రేవంత్‌కు ఇక మూడో ఆప్షనే మిగిలిందా..
x

రేవంత్‌కు ఇక మూడో ఆప్షనే మిగిలిందా..

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై అత్యవసర సమావేశానికి కాంగ్రెస్ రెడీ.


స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో రేవంత్ అమ్ముల పొదిలో ఒక ఒకే ఒక అస్త్రం మిగిలిందా? అంటే అవున్న సమాధానమే వినిపిస్తుంది. ఎవరూ అబ్జక్షన్ చెప్పడానికి వీలు లేకుండా బీసీలకు 42 రిజర్వేషన్లు అమలు చేయాలి అనుకుంటే రేవంత్ దగ్గర ఉన్న అస్త్రమే పార్టీ పరంగా ముందుకు వెళ్లడం. ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీఓ 9 తీసుకొచ్చినప్పటికీ.. హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో కాంగ్రెస్ బీసీ నేతలతో అత్యవసర సమావేశానికి సీఎం రేవంత్ సిద్దమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్ల అంశంలో ఏ దిశగా ముందడుగు వేయాలన్న అంశంపై వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఆఖరికి అస్త్రాన్ని వినియోగించి పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం తీసుకుంటారా? లేదంటే హైకోర్టులో వాదనలు వినిపించి వచ్చే తీర్పును బట్టి ముందుకు వెళ్తారా? అనేది చూడాలి. అయితే హైకోర్టు నిర్ణయంతో బీసీలు న్యాయస్థానం దగ్గర ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బీసీ నేతలు, మంత్రులు బీసీలకు ధైర్యం చెప్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు.

రిజర్వేషన్లు పక్కా.. డౌట్ వద్దు..: వాకిటి

‘‘ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి దగ్గర ముద్ద లాగేసినట్లయింది. అయినా బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వారికి 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతాం. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తాం. సీఎం రేవంత్‌తో చర్చిస్తాం. సుప్రీం కోర్టుకు వెళ్లడంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కోర్టులో కేసులు వేయించింది బీఆర్ఎస్సే. బీజేపీతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించాం’’ అని ఆయన వివరించారు.

రేవంత్ చెప్పిన మూడు మార్గాలివే..

బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ దగ్గర మూడు మార్గాలు ఉన్నాయని రేవంత్ వెల్లడించారు. ‘‘రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్‌పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలి. జీవో ఇస్తే.. ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. కాబట్టి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదు. స్థానిక సంస్థలను వాయిదా వేయడం రెండో మార్గం. అదే చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయి. నిధులు ఆగితే గ్రామాల్లో వ్యవస్థలు కుదేలవుతాయి. ఇక ముచ్చటగా మూడో మార్గం.. పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం. ఈ పద్దతిని అవలంబించేలా ఇతర పార్టీలపై కూడా ఒత్తిడి తెస్తాం’’ అని రేవంత్ వివరించారు.

అయితే రేవంత్ రెడ్డి చెప్పిన మూడు మార్గాల్లో రెండు ఆల్‌రెడీ జరిగిపోయాయి. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు.. ప్రభుత్వం తెచ్చిన జీవోపై స్టే రావడంతో పాటు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక రేవంత్ దగ్గర మిగిలిన ఉన్న ఏకైక.. చివరి అస్త్రం పార్టీ పరమైన రిజర్వేషన్లు. ఇదే చేయాలంటే అఖిలపక్షంతో చర్చించి.. వారి ఆమోదం పొందిన తర్వాత.. మరోసారి ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని వివరిస్తూ లేఖ రాసి.. మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయించుకోవాల్సి ఉంటుంది. కాగా బీసీ రిజర్వేషన్ల జీఓ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా? వెళ్తే లాభం ఉంటుందా? అన్న అంశాలను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story