
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి
కేసీఆర్ కు పదేళ్లలో వచ్చిన వ్యతిరేకత, రేవంత్ పై ఏడాదిలో వచ్చిందా?
వరుస ఎదురుదెబ్బలతో అప్రతిష్ట మూటగట్టుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్
దెబ్బ మీద దెబ్బ.. ఒకటి కాకపోతే ఒకటి... గత 16 నెలల పాలన మొత్తం వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే సంఘటనలే. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలయి పవర్ కోల్పోయింది.
అయితే, దానికి పదేళ్లు పట్టింది. ఇపుడున్న ప్రభుత్వం మాత్రం రెండు సంవత్సరాల్లోపే పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇదెలా జరిగిందో చూద్దాం.
హెచ్ సీయూ భూ వివాదం, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, దానిపై సుప్రీంకోర్టు అక్షింతలు, కాంగ్రెస్ పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకువస్తాయని ఆశించిన ఎస్ఎల్ బీసీ సొరంగం కూలిపోవడం, అందులో మరణించిన వారి మృతదేహాలు ఇప్పటి వరకూ కుటుంబ సభ్యులకు అప్పగించపోవడం, పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూడటం, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలులో జాప్యం వెరసీ కేవలం 16 నెలల పాలనలో కాంగ్రెస్ కు మైలేజ్ కంటే నష్టాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు.
హెచ్ సీయూ భూ వివాదం..
రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో ఉన్న 400 ఎకరాల భూమిని అమ్మబోతున్నామని ప్రకటించి, బుల్డోజర్లను పంపి రాత్రికి రాత్రి వందల ఎకరాల భూమిని చదును చేయడం ప్రస్తుతం ఉన్న అతి పెద్ద వివాదం.
పాలకుల నిర్లక్ష్యం వల్లే దాదాపుగా మూడు, నాలుగు దశాబ్ధాలుగా ‘కంచె గచ్చిబౌలి’లో ఉన్న హెచ్ సీయూ ప్రాంగణంలో ఒక చిన్నపాటి అడవే ఏర్పాటు అయింది. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఉమ్మడి ఆంధ్ర పాలకులు ఈ భూమిని వారి అనుచరుల పరం చేయడానికి ప్రయత్నించిన తరువాత వివాదం కోర్టు మెట్లెక్కింది.
చివరకు తెలంగాణ ఏర్పాటు అయ్యాక కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కోర్టులో కేసు గెలిచింది. విజయం సాధించిందే తడవుగా దాన్ని అమ్మడానికి ఆగమేఘాలపై కదిలి, ఇప్పుడు బొక్కబోర్లా పడింది ప్రభుత్వం.
దశాబ్ధాలుగా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో అది వన్యప్రాణులకు ఆవాసంగా మారింది. కానీ రేవంత్ సర్కార్ ఉన్నఫలంగా పదుల సంఖ్యలో బుల్డోజర్లను పంపి చెట్లను తొలగించడంతో వందల సంఖ్యలో ఉన్న జింకలు, నెమళ్లు పక్కన ఉన్న జనావాసాల్లోకి వెళ్లడం, విద్యార్థులు ఉద్యమంలోకి దిగడంతో వివాదం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ముఖ్యంగా రాత్రిపూట జేసీబీలు అడవిని చదును చేస్తుంటే నెమళ్లు చేసిన రోదనలు యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించి వేసింది. జంతువులు తల్లడిల్లడాన్ని AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) ద్విగుణీకృతం చేసింది. ప్రజలంతా ముఖ్యంగా యువత ఈ వీడియోను తమ వాట్సాప్ స్టేటస్ లో పెట్టి, ‘సేవ్ కంచె గచ్చిబౌలీ’ అంటూ ప్రజల మద్దతును కోరారు.
ఇందులో పార్టీలకతీతంగా యువత స్పందించారు. ఇది ప్రభుత్వం పై భారీగా వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పథకం (Fine Rice Scheme) సోదిలో లేకుండా పోయింది.
అది కాకుండా చాలా చోట్ల ఇచ్చిన సన్నబియ్యం అన్నం వండుకుంటే చాలా మెత్తగా అవుతుందని ఫీడ్ బ్యాక్ వస్తోంది. కొంతమంది దొడ్డు బియ్యాన్నే పాలిష్ చేసి ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది వేరే కథ.
సుప్రీం చివాట్లు..
