‘ఆల్మట్టిపై మీరు పోరాడతారా? మేమే పోరాడాల్నా?’
x

‘ఆల్మట్టిపై మీరు పోరాడతారా? మేమే పోరాడాల్నా?’

పులి అని చెప్పుకునే రేవంత్ పిల్లిలా ఇంట్లో కూర్చోవాల్నా..? అని ప్రశ్నించిన కేటీఆర్.


ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనముద్ర వేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచడానికి సన్నాహాలు చేసుకుంటుంటే ఈ పెద్దమనిషి రేవంత్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అచ్చంపేట‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన జ‌న గ‌ర్జ‌న స‌భ‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెరిగితే తెలంగాణ కరువు ప్రాంతంలా మారిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. అలాంటప్పుడు.. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా? ఆల్మట్టి దగ్గరకు వెళ్లి గర్జించాలా..? అని నిలదీశారు. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తును రూ.70 కోట్ల వ్యయంతో 18 అడుగులు పెంచాలని నిర్ణయించింది. అలా చేయడం ద్వారా కిందకు చుక్క నీరు రాకుండా ఆపాలన్నదే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ప్లాన్ అని కేటీఆర్ ఆరోపించారు. అదే జరిగితే పాలమూరుకు చుక్కనీరు అందదు, పాలమూరు అంతా కరువు ప్రాంతంలా మారే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

అసలైన పులి అంటే కేసీఆర్‌లా ఉంటది

పులి అని చెప్పుకోగానే పులి అయిపోతారా.. అని ఎద్దేవా చేశారు. ‘‘నిజమైన పులి ఎలా ఉంటుందంటే.. నడిగడ్డకు నీళ్లు రావట్లేదని మా నీళ్లు మాకు రావాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేసిన కేసీఆర్‌లా ఉంటుంది. రాయలసీమ ఎమ్మెల్యే ఒకమాట అన్నారు.. నడిగడ్డకు నీళ్లు రావాలని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.. కేసీఆర్ బ్లాక్ మెయిల్‌కు తలొగ్గి తూములు కింద‌కు దించితే వాటిని బాంబుల‌తో బ‌ద్ద‌లు కొడుతామ‌ని చెప్పిండు. నిజమైన పులి అంటే కేసీఆర్. సమస్య అని తెలిసిన వెంటనే రంగంలోకి దూకి ఆర్డీఎస్ తూముల దగ్గర ఆయన అడుగుపెడితే అక్కడే ఉన్న సుంకేశుల బరాజ్‌ను వెయ్యి బాంబులతో తునాతునకలు చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. మరి ఆ దమ్మ ఈ నల్లమల పులికి ఉందా? ఆ తెగువ తెలుసా? సత్తా లేదా? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, నల్లగొండకు చుక్కనీరు రాని స్థితి వస్తే.. మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది? పాలమూరు ఎత్తిపోతల పథకం ఎక్కడిది? శ్రీశైలంలోకి కృష్ణా రాకపోతే పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది? ఇవన్నీ ఆలోచించుకోండి’’ అని కేటీఆర్ కోరారు.

మీరు చేస్తారా.. మమ్మల్నే పోరాడమంటారా..!

‘‘ఆల్మట్టి ఎత్తుపై రాహుల్ గాంధీ, రేవంత్ మాట్లాడారు కానీ.. యాక్షన్ తీసుకోవడానికి మాత్రం వాళ్లకి ఆలోచన కూడా లేదు. ఏది ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది ఒక్క కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ దండుగా అచ్చంపేట గడ్డపై నుంచి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్మట్టిని ఆపే దమ్ము ఉందా.. లేదంటే గులాబీ దండు బయల్దేరి ఆల్మట్టిని అడ్డుకోవాలా? నీ ప్ర‌భుత్వానికి ద‌మ్ము తెగింపు ఉంటే రాహుల్ వ‌ద్ద‌కు క‌ర్ణాట‌క సీఎంను పిలిపించి.. ఆల్మ‌ట్టి ఎత్తును విర‌మించుకోవాల‌ని డిమాండ్ చేయ్.. దాన్ని వెంట‌నే ఆపేయ్. ఆ ద‌మ్ము న‌ల్ల‌మ‌ల పులికి ఉందా’’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అచ్చంపేట బిడ్డకు తెగువ ఎక్కువ

‘‘రాష్ట్రంలోని మంత్రులకు తెలివి, సోయి లేకపోవచ్చు కానీ ఆచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగవ ఉంది. ఈ జిల్లా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను గెలుస్త‌ానో, గెలవనో నాకే తెలీదు.. మా ప్ర‌భుత్వం వ‌స్త‌ుందో రాదో తెలీదు.. కాబ‌ట్టి నేను ఎవరికీ మాట ఇవ్వ‌ను’ అని చెప్పారు. ఆయన మాట‌ల‌ను విని మేమంతా నవ్వుకున్నాం. జూప‌ల్లికి తెలియ‌దేమోకానీ.. అచ్చంపేట బిడ్డ‌ల‌కు మాత్రం బాగా తెలుసు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాద‌ని. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని న‌ల్ల‌మ‌ల్ల బిడ్డ‌ల‌కు తెలుసు.

రేవంత్‌ది రోజుకో మాట

‘‘ఇక్క‌డ పుట్టిన ఓ వ్య‌క్తి రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు. ఆయ‌న స్వగ్రామం కొండారెడ్డిప‌ల్లె వంగూరు మండ‌లం.. అటువైపు నుంచే నేను వ‌చ్చాను. ఆ ఊరిలో అయినా రేవంత్ గురించి చెప్త‌ారు అనుకున్నా. కానీ ఈ రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి పేద రైతు కుటుంబం నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి కేసీఆర్‌కు న‌చ్చ‌ట్లేద‌ు అంటారు. మరోరోజు తాను వ్య‌వ‌సాయం చేయ‌లేదు.. వాళ్ల తాత పోలీసు ప‌టేల్‌ అని చెప్తాడు. ఇంకోరోజు వాళ్ల తాత‌, తండ్రి మ‌స్తు వ్య‌వ‌సాయం చేశారు అంటారు. మొత్తంగా ఆయ‌న‌లో ఓ అప‌రిచితుడు దాక్కుని ఉన్నారు. పొద్దున రాములా ఉండి.. సాయంత్రం అవుతూనే రెమో అయిపోతుండ్రు. ఆయ‌న మాట‌లు రాష్ట్రం ప‌రువు తీసేలా ఉన్నాయి. ఆయ‌న పుట్టిన గ‌డ్డ అచ్చంపేట నుంచి జైత్ర‌యాత్ర మొద‌లుపెట్టాల‌ని జ‌న‌గ‌ర్జ‌న పెట్టుకున్నాం. మిమ్మ‌ల్ని చూస్తుంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడ‌గ‌డానికి వ‌స్తే బుద్ధి చెప్తార‌న్న విశ్వాసం క‌లుగుతుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read More
Next Story