
అటవీ రోడ్లలో హెవీ వెహికల్స్‌కు నో ఎంట్రీ
వన్య ప్రాణుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అందుకోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి కొండాసురేఖ.
అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలపై తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు 8వ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్బంగా వన్య ప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలేంటి? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వన్య ప్రాణుల స్థితి గతులు ఎలా ఉన్నాయి? వంటి అనేక అంశాలపై చర్చ జరిగింది. అదే విధంగా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన సెల్ టవర్లు సహా ఇతర ప్రతిపాదనలపై కూడా ఆమె అధికారులతో చర్చించారు. పలు కీలక సూచనలు చేశారు. వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
సెల్ టవర్లు సహా చేసిన ఇతర ప్రతిపాదనలపై మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించారు. దాంతో పాటుగానే కవాల్ టైగర్ రిజర్వ్ బఫర్ ఏరియాలో పంచాయతీ రోడ్ల నిర్మాణం కోసం సవరించిన ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ సెల్ ఫోన్ టవర్లు అంశంలో ఈ ఐదు ప్రతిపాదనపై ఎస్బీడబ్ల్యూఎల్ సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం గిరిజనుల తరలింపు ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. గిరిజనులను వేరే ప్రాంతాలకు తరలిస్తే 1/70 కింద కలిగే ప్రయోజిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? లేదా? అని అధికారులను నిలదీశారు. అలా చేయని పక్షంలో అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి ప్రశ్నపై స్పందించిన అధికారులు.. గిరిజనులను చట్ట ప్రయోజిత ప్రాంతానికే తరలిస్తున్నట్లు వివరించారు.
హెవీ వెహికల్స్‌ను అనుమతించొద్దు..
ఈ సమావేశం నేపథ్యంలో అధికారులకు మంత్రి సురేఖ కీలక ఆదేశాలు జారీ చేశారు. వన్య ప్రాణుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అందుకోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వన్య ప్రాణులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఎవరూ పాల్పడకుండూ చూసుకోవాలని చెప్పారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంత రోడ్లపై చీకటి పడిన తర్వాత హెవీ వెహికల్స్ ప్రయాణానికి అనుమతించవద్దని ఆదేశించారు. ఈ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పారు. నియమ నిబంధనలను అధ్యయం చేసి, వాహనాల రాకపోకల సమయపాలనపై అవసరమైన నిబంధనల సవరణ చేయాలని సలహా ఇచ్చారు. మంత్రి ఆదేశాలను పరిశీలిస్తామని, వన్య ప్రాణుల రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.