Adani projects|తెలంగాణలో అదానీ ప్రాజెక్టుల అమలుపై అనుమానాలు
అదానీ ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఆయన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ(Adani) ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వాలపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అదానీ (Adani projects) 12 ప్రాజెక్టులకు రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్కువ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
- తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుకు అదానీ గ్రూప్(Adani Group) రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanthreddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదానీ వంద కోట్ల రూపాయల విరాళంపై కేటీఆర్ లంచం అని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం అదానీ విరాళాన్ని తిరస్కరించారు.
- తాము చట్టబద్ధంగానే పెట్టుబడులను అనుమతిస్తామని సీఎం ప్రకటించారు. తెలంగాణలో అదానీతో ఏ ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు చేసుకుందనే విషయం తాజాగా బహిర్గతం అయింది. అదానీ నుంచి తనకు, తన మంత్రులకు, ప్రభుత్వానికి డబ్బులు రాలేదని అనవసర వివాదాల్లోకి తమను లాగొద్దని సీఎం రేవంత్ సూచించారు.
- అదానీ ప్రాజెక్టుల్లో ముడుపుల వ్యవహారం వెలుగుచూడటంతో తెలంగాణలో అదానీ ప్రాజెక్టుల అమలు చర్చనీయాంశంగా మారింది.బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీ గ్రూపునకు చెందిన అయిదు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అదానీ ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేసినా, ఇంకా ఆమోదం తెలుపలేదు.
తెలంగాణలో అదానీ గ్రూపు ప్రాజెక్టుల తీరుతెన్నూ
- మామిడిపల్లిలో అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ పేరిట డిఫెన్స్ యూనిట్ ఏర్పాటుకు కేసీఆర్ నేత్వత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన కంపెనీల నుంచి ఎగుమతి చేసుకొని ఇండియన్ ఆర్మీ, నేవీకి డ్రోన్లను తయారు చేస్తున్న యూనిట్ ను అదానీ నెలకొల్పారు. ఈ యూనిట్ నడుస్తుంది.
- మామిడిపల్లిలో మిసైల్ షెల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించింది. 25 ఎకరాల్లో ఏర్పాటైన ఈ యూనిట్ 2025 జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించనుంది.
- ఎల్లికట్టలో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ మొదటి దశ పూర్తి అయింది. రెండో దశకు భూములు కొనుగోలు చేశారు.
- వడోదర నుంచి వరంగల్ మీదుగా 750 కేవీ ట్రాన్స్ మిషన్ లైన్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం అనుమతించగా అది పూర్తి అయింది.
- ఖమ్మం - సూర్యాపేట, మంచిర్యాల- రేపల్లివాడ, ఖమ్మం- కోదాడ జాతీయ రహదారుల నిర్మాణానికి అదానీ కాంట్రాక్టు పొంది, రెండు ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. మూడో ప్రాజెక్టు పని 85 శాతం అయింది.
2014లోనే కేసీఆర్ తో అదానీ భేటీ
2014వ సంవత్సరం ఆగస్టు 11వతేదీన అప్పటి సీఎం కేసీఆర్ తో గౌతం అదానీ భేటీ అయ్యారు. 2018 దావోస్ సదస్సులో అప్పటి మంత్రి కేటీఆర్ అదానీని కలిసి విమాన విడిభాగాల తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని గతంలో కేసీఆర్ అదానీని ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదానీతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. కానీ రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ఒప్పందాలపై ఏం చేస్తారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెండింగులోనే అదానీ ప్రాజెక్టులు
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామన్నపేటలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సెంటర్ అండ్ డ్రై పోర్టు నిర్మాణానికి అదానీ గ్రూప్ ప్రతిపాదనలు సమర్పించింది.దీని కోసం 375 ఎకరాలను కూడా అదానీ సేకరించారు. అయినా ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కారు పెండింగులో ఉంచింది.
- 5000 మెగావాట్ ల పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలను అదానీ గ్రూపు సమర్పించింది.
- రామన్నపేటలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటుకు దావోస్ సదస్సులో ఒప్పందం కుదిరినా పర్యావరణ క్లియరెన్స్ పెండింగులో ఉంది.
- కొడంగల్ లో సిమెంటు కర్మాగారం ఏర్పాటుకు అదానీ గ్రూపు ఇచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరించినా, ఆమోదించలేదు.
- చందన్ వెల్లి డాటా సెంటర్ టెక్ పార్కు ఏర్పాటుకు భూసేకరణను టీజీఐఐసీ పూర్తి చేసింది.
- ముచ్చెర్లలో డాటా సెంటర్ కాంప్లెక్స్ నిర్మాణానికి అదానీ గ్రూపు ప్రతిపాదనలు సమర్పించింది. అమెజాన్ డాటా సెంటరు పక్కన ముచ్చెర్లలో 100 ఎకరాలను కేటాయించాలని అదానీ గ్రూపు కోరింది.
ఏ సంస్థ నుంచి ఫండ్ తీసుకోలేదు : సీఎం రేవంత్ రెడ్డి
‘‘అదానీ నుంచి నిధులు స్వీకరించారని రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారు.చట్టబద్ధంగా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశాలు ఇవ్వాలనేది నిబంధన.నిబంధనల మేరకు టెండర్లను దక్కించుకున్న ఏ సంస్థలకైనా పెట్టుబడులకు అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టంగా వివరించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ కోసం కార్పస్ ఫండ్ కింద పలు కంపెనీలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.అందులో భాగంగా అదానీ కూడా రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.ఇప్పటి వరకు ఆదానీతో సహా ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదు.జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని లేఖ రాశాం’’అని రేవంత్ రెడ్డి స్సష్టం చేశారు.
Next Story