
‘దోమడుగు గ్రామంలో హెటిరో డ్రగ్స్ కంపనీని మూసేయాలి’
సంస్థ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు కాలుష్యానికి దారితీస్తున్నాయంటూ ధర్నాకు దిగిన గ్రామస్తులు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హెటిరో డ్రగ్స్ కంపెనీని తీసేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ధర్నా చేపట్టారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(TPJAC) సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. దోమడుగు గ్రామాన్ని కుదిపేస్తున్న కాలుష్య సమస్యపై గ్రామస్తులు ఈరోజు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. హెటెరో డ్రగ్స్ యూనిట్–1 నుండి వెలువడుతున్న విష రసాయనాల కారణంగా చెరువులు, గాలి, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమయ్యాయని ఆరోపిస్తూ కంపెనీని శాశ్వతంగా మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.
భూగర్భ జలాలు విషపూరితం
గత ఆగస్టులో దోమడుగులోని నల్లకుంట చెరువు హెటెరో డ్రగ్స్ వదిలిన రసాయనాల వల్ల గులాబీ రంగులోకి మారినందుకు నిరసన తెలుపుతూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం కారణంగా కేన్సర్, కిడ్నీ వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు పెరిగాయని, పశువులు మరణిస్తున్నాయని, సాగుభూములు దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆరోపించారు.
నాలుగు నెలలుగా అధికారుల నిర్లక్ష్యం
ఈ సమస్యను తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అనేక మంది అధికారులు దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. నాలుగు నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రికి కూడా విషయం తెలియజేసినా స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంపెనీ యాజమాన్యానికి లొంగిపోయారని, తమ బాధను పట్టించుకోలేదని ప్రజలు ఆరోపించారు.
పర్యావరణ ధ్వంసానికి వారు బాధ్యులే: ప్రజా సంఘాలు
టీపీజేఏసీ, పర్యావరణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ విజన్ పేరుతో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది దోమడుగు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యంతో బాధపడుతున్న ప్రతి గ్రామం తరఫున జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.
ధర్నాలో భారీ జనసమ్మర్థం
మహిళలు, వృద్ధులు, యువకులు, పిల్లలు ఇలా గ్రామం మొత్తం వేల సంఖ్యలో పాల్గొని ధర్నా ప్రదేశంలోనే భోజనం చేసి తమ ధృఢసంకల్పాన్ని చూపించారు. కాలుష్యం నిండిన చెరువు నీటిని కార్యాలయం ముందు గుమ్మరించి నిరసన తెలిపారు.
అధికారులతో చర్చ
ధర్నా నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గేటు వద్దకు వచ్చి గ్రామస్తుల డిమాండ్లను విని, సమస్యపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, ప్రజా సంఘాల నాయకులతో వారు చర్చలు జరిపారు.
పరిష్కారం అయ్యే వరకు పోరాటం
సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నాకు కలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్లు మంగయ్య, బాల్ రెడ్డి, జయమ్మ, టీపీజేఏసీ నాయకులు కన్నెగంటి రవి, వై. అశోక్ కుమార్, డా. కలపాల బాబూరావు, అలాగే అనేక ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

