
హైడ్రా కార్యాలయం ఎదుట డిఆర్ఎఫ్ సిబ్బంది మెరుపు సమ్మె
ఐదు వేలు జీతం కట్ చేయడంపై నిరసన
హైదరాబాద్ బుద్ద భవన్ వద్ద హైడ్రా కార్యాలయం ఎదుట ఉద్యోగ సిబ్బంది నిరసన కార్యక్రమానికి దిగారు. ఆగస్టు నెల నుంచి సిబ్బందికి ఐదువేల రూపాయల కోత విధిస్తున్నారని ఆందోళన కారులు చెబుతున్నారు. జీతం తగ్గించిన కారణంగా బుధవారం నుంచి విధులకు హాజరు కావడం లేదని వారు పేర్కొన్నారు. రాత్రనక, పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నా హైడ్రా తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు. జీహెచ్ ఎంసీ క్రింద పని చేస్తున్న 1100 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రాలోని డిఆర్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నారని సిబ్బంది చెప్పారు. ఐదువేల కోత విధిస్తూ ప్రభుత్వం ఉన్న ఫళంగా ప్రత్యేక జీవో జారి చేసిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన 1272 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బందిలో సగం మంది జీతం కట్ అయ్యిందని జీతంలో కోత ఎందుకు విధించారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
హైడ్రాకు సిబ్బంది ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మెరుపు సమ్మెకు దిగారు.
డిజాస్టర్ బృందం విధులు బహిష్కరించడంతో వర్షాకాలం సేవలు నిలిచిపోనున్నాయి. వీరి ధర్నాపై హైడ్రా ఏ విధంగా స్పందిస్తుందో అనేది వేచి చూడాల్సిందే.