మహారాష్ట్ర జనాలు రేవంత్ హామీలు నమ్మలేదా ?
x
Revanth in Maharashtra election campaign

మహారాష్ట్ర జనాలు రేవంత్ హామీలు నమ్మలేదా ?

రేవంత్ హామీలను మహారాష్ట్ర(Maharashtra results) ప్రజలు ఏమాత్రం నమ్మినా ఇంత ఘోరంగా ఇండియా కూటమి ఓడిపోయేది కాదేమో అనిపిస్తోంది.


తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే రేవంత్ హామీలను మహారాష్ట్ర(Maharashtra results) ప్రజలు ఏమాత్రం నమ్మినా ఇంత ఘోరంగా ఇండియా కూటమి ఓడిపోయేది కాదేమో అనిపిస్తోంది. రేవంత్(Revanth) హామీలను అక్కడి జనాలు ఏమాత్రం పట్టించుకోని కారణంగానే కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని ఇండియా కూటమి(INDIA Alliance) చిత్తుగా ఓడిపోయింది. మహారాష్ట్రలోని 288 సీట్లలో ఎన్డీయే కూటమి(NDA)కి 225 సీట్లు వస్తే ఇండియా కూటమికి 50 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 130 సీట్లు రాగా ఇండియా కూటమిలోని కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 19 అంటే 19 సీట్లు మాత్రమే. సరే, ఎన్నికలు అన్నాక గెలుపోటములు చాలా సహజం.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం, ఎన్డీయే కూటమి అద్భుతమైన విజయం అని మీడియా మొత్తం గోలగోల చేస్తోంది. ఇందులో కొత్తగా గెలిచింది ఏముందో అర్ధంకావటంలేదు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికే ప్రజలు తిరిగి అధికారాన్ని కట్టబెట్టారంతే. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమిని ఓడించి బీజేపీ లేదా ఎన్డీయే కూటమి అధికారంలోకి రాలేదన్న విషయాన్ని మీడియా మొత్తం మరచిపోయింది. జార్ఖండ్(Jharkhand) లో కూడా ఇండియా కూటమి తన అధికారాన్ని మరోసారి నిలబెట్టుకుందంతే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఇండియా కూటమి ప్రభుత్వమే కాబట్టి.

ఏదేమైనా ఎన్నికల్లో గెలుపు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇండియా కూటమి ప్రత్యేకంగా కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుకోసం తెలంగాణా నుండి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంచేశారు. ముఖ్యంగా తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే ముంబాయ్ సిటీలోనే రేవంత్ ఎక్కువగా దృష్టిపెట్టారు. రోడ్డుషోలు, బహిరంగసభల్లో రాహూల్(Rahul), ప్రియాంక(Priyanka)తో కలిసి మూడు విడతల్లో రేవంత్ దాదాపు ఐదురోజులు ప్రచారం చేశాడు. అయితే రేవంత్ ప్రచారంచేసిన ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలవలేదని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు రావటానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

తెలంగాణాలో తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడిలో రు. 500 ఏడాదికి మూడు సిలిండర్లు, లక్షలాదిమంది రైతులకు రుణమాఫీ లాంటి సంక్షేమపథకాలు అమలుచేస్తున్నట్లు రేవంత్ చాలానే చెప్పారు. అయితే ఆ హామీలను మహారాష్ట్ర జనాలు నమ్మినట్లు లేదు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రంతిప్పిన మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్(Sarad Pawar) ప్రభావం ఎన్నికల్లో కనిపించకపోవటం. 87 ఏళ్ళ వయసులో శరద్ తాజా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. శరద్ ప్రభావం కనిపించని ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలను కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదని అర్ధమవుతోంది. నరేంద్రమోడీకి ధీటుగా రాహుల్ లో నాయకత్వ లక్షణాలున్నట్లు మరాఠీ జనాలకు అనిపించినట్లు లేదు. అందుకనే కాంగ్రెస్ ను జనాలు పట్టించుకోలేదు.

ఇదే సమయంలో శివసేన అంటే ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని చీలిక వర్గమే కాని బాలాసాహెబ్ థాక్రే(Balasaheb Thackrey) కొడుకు ఉత్థవ్ థాక్రే కాదని జనాలు కూడా ఫిక్సయిపోయినట్లున్నారు. అందుకనే ఉత్థవ్ ను కూడా పట్టించుకోలేదు. అందుకనే హోలుమొత్తంమీద జనాలు ఈ మూడుపార్టీల కూటమి మహావికాస్ అఘాడీ(Maha Vikas Aghadi)ని చాపచుట్టినట్లు చుట్టి సముద్రంలో పడేశారు. ఇపుడు మహావికాస్ అఘాడి తరపున గెలిచిన 50 మంది ఎంఎల్ఏల్లో కూడా ఎంతమంది కూటమిలోనే ఉంటారన్నది అనుమానంగా తయారైంది. కడపటి వార్తలు అందేసరికి సీట్ల గెలుపోటములు కూడా మారిపోయే అవకాశముంది. మొత్తంమీద మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుకు రేవంత్ ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం కనబడలేదన్నది మాత్రం వాస్తవం.

Read More
Next Story