్న అవస్తలు చూస్తుంటే సామెత వర్తించదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణంఏమిటంటే ఏపీలో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) పరిపాలనను, తెలంగాణ(Telangana)లో రేవంత్ పాలనతో జనాలు పోల్చిచూస్తున్నపుడు తేడాలు స్పష్టంగా తెలిసిపోతున్నది. ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్ కిందామీదా అయిపోతున్నాడు. రేవంత్ ఒకడుగు ముందుకేస్తే బీఆర్ఎస్ పది అడుగులు వెనక్కు లాగుతోంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ)400 ఎకరాల వివాదాన్ని ఎదుర్కోవటంలో రేవంత్ పడుతున్న అవస్తలను అందరు చూస్తున్నదే. భౌగోళికంగా హెచ్సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాలను వేలంద్వారా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయించిందో అప్పటినుండి వివాదం మొదలైంది. యూనివర్సిటికి చెందిన 400 ఎకరాలను ప్రభుత్వం ఎలాగ అమ్ముతుందని విద్యార్ధులు గోలమొదలుపెట్టారు. దాన్ని యూనివర్సిటి ఉద్యోగులు అందుకున్నారు. వీళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు రంగంలోకి దిగేశాయి. ఇంకేముంది యూనివర్సిటి కాంపౌండులో ప్రతిరోజు రచ్చరచ్చ జరుగుతోంది. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. మీడియాతో పాటు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్, కవితలు నానా రచ్చచేస్తు రేవంత్ ను ఉతికి ఆరేస్తున్నారు. యూనివర్సిటి భూములను అమ్మటానికి రేవంత్ కు సిగ్గుందా అంటు నిలదీస్తున్నారు. ప్రభుత్వం అమ్మాలని అనుకుంటున్న 400 ఎకరాలు యూనివర్సిటీవి కావు ప్రభుత్వానివే అని రేవంత్, మంత్రులు ఎంతమొత్తుకుంటున్నా జనాలు పట్టించుకోవటంలేదు. పైగా ఈ వివాదం ఇపుడు కోర్టు విచారణను ఎదుర్కొంటోంది.

ఇక్కడే రేవంత్(Revanth)సామర్ధ్యంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమస్యలను ఎలా అధిగమిస్తున్నారు ? తెలంగాణలో రేవంత్ ఎక్కడ ఫెయిలవుతున్నారనే విషయంలో చర్చలు మొదలయ్యాయి. దశాబ్దాల సన్నిహితం ఉన్నా కూడా చంద్రబాబు నుండి రేవంత్ ఏమీ నేర్చుకోలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు గొప్పమేథావి ఏమీకాదు. ఆయనలో ఉన్న సామర్ధం ఏమిటంటే మేనేజిరల్ స్కిల్స్ మాత్రమే. ఎవరిని ఎక్కడ మ్యానేజ్ చేయాలో బాగా తెలుసు. ఈ స్కిల్ తోనే 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి కూడా ధైర్యంగా జనాల్లో తిరుగుతున్నారు. మీడియాను మ్యానేజ్ చేసి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేసినట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటు తిరిగేస్తున్నారు. ఒకవైపు ఆర్ధికపరిస్ధితి బాగాలేదు కాబట్టి హామీలను అమలుచేయలేకపోతున్నట్లు చెబుతునే మరోవైపు అన్నీహామీలను నెరవేర్చేసినట్లు ప్రచారం చేయించుకుంటున్నారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటంకోసం రేవంత్ చాలా హామీలిచ్చారు. ఇందులో 6 గ్యారెంటీలు చాలా ముఖ్యమైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల్లో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచటం, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్ హామీలను అమల్లోకి తెచ్చారు. రైతురుణమాఫీని పాక్షికంగా అమలుచేశారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్ ఇంకా అమల్లోకి రాలేదు. విద్యార్ధినులకు ఉచిత స్కూటీలు, మహిళలకు తులంబంగారం హామీలగురించి అసలు ఎక్కడా మాట్లాడటంలేదు.

ఇదేసమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కూడా అనేక హామీలిచ్చారు. ఇందులో కూడా 6 గ్యారెంటీలు చాలా ముఖ్యమైనవి. వాటిల్లో వృద్ధాప్యపెన్షన్ రు. 4 వేలకు పెంచటం ఒకటే అమలుచేశారు. మిగిలిన 5 హామీలను గాలికొదిలేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలేదు, మెగా డీఎస్సీ లేదు. వాలంటీర్లకు నెలకు రు. 10 వేలిస్తానని చెప్పి ఏకంగా వ్యవస్ధనే రద్దుచేశారు. రైతులకు ఏడాదికి 20 వేలు లేదు, అమ్మఒడి పథకం అడ్రస్సేలేదు. హామీలిచ్చి గాలికొదిలేసిన చంద్రబాబు హ్యాపీగానే ఉన్నారు. కాని అలాంటి హామీలే ఇచ్చిన రేవంత్ మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ దెబ్బను తట్టుకోవటం రేవంత్ వల్ల కావటంలేదు. ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకుని తన మీడియా, సోషల్ మీడియాలో రేవంత్ ను బీఆర్ఎస్ దుమ్ముదులిపేస్తోంది.

