
6 అడుగుల బుల్లెట్ హరీష్ కూడా భయపడుతున్నారా ?
కల్వకుంట్ల కవిత తనపైన చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పటానికి మాత్రం ఇష్టపడలేదు
బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు వైఖరి చూస్తే ఇదే అనుమానం పెరిగిపోతోంది. శనివారం ఉదయం బ్రిటన్(Britain) నుండి హైదరాబాదు(Hyderabad)కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పుకున్నారు కాని కల్వకుంట్ల కవిత తనపైన చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పటానికి మాత్రం ఇష్టపడలేదు. మీడియా మిత్రులు ఎంతడిగినా హరీష్ మాత్రం కవిత(Kavitha)కు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కవిత తనపైన చేసిన ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారంతే.
ఎయిర్ పోర్టు నుండి తనింటికి వెళ్ళిన హరీష్ అక్కడినుండి ఎర్రవల్లి ఫామ్ హౌసుకు చేరుకుని పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మీడియాతో హరీష్ మాట్లాడలేదు. మామూలుగా అయితే హరీష్ వ్యవహారశైలి ఇలాగుండదు. తనపైన ఎవరైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే తిరిగి వాళ్ళపైన విరుచుకుపడిపోతారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, జరిగిన అవినీతికి హరీష్ మాత్రమే బాధ్యుడని కవిత స్పష్టంగా ఆరోపించారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని ఇన్నిరోజులుగా హరీష్ చేస్తున్న వాదనంతా అబద్ధాలని తేలిపోయింది కవిత ఆరోపణలతో. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు.
ఇదేవిషయమై 16మాసాలు విచారణచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా అవినీతి, అవకతవకలు జరిగిందని నిర్ధారించింది. అవినీతి, అవకతవకల్లో కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్ తో పాటు ఇంకా ఎవరెవరు బాధ్యులు ? వారిలో ఎవరి బాధ్యత ఎంత అన్న విషయాలను రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందించింది. మేడిగడ్డలో మూడు పిల్లర్లు, డ్యాం ప్లాట్ ఫామ్ లో కనబడుతున్న చీలికలే ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేందుకు రుజువులు. అవినీతి జరిగింది కాబట్టే నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయి. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయి చేశారు నిర్మించిన మూడేళ్ళకే ప్రాజెక్టు, బ్యారేజీలు ఉపయోగానికి పనికిరాకుండా పోయాయి. సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృధాచేసినట్లు కేసీఆర్, హరీష్ తదితరులపై రేవంత్, మంత్రులు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించిన కవిత అందుకు బాధ్యుడు హరీష్ మాత్రమేనని, కేసీఆర్ కు ఎలాంటి సంబంధంలేదని అంటున్నది. ముఖ్యమంత్రికి తెలియకుండా ఒకమంత్రి వేలాది కోట్లరూపాయల అవినీతికి పాల్పడగలడా ? అన్నది అసలు పాయింట్. కవిత ఆరోపణలు చేసినపుడు హరీష్ బ్రిటన్లో ఉన్నారు. కాబట్టి హైదరాబాదుకు తిరిగిరాగానే కవిత ఆరోపణలకు సమాధానాలు చెప్పటమే కాకుండా ఎదురు కవితపైన కూడా హరీష్ ఆరోపణలతో విరుచుకుపడతారని చాలామంది ఊహించారు. హరీష్ తరపున పార్టీలోని హరీష్ మద్దతుదారులంతా కవితపై విరుచుకుపడ్డారు.
అయితే అంచనాలకు భిన్నంగా కవిత చేసిన ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇవ్వకపోవటమే కాదు అసలు కవిత పేరు కూడా ప్రస్తావించలేదు. దీనికి కారణం ఏమిటని ఆరాతీస్తే హరీష్ అవినీతికి కవిత దగ్గర చాలా సమాచారం ఉందని జాగృతి నేతలంటున్నారు. హరీష్ అవినీతి బండారాన్ని ఒక్కొక్కటి బయటపెడతానన్న కవిత హెచ్చరికకు హరీష్ భయపడినట్లున్నారు అనే ప్రచారం పెరిగిపోతోంది. పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఎంఎల్సీ పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేశారు. ఇపుడు కవితకు కొత్తగా పోయేదేమీలేదు. తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ అధికారంలో కీలకనేతల్లో చాలామందిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. అవన్నీ ఒక్కోటిగా బయటకు వస్తే పార్టీకి, వ్యక్తిగతంగా సదరు నేతలకు ఇబ్బందులు తప్పవు.
అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ కూతురి హోదాలో కవిత కూడా పవర్ సెంటర్ గానే చెలామణి అయ్యారు. కాబట్టి పార్టీలోని కీలక నేతల వ్యవహారాలు, అవినీతికి సంబంధించిన ఆధారాలు కవిత దగ్గర ఉండే ఉంటాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శాంపుల్ గా హరీష్, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ పెద్ద అవినీతిపరులుగా కవిత ఆరోపించారు. కవిత ఆరోపణలకు ధీటుగా సమాధానాలు చెప్పటానికి ఇటు హరీష్ అటు సంతోష్ ఇద్దరూ నోరిప్పటానికి ఇష్టపడటంలేదు. సంతోష్ అంటే ప్రజాజీవితంతో పెద్దగా సంబంధాలు లేని వ్యక్తి. కానీ హరీష్ అలాకాదు 24 గంటలూ జనాల్లోనే ఉంటారు. అలాంటిది హరీష్ కూడా కవిత ఆరోపణలపై సమాధానాలు చెప్పటానికి ఎందుకు వెనకాడుతున్నారు ? అన్నదే అర్ధంకావటంలేదు.