పడిపోయిన డ్రాగన్‌ ఫ్రూట్ ధర! కిలో 25 రూపాయ‌లే!
x

పడిపోయిన డ్రాగన్‌ ఫ్రూట్ ధర! కిలో 25 రూపాయ‌లే!

కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతులతో నష్టపోతున్న తెలుగు రైతులు


ఒకప్పుడు ఖరీదైన పండుగా పేరుగాంచిన డ్రాగన్‌ ఫ్రూట్‌కు ఇప్పుడు మార్కెట్‌లో గిరాకీ పడిపోయింది. ఒకప్పుడు ఒక్క పండు ధర రూ.200 వరకూ ఉండేది. అయితే ప్రస్తుతం అది రూ. 25కి పడిపోయింది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి విపరీతంగా డ్రాగన్‌ ఫ్రూట్లను మార్కెట్‌కు పంపిస్తున్న నేపథ్యంలో ధరలు మరింతగా పడిపోయి, నాలుగో వంతుకు చేరాయి. ఫలితంగా తెలుగు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నామని చెబుతున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ పంట సాగు విస్తరించడంతో, అక్కడి రైతులు కూడా డ్రాగన్‌ ఫ్రూట్లను బాటసింగారం మార్కెట్‌కు తీసుకువ‌స్తున్నారు. వారు తెలుగు రైతుల కంటే తక్కువ ధరకు అమ్మకాలు చేయడంతో, స్థానిక రైతుల పండ్లకు డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అక్కడి అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను బాటసింగారం మార్కెట్‌లోకి అనుమతించకుండా నిలిపేశారు. అయితే ఆ వాహనదారులు జాతీయ రహదారుల వెంటే నిలిపి ఒక్కో పండును రూ.25కి విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోని వ్యాపారులు కూడా అక్కడే కొనుగోలు చేయడంతో తెలుగు రైతుల పండ్లకు అమ్మకాలు జరగడం లేదు.

తెలంగాణ సరిహద్దుల్లోనే అడ్డుకోవాలి

కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే వాహనాలను మార్కెట్‌లోకి అనుమతించడం లేద‌ని బాటసింగారం పండ్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు. మొదట్లో మార్కెట్‌ డిమాండ్‌ బాగా ఉండటంతో ఎకరానికి సుమారుగా రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర,కర్ణాటక నుంచి విపరీతంగా డ్రాగన్‌ ఫ్రూట్లు రావడం వల్ల ఆదాయం కేవలం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్యకే పరిమితమైంది.

ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, ఆ రాష్ట్రాల నుంచి డ్రాగన్‌ పండ్ల వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లోనే అడ్డుకోవాలి. అప్పుడే ఇక్కడి రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ కలిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేక పోతే రెండు తెలుగు రాష్ట్రాల రైతులూ తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయమై త్వరలోనే తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవించనున్నాం'' అని వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతుల సంఘం ప్రతినిధి తెలిపారు.

పోషక విలువలు అధికంగా ఉండటంతో గతంలో ఈ పండును విదేశాల నుంచి దిగుమతులు చేసేవారు.అయితే, ఇటీవలి సంవత్సరాలలో దేశీయంగా కూడా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రైతులు ఈ పంటను సాగు చేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో 1100 ఎకరాలు, తెలంగాణలో 900 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు.

ఈ మొక్కలను నాటిన నాలుగేళ్ల తరువాత పూర్తి స్థాయిలో పంట అందుబాటులోకి వస్తుంది. విత్తిన రెండేళ్ల‌కే కొద్ది కొద్దిగా పంట చేతికి వస్తుంది. ఎకరాకు నాలుగు టన్నుల డ్రాగన్ ఫ్రూట్‌ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి విత్తితే దాదాపు 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. ఒక్కొక్క మొక్క నుంచి 35-45 కాయలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.పంట పూర్తిగా దిగుబడి ఇచ్చే దశకు వచ్చే వరకు రైతులు ఎకరానికి సుమారుగా రూ.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న బాటసింగారం ఫల మార్కెట్‌కు తమ పండ్లను తీసుకెళ్లి అమ్ముతున్నారు.

రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండించవచ్చు. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. పైగా ఈ ఫ్రూట్‌ మంచి ఔషధంగా పనిచేస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. ఈ పండులో వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధ వ్యాధులకు, అజీర్ణ సమస్యలకు ఈ పండు ఔషధంగా పనిచేస్తుంది. ఈ పంట రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందిస్తుంది.

ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందిన చెట్టు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికా నుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, వియత్నాంలలో చాలా కాలంగా పెంచుతున్నారు. ఈ పండ్లలో కూడా కివీ పండ్ల మాదిరిగానే చిన్న చిన్న నల్లని గింజలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి.

చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంకలలో కూడా ఈ పండ్లను విరివిగా పండిస్తున్నారు. భారతదేశంలో 1990ల నుంచీ వీటి పెంపకం ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఈ పండ్ల తోటల పెంపకం పెరిగింది.

Read More
Next Story