మూసీకి దక్షిణ కొరియా  చికిత్స
x
Revanth and Cheonggyecheon river in Seoul

మూసీకి దక్షిణ కొరియా చికిత్స

రేవంత్ ‘మూసీ ప్రాజ’క్టు కు మూలం దక్షిణ కొరియాలో ఉందా?


మూసీనది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఏ ముహూర్తంలో రేవంత్ రెడ్డి ప్రకటించారో కాని అప్పటినుండి ప్రతిరోజు వివాదాలకు నిలయమవుతునే ఉంది. ఇంతగా వివాదాలకు కారణమవుతున్న మూసీనది ప్రాజెక్టు అసలు కథేంటి ? ఎందుకిన్ని వివాదాలు ముసుకుంటున్నాయి? మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజామోదం పొందేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మూసీ ప్రక్షాళనను విజయవంతం చేయడం కష్టమేమీ కాదని చెప్పేందుకు శాసన సభ్యులను దక్షిణ కొరియా పంపిస్తున్నది. దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. విజయవంతమయ్యాయి. ప్రపంచం కంట పడ్డాయి. సోమవారం నుంచి అఖిల పక్ష బృందం ద. కొరియా వెళ్లున్నది. 25 బిజెపి, కాంగ్రెస్, ఎఐ ఎంఐఎం సభ్యులు ఈ బృందంలో ఉంటున్నారు. మూసీ ప్రాజక్టును రేవంత్ రియల్ ఎస్టేట్ ప్రాజక్టు అని వర్ణిస్తున్న బిఆర్ ఎస్ మాత్రం ఈ ట్రిప్ నుబహిష్కరించింది. వీరంతా కొరియాలో హాన్ (Han) రివర్ ప్రాజక్టును పరిశీలిస్తారు.


ఈ సందర్బంగా మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పాయింట్ బై పాయింట్ గా చెప్పేందుకు చిన్న ప్రయత్నం.

1. 2024, జనవరి 2వ తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా మూసీ ప్రాజెక్టును ప్రస్తావించారు. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో ప్రభుత్వంమీద ఎలాంటి ఆర్ధికభారం పడకుండా ప్రాజెక్టును అమలుచేయబోతున్నట్లు ప్రకటించారు.

2. రేవంత్ ప్రకటన తేనెతుట్టెను కదిపినట్లయ్యింది.

3. రేవంత్ ప్రకటన రావటం ఆలస్యం ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నానా గోల మొదలుపెట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ, గోల చేస్తునే ఉన్నారు.

4. ఈ నేపధ్యంలోనే రేవంత్ ఒక సమావేశంలో మాట్లాడుతు ప్రాజెక్టు అభివృద్ధికి లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని కూడా చెప్పారు. దాంతో రేవంత్ మీద కేటీఆర్, హరీష్ తదితరులు అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.

5. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు మూలం ధక్షిణ్ కొరియా రాజధాని సోల్ (Seoul) నగరంలోని 10.9 కిలోమీటర్ల పొడవున్న ‘చంగ్ యే చున్’ (Cheonggyecheon) నది. ఒకపుడు మంచినీటి నదిగా ఉన్న సోల్ లోని నది తర్వాత మురికికూపంగా తయారైంది. నగరం మధ్యలో నుండి ప్రవహిస్తున్న నది మురికికూపంగా మారటాన్ని భరించలేక సియోల్ మేయర్ లీ బాక్ ఒక ప్రాజెక్టును టేకప్ చేశారు. ఆ ప్రాజెక్టే చంగ్ యే చున్ ప్రాజెక్టు. 2003లో ప్రారంభమైన చంగ్ యే చున్ నది పునరుజ్జీవనం పనులు 2020కి పూర్తయ్యింది.

6. పునరుజ్జీవనంతో నది స్వరూపమే మారిపోయింది. స్వచ్చమైన నీరు, గాలి, అమ్యూజ్మెంట్ పార్కులు, చిల్ట్రన్ పార్కులు, రెస్టారెంట్లు, ఎంటర్ టైన్మెంట్ తదితరాల వల్ల చంగ్ యే చున్ నదిని ఏడాదికి 2 కోట్లమంది పర్యాటకులు వస్తున్నారు.

7. నది పునరుజ్జీవనం వల్ల జంతు, వృక్షజాతులు కళకళల్లాడుతున్నాయి. వాతావరణ కాలుష్యం కూడా 35 శాతం తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

8. పెట్టుబడుల ఆకర్షణకు అమెరికాకు వెళ్ళిన రేవంత్ అక్కడినుండి దక్షిణకొరియాకు వెళ్ళి సియోల్ లోని చంగ్ యే చున్ సుందరీకరణ ప్రాజెక్టును పర్సనల్ గా పరిశీలించారు.

9. మూసీనది సుందరీకరణ చేయాలంటే 57 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ప్రక్షాళన చేయాలి. నదికి రెండువైపులా 13 వేల ఇళ్ళు, వివిధ నిర్మాణాలను తొలగించాలి. ఎందుకంటే నది గర్భంలో 1697 ఇళ్ళు, నది బఫర్ జోన్లో 10 వేల ఇళ్ళున్నాయి. ఇవికాకుండా కమర్షియల్ నిర్మాణాలు సుమారు 1500 దాకా ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించకుండా నది సుందరీకరణ సాధ్యంకాదు. ఒకపుడు మంచినీటిని అందించిన మూసీనది దశాబ్దాలుగా మురికికూపంగా తయారైపోయింది. దీనికి అన్నీపార్టీలూ కారణమే.