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసలు తెలంగాణలో ఉప ఎన్నికలు రానే రావని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయితే తాము చూస్తూ ఊరుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలంటే భయపడుతుందా? ఈ అనుమానం రావడం సహజం. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే వ్యూహం పన్నడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
సీఎం ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) లోని ఎమ్మెల్యేలు అందరిని లాగి, కేసీఆర్ కు విపక్ష నేత హోదా లేకుండా చేయడమా? లేదా నువ్వు అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నావ్, ఇపుడు నేను కూడా ఆ పని చేశా, నేనూ నీతో సమానమే అని చెప్పుకోవడానికి ఆరాటపడుతున్నాడా అనేది జవాబు లేని ప్రశ్నే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ బాగా కష్టపడాల్సి వస్తుంది.
కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అది కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేపే అవకాశం ఉంది. అసలు ఆ పార్టీకి మెజారిటీ కంటే కేవలం 5 ఐదు స్థానాలే అధికంగా ఉన్నాయి.
అప్పట్లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకోవడానికి కారణం.. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెదిరించడమే అన్నారు. కానీ ఈ 16 నెలల కాలంలో ప్రజలకు గుర్తుండి పోయే ఒక్కపని కూడా చేయలేదనే అనుమానం ఆ పార్టీకి ఉన్నట్లు ఉంది.
అందుకే ఉప ఎన్నికలపై సీఎం అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది విశ్లేషకులు వాదన. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే పార్టీకి ప్రజాబలం లేదని తేటతెల్లం అయినట్లే. అంటే ప్రతిపక్షం చేతికి ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది.
సాగునీటికి కటకట...
కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్ వ్యవసాయానికి సాగునీటిని అందించడమే. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక ముఖ్య కారణం.. మేడిగడ్డ బ్యారెజ్ (Medigadda Barrage) కుంగడం.
అప్పుడే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని సరిచేసి తమను నీటిని అందిస్తారని రైతులు భావించారు. కానీ ఉన్న ప్రాజెక్ట్ ను కూలగొడతామని మంత్రులు మాట్లాడటం, నెగటివ్ ప్రచారం చేయడం, ఎప్పుడు నీటిని నిల్వ చేస్తారనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో రైతుల్లో సైతం అనుమానాలు మొదలయ్యాయి. ‘‘కేసీఆర్ నీళ్లు ఇచ్చారు.. కాంగ్రెస్ వాళ్లు ఎండబెట్టారు’’ అనే మాట ప్రతి రైతు నోట నుంచి వస్తోంది.
ఈ అంశానికి సంబంధించి సిద్ధిపేట్ జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఓ రైతు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘నేను నాలుగు ఎకరాల్లో నాటు వేశాను. కానీ బావుల్లో సరిగా నీళ్లు లేకపోవడంతో దాదాపు 2 ఎకరాలు ఎండిపోయింది.
ఎకరానికి ఐదువందల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో చాలామంది వరి సాగు చేశారు. చివర్లో నీళ్లు అందుతాయో లేదో అని నవంబర్ చివరి వారంలోనే అందరం నాట్లు వేశాం.
కానీ మార్చి 2 వారం కల్లా సగమంది రైతుల పొలాలు ఎండిపోయాయి.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాదు ఇంతకుముందు ఓ ప్రముఖ వార్తా పత్రికలో ఓ రైతుకు సంబంధించిన తొమ్మిది ఎకరాల జొన్న పంట నీళ్లు లేక ఎండిపోయిన వైనం కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది.
గౌరవెల్లి ప్రాజెక్ట్ కు సంబంధించి పనులు చేసి నీళ్లు ఇస్తామని చెబుతున్నారని, కానీ కాళేశ్వరం లేకుండా నీళ్లు ఎలా సాధ్యం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ మొత్తం ఇలాంటి వాదనే ఉంది.
నిజానికి తెలంగాణ లో ఏప్రిల్ చివరి వారంలో వరి కోతలకు వస్తుంది. అప్పుడే నీటికి కాస్త కటకట ఉంటుంది. ఇప్పడు పరిస్థితి భిన్నంగా మార్చి నుంచే పొలాలకు నీళ్లు అందించడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.
