
హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం
డ్రగ్స్ వ్యాపారంలో మునిగిపోయిన ఆర్కిటెక్ట్, డాక్టర్
డ్రగ్స్ వార్తలు హైదరాబాదులో మరోసారి కలకలం రేపింది. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్ వోటీ) పోలీసులు మంగళవారం చేధించారు. నిందితులలో ఒకడైన తేజ్ కృష్ణ అర్కిటెక్ట్ అని పోలీసులు తెలిపారు. మరో డ్రగ్ కేసులో డాక్టర్ పట్టుబడ్డాడు. ముషీరాబాద్ లోని తన ఇంటినుండే డాక్టర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు విద్యార్థులు, యువత ఎక్కువగా డ్రగ్స్ కేసులో పట్టుబడుతుంటే తాజాగా వేర్వేరు ఘటన ల్లో ఆర్కిటెక్ట్, డాక్టర్ పట్టుబడటం సంచనమైంది.
గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ
నగరంలోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఒక లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని ఇవ్వాళ చేధించినట్లు ఎస్ఓటీ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి చెప్పారు. వాళ్ళదగ్గర నుండి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మాదాపూర్ ఎవోటీ, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఎస్ఎం కో లివింగ్ హాస్టల్లో దాడులు నిర్వహించారని మాదాపూర్ అదనపు డీసీపీ తెలిపారు. కో లివింగ్ హాస్టల్‌లో తేజ్ కృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ లభించాయని ఆయన చెప్పారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురి కోసం గాలిస్తే మరో హోటల్లో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారి దగ్గర కూడా నిషేధిత డ్రగ్స్ లభించినట్లు డిసిపి తెలిపారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు పెడ్లర్లు, ఐదు మంది కన్స్యూ మర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ల నుంచి తేజ్ కృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేశాడని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారని వారిని తొందరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి తేజ్ కృష్ణ స్థానికంగా ఉన్న యువత, విద్యార్థులకు అమ్ముతున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనపరచుకుని రిమాండ్ కు పంపినట్లు డిసిపి వివరించారు. ఈ కేసులో మొత్తం 19 మంది ఉన్నారని, వారిలో 9 మంది పెడ్లర్లు ఉన్నారన్నారు. పరారీలో ఉన్నవారిలో నలుగురు పెడ్లర్లు ఉన్నారని డిసిపి చెప్పారు. తేజ్ కృష్ణపై గతంలో మూడు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయని డీసీపీ వివరించారు.
డ్రగ్స్ వ్యాపారంలో డాక్టర్
రాజధాని ముషీరాబాద్‌లో ఓ వైద్యుడు తన ఇంట్లోనే డ్రగ్స్ వ్యాపారం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసుతో సంబంధమున్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు యువకులతో కలిసి డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి అమ్మకాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్‌లోని తనింటి నుండే డాక్టర్ అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో డాక్టర్ ఇంట్లో సోదాలు జరిపిన బృందానికి భారీగా డ్రగ్స్ దొరికాయి. వైద్యుడి ఇంట్లో డ్రగ్స్‌ను చూసి ఎక్సైజ్ పోలీసులు ఖంగుతిన్నారు.
ఈజీ మనీ కోసం
రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలన్న కోరికతో హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే యువకులు బెంగుళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి ఎవరికీ అనుమానం రాకుండా డాక్టర్ జాన్‌పాల్ ఇంట్లో పెట్టి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యాపారానికి డాక్టర్ పూర్తిగా సహకరించాడని పోలీసులు చెప్పారు. డాక్టర్ స్వయంగా డ్రగ్స్ వాడటంతో పాటు వాటిని అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