10. మూసీనది మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రవహిస్తోంది. మలక్ పేట, కర్వాన్, అంబర్ పేట, నాంపల్లి, గోషామహల్, చాంద్రాయణగుట్ట, యాకత్ పుర, బహదూర్ పుర నియోజకవర్గాల్లో సుమారు 20 లక్షల మంది ఓటర్లున్నారు.

11. ఇళ్ళు, నిర్మాణాలను పూర్తిగా తొలగించిన తర్వాత నదిలోని నీటినంతటిని తోడేస్తారు. తర్వాత కొంతకాలం మంచినీటిని నదిలోకి వదులుతారు. 39 సూవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేసి కొంతకాలం నీటిని శుద్ధిచేస్తారు. కొంతకాలంపాటు నీటిని శుద్దిచేసిన తర్వాత కంపు వదిలిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా గోదావరి జలాలను మూసీలోకి విడుదలచేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ ప్రక్రియ మొత్తానికి రు. 5 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

12. మూసీకి రెండువైపులా ఉన్న ఇళ్ళు, నిర్మాణాలు, ఆక్రమణలన్నింటినీ క్లియర్ చేయిస్తే 25 వేల ఎకరాలు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కొంత రియల్ ఎస్టేట్ కు ఉపయోగిస్తే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. 25 వేల ఎకరాల్లోనే 120 కోట్ల చదరపు అడుగుల స్ధలాన్ని వర్తక, వాణిజ్యాలతో పాటు ఎంటర్ టైన్మెంట్ పార్కులు, మల్టీప్లెక్సులు తదితరాలకు కేటాయించాలని లెక్క గట్టింది.

13. ప్రభుత్వ నుండి లీకుల రూపంలో అందుతున్న ఈ వివరాలన్నింటినీ చూసిన తర్వాత ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ పై మండిపోతున్నాయి. దశాబ్దాలుగా ఇళ్ళు కట్టుకుని ఉంటున్న వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తారా అంటు నానా గోలచేస్తున్నాయి. మూసీనది ఎంతమాత్రం నివాసయోగ్యం కాదని కాబట్టి ఇళ్ళను ఖాళీ చేసిన వాళ్ళకు ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

14. ఎప్పటికైనా ఖాళీ చేయకతప్పదని గ్రహించిన సుమారు 250 మంది తమ ఇళ్ళను ఖాళీ చేసేశారు. వీళ్ళందరికీ పోచారం ఐటి సెజ్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ప్రభుత్వం కేటాయించింది. తక్షణ ఖర్చులకు ప్రతి కుటుంబానికి రు. 25 వేలు అందించింది. ఇది కాకుండా కుటుంబాల్లోని మహిళలు సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు స్వయంసహాయ గ్రూపుల కింద ప్రతి మహిళకు రు. 2 లక్షల అప్పిచ్చింది. ఇందులో రు. 60 వేలు మాత్రం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. 10 గ్రూపుల్లోని 170 మంది మహిళలకు మంత్రి దనసరి సీతక్క శుక్రవారమే రు. 3.44 కోట్ల చెక్కులను అందించింది.

15. మిగిలిన వాళ్ళని కూడా ఇళ్ళు ఖాళీ చేసేట్లుగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ బాధితులతో రెగ్యులర్ గా సమావేశాలు జరుపుతు కౌన్సిలింగ్ చేస్తున్నారు.

16. ఇళ్ళను వదలటం ఇష్టంలేని వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ నేతలను కలుస్తు తమ నిరసనలను తెలుపుతున్నారు. తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలు కూడా బాధితులకు మద్దతుగా రంగంలోకి దిగి నారా రచ్చ చేస్తున్నాయి.

17. గురువారం మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు డీపీఆర్ రెడీ చేయటానికి ఐదు కంపెనీలతో కన్సార్షియం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) డీపీఆర్ రెడీ చేయటానికే కన్సార్షియంకు ప్రభుత్వం రు. 143 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. డీపీఆరే రెడీ కానపుడు లక్షన్నర కోట్ల రూపాయలని ప్రతిపక్షాలు ఎలాగ చెబుతున్నాయంటు మండిపోయారు. ఒకపుడు తానే ప్రాజెక్టును లక్షన్నర కోట్లతో చేపట్టబోతున్నట్లు ప్రకటించిన విషయాన్ని రేవంత్ మరచిపోయినట్లున్నారు.

18. మురికినదిని మంచినీటి నదిగా మార్చటం దక్షిణకొరియాలో సాధ్యమైందంటే అక్కడి పాలకుల చిత్తశుద్ది, సంకల్పం, కమిట్మెంట్ కారణం. మరి మూసీనది సుందరీకరణలో మన పాలకులకు అంతటి చిత్తశుద్ది, సంకల్పం, కమిట్మెంట్ ఉన్నదా ?

Read More
Next Story