బోరు బావుల కోసం లక్షలాది రూపాయలు అప్పు చేశారు. కేసీఆర్ హయాంలో నీళ్లు ఇచ్చారని, కాంగ్రెస్ పాలనలో ఎక్కడా చుక్కనీళ్లు కనిపించడం లేదని చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీకి మరో బలమైన ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
ఈ అంశానికి సంబంధించి కే. రమేష్ అనే దళిత నాయకుడు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి వాళ్లపై వాళ్లకే నమ్మకం లేనట్లుంది. అందుకే ఉప ఎన్నికలు రావద్దని కోరుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు. అనవసర వివాదాలు నెత్తికి ఎత్తుకుంటున్నారు’’ అని అభిప్రాయపడ్డారు.
కొత్త ప్రాజెక్ట్ లు అసాధ్యం..
కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న ఎస్ఎల్ బీసీ ప్రమాదవశాత్తూ ఆగిపోయింది. దానికి సంబంధించిన పనులు ప్రారంభం కావడానికి కనీసంలో కనీసం ఒక సంవత్సరం అయినా పడుతుంది.
అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పటిలా కాకుండా కొత్త డిజైన్ తో ముందుకు వెళ్లాలని ఇంజనీర్లు సూచించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. దాదాపు మూడు దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది.
దీనిని పూర్తి చేసి ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావించారు. కానీ అనుకోని ప్రమాదంతో ఇది ఆగిపోవడం పార్టీకి మైనస్. భవిష్యత్ లో కొత్త ప్రాజెక్ట్ లు ఏవి ప్రారంభించాలన్నా పార్టీకి మిగిలిన మూడున్నర ఏళ్లలో నిర్మించి నీళ్లు ఇవ్వడం అసాధ్యం.
హైదరాబాద్ లో ‘హైడ్రా’ దెబ్బ...
హైదరాబాద్ లో చెరువులను రక్షిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ వెంటనే హైడ్రా (HYDRAA) ను ప్రారంభించింది. అనుకున్నదే తడవుగా చెరువులో వెలసిన అక్రమ వెంచర్లను, ఇళ్లను బుల్డోజ్ చేయడం ప్రారంభించింది.
ఇది పార్టీకి మంచికంటే చెడే చేసింది. వందలాది మంది ప్రజలు ఈ చర్యను వ్యతిరేకించారు. చెరువుల దగ్గర ఇళ్లు నిర్మించుకున్న సంపన్నులు హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుని వాటిని ఇంటి ముందున్న గోడలకు పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకున్నారు.
హైడ్రా పెద్ద వాళ్లను వదిలేసి పేదల వెంటబడుతూ ఉందని హైకోర్టు వ్యాఖ్యలు కూడా చేసింది. నిజానికి హైడ్రా కూల్చిన వాటికంటే, కోర్టు నుంచి ఎదురైన అభ్యంతరాల సంఖ్య ఎక్కువెమో అనిపిస్తుంది.
తమవైపు హైడ్రా రావద్దని ప్రజలు కోరుకున్నారు. అంతకుముందు కూడా ఇలాగే మూసీ సుందీరకరణ ప్రాజెక్ట్ అంటూ అక్కడ ఉన్న ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఇది కూడా నగరంలో పెద్ద వివాదంగా మారింది.
ఈ చర్యలతో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మూసీ ఆగింది. హైడ్రా కదల్లేక పోతున్నది. జనం తిరుగుబాటుతో లగచర్ల ఏరియా ఫార్మాసిటీ బంద్ చేసుకున్నారు.
చాలా చోట్ల ఇథనాల్ పరిశ్రమలను ప్రజావ్యతిరేకతతో ఉపసంహరించుకున్నారు. ఈ 16 నెలల్లో రేవంత్ ఏది పట్టినా చివరకు ప్రజావ్యతిరేకత తప్పని సరి అవుతున్నది.
ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అనుభవం చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తేడాలేదని తెలంగాణ రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి అన్నారు.
“రెండు ప్రభుత్వాలు భూదాహంతోనే ఉన్నాయి. భూములు విక్రయిచంకుండా పరిపాలన చేయలేని పరిస్థితులు కనబడుతున్నాయి. బీఆర్ ఎస్ అనుభవం చూశారు, బీజేపీ ధోరణి చూశాక రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్థానిక ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.
ఇథనాల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాలు రాజకీయాలకు అతీతంగా నడిచాయి. లగచర్ల ఉద్యమం అంతే, ఇపుడు హెచ్ సియు కూడా విద్యార్థులు నడిపిన ఉద్యమమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కొత్త ట్రెండ్ ను గమనించి ముందుకుసాగాలి,” అని కన్నెగంటి రవి అన్నారు.
