తెలంగాణలో వెలుగుచూసిన డ్రగ్స్ హాట్ స్పాట్లు,డ్రగ్స్ యూజర్స్ ఎవరంటే..
x
SAY TO NO DRUGS

తెలంగాణలో వెలుగుచూసిన డ్రగ్స్ హాట్ స్పాట్లు,డ్రగ్స్ యూజర్స్ ఎవరంటే..

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు టీజీన్యాబ్, ఎక్సైజ్,పోలీసులు ముప్పేట దాడులు చేస్తున్నారు.విద్యాసంస్థలు,ఐటీ కంపెనీలు, పబ్ లు డ్రగ్స్ హాట్ స్పాట్లుగా మారాయని తేలింది


ఓ వ్యాపారి ఖరీదైన డ్రగ్స్ తో రాయదుర్గం పబ్ లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు దొరికాడు. వ్యాపారి యూరిన్ శాంపిల్ ను సేకరించి డ్రగ్స్ పరీక్ష కిట్ తో పరీక్షించగా పాజిటివ్ అని తేలింది.

- ధూల్ పేటలో ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఆరుగురు జూనియర్ వైద్యులు గంజాయి తీసుకుంటుండగా టీజీన్యాబ్ అధికారులు పట్టుకున్నారు. ఒత్తిడికి గురైనపుడు తాము గంజాయి తాగుతామని వైద్యులు అంగీకరించారు.తాము మూడేళ్లుగా మాదకద్రవ్యాలు తీసుకుంటున్నామని చెప్పడంతో అధికారులే షాక్ అయ్యారు.
- మాదాపూర్ నోవాటెల్ లో ని ఆర్టీస్ట్రీ పబ్ లో ముగ్గురు డ్రగ్స్ తీసుకున్నారని తనిఖీల్లో వెల్లడైంది.
- రాయదుర్గం కేవ్ పబ్ లో 52 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా, వారిలో 33 మంది గంజాయి, కొకైన్, ఎండీఎంఏ వాడారని వెల్లడైంది.
- పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని తేలింది.

విద్యార్థులకు కౌన్సెలింగ్
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులే డ్రగ్స్ యూజర్స్ అని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తాజాగా జరిపిన పరీక్షల్లో తేలింది. నగర శివారు ప్రాంతాలైన శామీర్ పేట, షాద్ నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని కీలక విద్యాసంస్థల విద్యార్థులే డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడైంది. సింబయాసిస్ కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఓషన్ గ్రోన్ వాడారని వెల్లడైంది.ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఆరుగురు జూనియర్ వైద్యులు గంజాయి తీసుకుంటున్నట్లు తేలడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంసీఐకు టీజీ న్యాబ్ అధికారులు లేఖ రాశారు. గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు గంజాయి తాగుతుండటంతో వారిని కౌన్సెలింగ్ పునరావాస కేంద్రానికి తరలించారు.

గుప్పుమన్న గంజాయి
క్యులినరీ అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు విద్యార్థులు గంజాయి తాగుతుండటంతో టీజీ న్యాబ్ అధికారులు విద్యాసంస్థకు సమాచారం ఇచ్చారు. చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఓ విద్యార్థి గంజాయితో అధికారులకు దొరికాడు. బాసర త్రిపుల్ ఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు, జోగిపేట జేఎన్ టీయూకి చెందిన 3, తిరుచ్చి ఎన్ఐటీకి చెందిన ఒక విద్యార్థి, నాలుగు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నారని తేలడంతో వారిపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చర్యలు తీసుకుంది. విద్యా సంస్థల్లో డ్రగ్స్ గుట్టు రట్టు కావడంతో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలను నియమించారు.

ఈ- సిగరెట్లు
ఇండస్ స్కూల్ విద్యార్థులు ఈ-సిగరెట్లు తాగుతున్నారని తేలింది.జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్ లో సోమవారం రాత్రి తనిఖీలు చేయగా నలుగురు గంజాయి, కొకైన్ వాడారని వెల్లడైంది. 40 కిలోల నల్లమందును పోలీసులు సోమవారం రాత్రి ఎల్ బినగర్ లో పట్టుకున్నారు. ధూల్ పేటను గంజాయి రహితంగా మార్చేందుకు తాము ముమ్మర తనిఖీలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి చెప్పారు.

డ్రగ్స్ డిటెక్షన్ డాగ్ లు

రాయదుర్గం, బంజారాహిల్స్ పరాంతాల్లోని పబ్ లు, ధూల్ పేట, మంగళ్ హాట్ ప్రాంతాల్లో కొకైన్, గంజాయి, హెరాయిన్, ఎల్ఎస్ డీబ్లాట్స్ విక్రయించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో 3వేల మంది డ్రగ్స్ వాడకం దారులకు వారి కుటుంబసభ్యుల సమక్షంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ డిటెక్షన్ డాగ్ లు, డ్రగ్స్ టెస్టు కిట్ లతో టీజీ న్యాబ్ అధికారులు పరీక్షలు చేస్తున్నారు. డ్రగ్స్ పరీక్షల ఫలితాలు వెంటనే వస్తుండటంతో వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

అధికారుల ముమ్మర దాడులు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ రవాణ, విక్రయం, వినియోగం పెరగడంతో టీజీన్యాబ్, ఎక్సైజ్, పోలీసు అధికారులు ముమ్మర దాడులు చేస్తున్నారు. బెంగళూరు, ముంబయి, రాజస్థాన్ ప్రాంతాల నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారని తేలడంతో అసలు సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్మగ్లర్లకు కొందరు ఏజెంట్లుగా మారారని దర్యాప్తులో వెల్లడైంది. సోషల్ మీడియా, డార్క్ నెట్ సహాయంతో గుట్టుగా డ్రగ్స్ దందా సాగిస్తున్నారని టీజీ న్యాబ్ దర్యాప్తులో తేలింది.

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం
డ్రగ్స్ వినియోగించవద్దంటూ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రచారం చేపట్టింది. సినీనటులు చిరంజీవి, సుమన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించామని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా చెప్పారు. హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలల క్యాంపస్‌లలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దాడులు ముమ్మరం చేసింది.

డ్రగ్స్ సమాచారం అందిస్తే బహుమతి
తెలంగాణలో డ్రగ్స్ గురించి సమాచారాని్న నార్కోటిక్స్ పోలీసులకు సమాచారం అందిస్తే బహుమతి ఇస్తామని టీజీ న్యాబ్ అధికారులు ప్రకటించారు. డ్రగ్స్, గంజాయి గురించి సమాచారాన్ని 8712671111 ఫోన్ నంబరుకు అందజేయాలని టీజీ న్యాబ్ కోరింది.


Read More
Next Story