రేవంత్ కు అసలైన పరీక్ష ముందుందా ?
x
Revanth with BRS MLAs Gandhi and others

రేవంత్ కు అసలైన పరీక్ష ముందుందా ?

అనర్హత కత్తి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల మీదే కాదు, వాళ్ళని ప్రోత్సహించిన ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) మీద కూడా వేలాడుతోంది


ఫిరాయింపుల నిరోధక చట్టం రూపంలో అనర్హత కత్తి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల మీదే కాదు, వాళ్ళని ప్రోత్సహించిన ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) మీద కూడా వేలాడుతోంది. ఎలాగంటే విచారణలో ఫిరాయింపు ఎంఎల్ఏ(BRS Defection MLAs)లు ఏమి సమాధానం ఇస్తారో తెలీదు. ఏ కారణంవల్లయినా ఫిరాయింపులపై అనర్హత వేటుపడి పది అసెంబ్లీనియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తే అప్పుడుంటుంది రేవంత్ కు అసలైన పరీక్ష. నిజానికి ఫిరాయింపులపై అనర్హత వేటు పడకుండా కాచుకోవాల్సిన బాధ్యత రేవతం మీదే ఉంది. ఎందుకంటే రేవంత్ ఇచ్చిన భరోసాతోనే పదిమంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్(Telangana Congress)లోకి ఫిరాయించారన్నది వాస్తవం. అలాంటిది వాళ్ళపై వేటుపడకుండా ఫిరాయింపులను కాపాడుకోలేకపోతే రేవంత్ మీద మిగిలిన ఎంఎల్ఏల్లో నమ్మకం సడలిపోతుంది.

ఇదేసమయంలో ఉపఎన్నికల్లో ఎంతమంది ఫిరాయింపులకు కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్లిస్తుందో తెలీదు. అందరికీ టికెట్లు ఇప్పించలేకపోతే రేవంత్ పలుచనైపోవటం ఖాయం. సర్వేలు చేయించి గెలుపు అవకాశాలు లేవన్న కారణంతో ఎవరికైనా టికెట్ల లేవని అంటే వాళ్ళపరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుక లాగ అయిపోతుంది. అదేదో సామెతలో చెప్పినట్లుగా టికెట్లు దక్కని ఎంఎల్ఏల పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడి లాగ తయారవుతుంది. ఒకవేళ అందరికీ టికెట్లు వచ్చినా ఉపఎన్నికల్లో ఎంతమంది గెలుస్తారో కూడా తెలీదు. పైగా వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన బాద్యత కూడా రేవంత్ మీదే ఉంటుంది. ఫిరాయింపుల్లో అందరినీ కాకపోయినా కనీసం మెజారిటి ఎంఎల్ఏలను అయినా గెలిపించుకోలేకపోతే రేవంత్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం నిజమే అనేందుకు ఊతమొస్తుంది. కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం కత్తి ఫిరాయింపు ఎంఎల్ఏల మీదే కాదు రేవంత్ మీద కూడా వేలాడుతోందనే చెప్పాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2023 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో లేకపోతే హైదరాబాద్ జిల్లా పరిధిలో కాంగ్రెస్ తరపున ఒక్కళ్ళు కూడా ఎంఎల్ఏగా గెలవలేదు. ఇదేసమయంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన 39 మంది ఎంఎల్ఏల్లో సుమారు 16 మంది గ్రేటర్ పరిధిలో గెలిచిన వారే. అంటే ఎన్నికల నాటికి గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కే ఎక్కువ పట్టుందన్నది అర్ధమవుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ లాస్య నందిని రోడ్డుప్రమాదంలో మరణించారు. ఆనియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీగణేష్ గెలిచారు. అలాగే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బోణికొట్టింది.

తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ నుండి శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కారుకు దూరమై కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వీళ్ళమీద కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం రూపంలో అనర్హత కత్తి వేలాడుతోంది. ఒకేసారి పదిమంది ఎంఎల్ఏల మీద అనర్హత వేటుపడితే అది పెద్ద సంచలనమవుతుంది. అందుకు కారకుడు రేవంతే అవుతారనటంలో సందేహంలేదు. పైనచెప్పినట్లుగా ఫిరాయింపులకు రేవంత్ భరోసా ఇవ్వకపోతే బీఆర్ఎస్ కి దూరమై కాంగ్రెస్ కు ఎంఎల్ఏలు దగ్గరయ్యే వాళ్ళేకాదు.

ఎంతమందికి సానుకూలం ?

