
ప్రమాదం ఇలాకూడా జరుగుతుందా ?
టిప్పర్లోని కంకర ఏమిటి, బస్సులోని ప్రయాణీకుల మీదపడి ముంచేసి ఊపిరిఆగిపోవటం ఏమిటో బొత్తిగా అర్ధంకావటంలేదు
ప్రమాదాలు చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. ఇలాకూడా ప్రమాదం జరుగుతుందా అని ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రమాదాలు జరుగుతుండటమే ఆశ్చర్యంగాఉంది. ఈమధ్యనే కర్నూలు దగ్గర రోడ్డుపై మోటారుసైకిల్ ను తొక్కుకుంటు వెళ్ళినపుడు బస్సుప్రమాదం జరిగినవిషయం తెలిసిందే. ఆప్రమాదంలో 19మంది సజీవదహనమైపోయారు. తాజాగా అంటే సోమవారం తెల్లవారుజామున సుమారు 5 గంటలప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 24 మంది మరణించారు.
ఈప్రమాదం ఎలాగ జరిగిందంటే తాండూరు డిపో నుండి బయలుదేరిన బస్సు చేవెళ్ళకు దగ్గరలోని మీర్జాగూడ దగ్గరకు వచ్చింది. రోడ్డు మలుపులో ఎదురుగా కంకర టిప్పర్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో టిప్పర్ లోని కంకరంతా బస్సు కిటికీల ద్వారా ప్రయాణీకుల మీద పడిపోయింది. బస్సు డ్రైవర్ సీటు వెనుకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణీకులమీద కంకర ఎక్కువగా పడిపోయింది. మంచినిద్రలో ఉన్న ప్రయాణీకులు మేల్కొని ఏమి జరుగుతోందో తెలుసుకునే లోపలే కంకర చాలామందిని ముంచేసింది. నీళ్ళల్లో ముణిగిచనిపోవటం తెలుసుకాని ఇలాగ కంకరలో ముణిగిపోతారని చూడటం ఇదే మొదటిసారి.
బస్సును టిప్పర్ ఢీకొట్టడం, వెంటనే టిప్పర్లోని కంకరంతా బస్సులోని ప్రయాణీకుల మీదపడి ముంచేయటం, ఊపిరి ఆడక 24 మంది చనిపోవటం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. టిప్పర్లోని కంకర ఏమిటి, బస్సులోని ప్రయాణీకుల మీదపడి ముంచేసి ఊపిరిఆగిపోవటం ఏమిటో బొత్తిగా అర్ధంకావటంలేదు. ఇదిచూసిన తర్వాతే ప్రమాదాలు ఇలాకూడా జరుగుతాయా అని అందరు షాక్ తిన్నారు. భూమిపైన నూకలు చెల్లిపోతే ప్రమాదం ఏరూపంలో అయినా వచ్చి మీదపడి కబళించేస్తుందనేందుకు ఈరోజు జరిగిన ప్రమాదమే సాక్ష్యంగా నిలిచింది.