అయితే అలాంటిదేమి లేదు అని చెప్పడానికి హెచ్ సీయూ లో ఉన్న భూములను వేలం వేయడానికి ప్రయత్నించిందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ భూముల విషయంలో వన్యప్రాణులు ఉండటం వాటి ఫొటోలు, వీడియోలు సుప్రీంకోర్టుకు చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
కానీ దీనితో కాంగ్రెస్ పార్టీపై కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ వివాదంపై కొంతమంది యూట్యూబర్లు చేసిన వీడియోలపై కామెంట్ల సెక్షన్ లో ప్రజలు తమ అభిప్రాయాలను ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీ మళ్లోసారి అధికారంలోకి రావద్దనే ఇదంతా చేస్తున్నారా?’’ అనే కామెంట్లు హైలెట్ అవుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో పట్టులేనట్లు స్పష్టం అయింది.
బీఆర్ఎస్ ఇక్కడ ఉన్న అన్ని స్థానాలను దాదాపుగా తన ఖాతాలో వేసుకుంది. అలాంటి చోట్ల హైడ్రా, మూసీ వంటి ప్రాజెక్ట్ లు ప్రకటించిన ఇంకా వ్యతిరేకతను మూటగట్టుకున్నట్లు స్పష్టం అయింది.
భవిష్యత్ లో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ పార్టీకి ఆదరణ లభించే అవకాశాలు కనిపించడం లేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించి, ప్రజల మద్దతును కూడగట్టుకోవాల్సిన చోట, కాంగ్రెస్ పేరు చెబితే స్థానిక ప్రజలు ఏం చేస్తారో అన్న స్థితికి తీసుకురావడానికి కారణం ఆ పార్టీ నిర్ణయాలే.
ఈ అంశానికి సంబంధించి హనుమకొండ జిల్లాకు చెందిన సీపీఐ రాష్ట్ర నాయకుడు ఆదరి శ్రీనివాస్ ‘ది ఫెడరల్ ’ తో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఆలోచించి పనులు చేయడం లేదు.
ఏదైన పని చేసే ముందు దాని లాభనష్టాలు బేరీజు వేసుకుని, నష్టాలు ఎదురైతే ముందే వ్యూహాలు రూపొందించి అమలు చేయాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాటిని విస్మరించిందనేది వాస్తవం. అందుకే ప్రతిపనిలో రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి’’ అని అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్ష పార్టీ...
మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్ లో బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ రాకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడింది. మొదట్లో అయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మంచినీళ్లు తాగించింది.
దాంతో ఆ పార్టీ క్యాడర్ మంచి జోష్ లో కనిపించింది. అయితే రాను రాను దాని వాదన కాస్త బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమా? కావాలనే వ్యవహరించిందా? అనేది మున్ముందు తెలుస్తుంది.
ఈ నెల 27 న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహించబోతోంది. దీనిట్లో కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన బహిరంగంగా మాట్లాడింది తక్కువ.
మొదటి నాలుగైదు నెలలు కాలు విరగడంతో ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. తరువాత కూడా రాజకీయాల్లో ఎక్కడా క్రియాశీలకంగా లేరు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఆ పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని అనేకసార్లు ప్రకటనలు చేస్తున్న. కింది స్థాయి కేడర్ మాత్రం బలంగా లేకపోవడంతో అది చేస్తున్న పనులకు ఇక్కడ ప్రచారం లభించడం లేదు. అయితే యువత మాత్రం బీజేపీ జపం చేస్తున్నారు. దీనిని దాటి ముందుకు వెళ్లడం ఆ పార్టీ కష్టమే.
కొసమెరుపు ఏంటంటే, కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా అవినీతి ఆరోపణలు చుట్టుముట్టేవి. అయితే ఇప్పటి వరకూ అలాంటివేం లేకున్నా.. పార్టీ స్వయంకృతాపరాధలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గాలికి పోయే కంపను తీసి నెత్తిన వేసుకుంటున్నారని అనిపిస్తోంది. ఈ పార్టీ ఇలాంటి తప్పులు కొనసాగిస్తూ.. ఎన్నికల హమీలు అమలు చేయడంలో ఇలాగే వ్యవహరిస్తే పార్టీ పుట్టి మునగడం ఖాయం.
Next Story