అనర్హతవేటు ఎదుర్కోబోతున్న పదిమంది ఎంఎల్ఏల్లో ఎంతమందికి నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం ఉందన్నది కీలకం అవుతోంది. ఒకవేళ అనర్హత వేటుపడి ఉపఎన్నికలు వస్తే అప్పుడు వీళ్ళల్లో ఎంతమందికి గెలుపు అవకాశాలున్నాయి ? ఖైరతాబాదులో దానం పరిస్ధితి అయోమయంగా ఉంది. శేరిలింగంపల్లిలో గాంధి పరిస్ధితి పర్వాలేదు. చేవెళ్ళల్లో కాలె యాదయ్య గెలుపు అనుమానమే అంటున్నారు. పటాన్ చెరులో మహిపాల్, రాజేంద్రనగర్లో ప్రకాష్ పరిస్ధితి పర్వాలేదన్నట్లుగా ఉంది. స్టేషన్ ఘన్ పూర్ లో కడియంకు కష్టమనే మాట వినబడుతోంది. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్ధితి పర్వాలేదంతే. జగిత్యాలలో సంజయ్ కుమార్ కు కష్టమే అంటున్నారు. గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిస్ధితి పర్వాలేదనే సమాచారం ఉంది. భద్రాచలంలో తెల్లం వెంకటరావుకు గెలుపు అవకాశాలున్నాట్లు చెబుతున్నారు.

పై సమీకరణలన్నీ బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్ధుల ఎంపిక ఆధారంగా మారిపోయే అవకాశాలున్నాయి. అలాగే రేవంత్ 20 నెలల పరిపాలనపైన ఒకవిధంగా రెఫరెండమనే చెప్పాలి. ఏదో ఒక నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే వ్యూహాలు పన్నటం వేరు ఒకేసారి పదినియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తే ఎలక్షనీరింగ్ చేసుకోవటం వేరు. అధికారపార్టీ ఎంతమంది మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలను మోహరించినా జనాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఫిరాయింపుల్లో ఎంతమంది గెలుస్తారన్నది అనుమానమే. ఒకవేళ రేవంత్, మంత్రులు చెప్పుకుంటున్నట్లు ప్రభుత్వంపై జనాల్లో సానుకూల వాతావరణం ఉంటే కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే పదిమంది ఎంఎల్ఏలందరు గెలవటం తేలికవుతుంది.

రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరా, ఆరుగ్యారెంటీల అమలు, రైతుభరోసా పథకాన్ని తమ ప్రభుత్వం పక్కాగా అమలుచేస్తున్న కారణంగా ప్రజలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్నారని రేవంత్, మంత్రులు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపుకు వచ్చే ఎంఎల్ఏల సంఖ్య మరింతగా పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాంగ్రెస్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేమిటంటే ఉపఎన్నికలు ఖాయమైతే వాటిల్లో గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు సగమున్నాయి. బాన్సువాడ, భద్రాచలం, గద్వాల, జగిత్యాల, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు నూరుశాతం నగరంలోనే ఉంటే, చేవెళ్ళ, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కాస్త గ్రామీణ వాతావరణం ఉంటుంది. పోయిన ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఎక్కువ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే, గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల్లో మెజారిటి కాంగ్రెస్ గెలిచింది. బీజేపీకి మద్యస్ధ ఫలితాలు వచ్చాయి. బీజేపీకి గ్రేటర్ పరిధిలో సీట్లు లేకపోయినా జిల్లాల్లో అంటే సెమీ అర్బన్ వాతావరణం ఉండే 8 నియోజకవర్గాల్లో గెలిచింది.

అధిష్ఠానం వైఖరి

పదిమంది ఎంఎల్ఏలపైన అనర్హత వేటుపడితే రేవంత్ విషయంలో అధిష్ఠానం వైఖరి ఎలాగ ఉండబోతుందో చూడాలి. పది నియోజకవర్గాల్లో కనీసం మెజారిటి నియోజకవర్గాల్లో గెలిస్తేనే అధిష్ఠానం దగ్గర రేవంత్ కు కాస్తయినా గౌరవం ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడటం ఖాయం. అదే జరిగితే పార్టీలో రేవంత్ వ్యతిరేకులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగానే రెచ్చిపోతారనటంలో సందేహంలేదు. పార్టీలో రేవంత్ ఇమేజికి డ్యామేజి అవుతుందనటంలో సందేహంలేదు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల పరిస్ధితి చివరకు ఏమవుతుందన్నది కొద్దిరోజుల్లో తేలిపోతుంది.

Read More
Next Story