తాజా వివాదమే తీసుకుంటే హెచ్సీయూ(HCU) పరిధిలో ఉన్న 400 ఎకరాలు యూనివర్సిటీవి కానేకాదు. 2003లో యూనివర్సిటి నుండి చంద్రబాబునాయుడు ప్రభుత్వం 400 ఎకరాలను తీసుకుని ఐఎంజీ భారత్ అనే ప్రైవేటుసంస్ధకు కట్టబెట్టింది. 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయింపులను రద్దుచేసింది. దాంతో ఐఎంజీ కోర్టులో కేసువేసింది. ఆకేసు హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. తర్వాత సుప్రింకోర్టులో కూడా ఆ భూములు ప్రభుత్వానివే అని తీర్పొచ్చింది. సుప్రింకోర్టు తీర్పుప్రకారమే సదరు 400 ఎకరాలు ప్రభుత్వానివే అని స్పష్టమైపోయింది. అయినా ఆభూములను బీఆర్ఎస్ యూనివర్సిటీవే అని రచ్చరచ్చ చేస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలను రేవంత్ ప్రభుత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్న విషయం అర్ధమవుతోంది.

400 ఎకరాలను ప్రైవేటుసంస్ధలకు అప్పగిస్తే పర్యావరణం దెబ్బతింటుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత ఆరోపణలే విచిత్రంగా ఉన్నాయి. 111 జీవో పరిధిలో వందల ఎకరాలు కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కబ్జాలకు గురయ్యాయి. జలవనరుల రక్షణకే జీవో 111 ఉన్నది. అయితే ఆ జీవోను లెక్కచేయకుండా బీఆర్ఎస్ పదేళ్ళపాలనలో వందల ఎకరాలు కబ్జాకు గురైన విషయం అందరికీ తెలిసిందే. తమహయాంలో జరుగుతున్న కబ్జాలను క్లియర్ చేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలకు ఎందుకు అనిపించలేదు ? 2015లో పేదలకు నిర్మించాలని అనుకున్న ఇళ్ళకోసం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 11 ఎకరాలను తీసుకోబోతున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. తాము అధికారంలో ఉంటే ఏమిచేసినా ప్రజా ప్రయోజనాల కోసమే అని చెప్పుకున్న గులాబీ గ్యాంగ్ ప్రతిపక్షంలోకి రాగానే అదే పనిచేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు నానా గోలచేస్తోంది.

నిజానికి మెయిన్ మీడియా సపోర్టు రేవంత్ కు బాగానే ఉంది. అయితే సమస్యల్లా సోషల్ మీడియా(BRS Social Media) నుండే వస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందు మెయిన్ మీడియా లేదా కాంగ్రెస్(Congress) పార్టీకి మద్దతుగా ఉన్న సోషల్ మీడియా తట్టుకోలేకపోతోంది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలావాటిని నెరవేర్చలేదు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని బహిరంగసభలో ప్రకటించిన హామీ ఏమైంది ? ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తానన్న హామీని కేసీఆర్ తుంగలో తొక్కేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు ప్రకటించిన దళితబంధు తర్వాత అమలుకాలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇపుడు రేవంత్ కనీసం 6 గ్యారెంటీల్లో మూడింటిని అమలుచేస్తున్నాడు. అయినా సరే అమలవుతున్న గ్యారెంటీలతో కలిపి అమలుకాని హామీలపై కేటీఆర్ అండ్ కో ప్రతిరోజు రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. హామీల అమలుకు భూములను అమ్ముకోవటం ఒకటే మార్గమన్నట్లుగా రేవంత్ మాటల్లో అర్ధం కనిపిస్తోంది. అందుకనే వివాదాస్పద 400 ఎకరాలను వేలంద్వారా అమ్మనీయకుండా బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇంతకుముందు మూసీనది సుందరీకరణ విషయంలో కూడా రేవంత్ కు తలబొప్పికట్టింది. మూసీ సుందరీకరణకు బీజంపడిందే బీఆర్ఎస్ హయాంలో. నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలను నూరుశాతం తొలగించాల్సిందే అని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే తర్వాత ఎన్నికలు రావటంతో ప్రాజెక్టు అటకెక్కింది.

రేవంత్ ముఖ్యమంత్రి కాగానే అదే మూసీనది(Musi River Project) ప్రాజెక్టును టేకప్ చేయగానే ఆక్రమణలు తొలగించేందుకు లేదంటు బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ ఎంత రచ్చచేసిందో అందరుచూసిందే. ప్రాజెక్టు ముందుకుపోకుండా కోర్టులో కేసులు కూడా వేయించారు. ఇపుడు ప్రాజెక్టు పరిస్ధితి ఏమిటో ఎవరికీ తెలీదు. జలవనరులను కాపాడేందుకు రేవంత్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేస్తే ఈ విషయంలో కూడా కేటీఆర్, హరీష్ నానా రచ్చచేస్తున్నారు. బీఆర్ఎస్ హయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేల ఆక్రమణలను నేలమట్టంచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆక్రమణలన్నింటినీ కూల్చేయాలని ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. మరదే పనిని ఇపుడు రేవంత్ ప్రభుత్వం హైడ్రా(Hydra) పేరుతో చేస్తుంటే కేటీఆర్ అండ్ కో నానా గోలచేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబుతో కలిసి రేవంత్ ఎన్నిసంవత్సరాలు ప్రయాణంచేసినా నేర్చుకున్నది పెద్దగా లేదనే అనిపిస్తున్నది. అందుకనే హామీలిచ్చి మోసంచేయటంలో, అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోవటంలో చంద్రబాబును చూసి రేవంత్ చాలా నేర్చుకోవాలని అనిపిస్తోంది.

Read More
Next Story