‘పుష్ప’ తరహాలో గంజాయి స్మగ్లింగ్
x
Ganja Smuggling

‘పుష్ప’ తరహాలో గంజాయి స్మగ్లింగ్

ఎక్కడైనా పోలీసులు దాడులు చేస్తే వెంటనే మారణాయుధాలకు పనిచెప్పి తప్పించుకుంటున్నారు.


గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాలు మారినా గంజాయి వ్యాపారానికి మాత్రం బ్రేకులు పడటంలేదు. గంజాయి(Ganja Smuggling) స్మగ్లింగులో ఎప్పటికప్పుడు కొత్తపంథాను అనుసరిస్తున్న వ్యాపారులు ఇపుడు రెండురకాలుగా వ్యాపారాలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఇందులో మొదటిది ఏమిటంటే గంజాయి వ్యవహరాలతో ఎలాంటి సంబంధంలేని యువతను డబ్బులు ఆశచూపించి రంగంలోకి దింపుతున్నట్లు తెలిసింది. వీరి ద్వారానే గంజాయి రవాణ చేయిస్తున్నారు. చెప్పిన చోటకు, చెప్పిన వ్యక్తికి గంజాయిని చేర్చిన యువతకు వ్యాపారులు రు. 10 వేలు ముట్టచెబుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇక రెండో మార్గం ఏమిటంటే గంజాయి రవాణ సమయంలో మూడు, నాలుగు వాహనాల్లో మారణాయుధాలు వెంటపెట్టుకుని వెళ్ళటం. మధ్యలో ఎక్కడైనా పోలీసులు దాడులు చేస్తే వెంటనే మారణాయుధాలకు పనిచెప్పి తప్పించుకుంటున్నారు. కొన్ని చోట్లయితే గంజాయి వాహనానికి ముందు, వెనుక వస్తున్న వాహనాలను ఉన్నతాధికారులు లేదా ప్రముఖులు వెళుతున్నపుడు ఉపయోగించే ‘ఎస్కార్ట్’ స్టైల్ ను సినిమాల్లో లాగ స్మగ్లర్లు ఉపయోగిస్తున్నట్లు తేలింది. గంజాయిని అరికట్టేందుకు ఎంతప్రయత్నాలు చేసినా పెద్దగా ఉపయోగం కనబడటంలేదని పోలీసులు వాపోతున్నారు.


15 రోజులక్రితం ఒడిసాలో గంజాయిని కొని కేరళలో చేర్చేందుకు బయలుదేరిన ఒక ముఠా, ఎస్కార్ట్ గా కొన్ని వాహనాలను ఏర్పాటుచేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ దగ్గర ఎన్ ఫోర్స్ మెంట్ బృందం గంజాయి వాహనాలను అడ్డుకున్నాయి. ఆ వాహనాన్ని తనిఖీ చేసినపుడు 106 కిలోల గంజాయి దొరికింది. అలాగే వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిదగ్గర తుపాకులు ఉండటాన్ని అధికారులు గుర్తించి ఆశ్చర్యపోయారు. అయితే ఆ తుపాకులను ఉపయోగించకుండా సంబంధిత అధికారులు వారిని అడ్డుకున్నారు. వారిని తనిఖీ చేసినపుడు ఒక పిస్తోలు, 5 రివాల్వార్లు, 400 బుల్లెట్లు దొరకటంతో పోలీసులకు షాక్ కొట్టినట్లయ్యింది. విషయం ఏమిటంటే తాము పట్టుకున్న ముఠాలోని సభ్యుల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తే వారిపై సుమారు 100కు పైగా కేసులున్నట్లు తేలింది.


గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ అక్రమరవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, ఎక్సైజ్, టీజీ న్యాబ్, ఈగిల్ బృందాలు నిరంతరం కష్టపడుతున్నప్పటికీ గంజాయి రవాణ మాత్రం తగ్గటంలేదు. గంజాయి సాగు ఏపీ, ఒడిస్సాలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల నుండి గంజాయి దేశంలోని అనేక రాష్ట్రాలకు యధేచ్చగా చేరుతోంది. రోడ్డుమార్గాల్లో తనిఖీలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు కొత్త రైలు మార్గాలను కనిపెట్టారు. ఎకరాకు రు. 50 వేలు చెల్లించి ఏజెన్సీ ఏరియాల్లో వ్యాపారులు గంజాయి సాగు చేయిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యు ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు చెబుతున్నారు. గోవా, ముంబాయ్, చెన్నై, కర్నాటక, తెలంగాణకు చేర్చటం ద్వారా వ్యాపారాలు రోజుకు రు. 10 లక్షలు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఈ ఏడాది జూన్-ఆగష్టు మధ్యలో అంటే మూడునెలల్లోనే పోలీసుల తనిఖీలు లేదా దాడుల్లో 428 కిలోల గంజాయి, 419 కిలోల హాషీష్ ఆయిల్, 26 గ్రాముల ఏడీఎం, 19 గ్రాముల కొకైన్, కిలో గంజాయి చాక్లెట్లు, 106 గంజాయిమొక్కలు, 1.5 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. 156 మందిని అరెస్టు చేసి 48 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు 98 కేసులు నమోదుచేశారు. జనవరి నుండి ఆగష్టు వరకు చూస్తే 880 కేసులు నమోదుచేసిన పోలీసులు 1625 మందిని అరెస్టుచేశారు. 3,681 కిలోల గంజాయి, 66 కిలోల గంజాయి చాక్లెట్లు, 44 గ్రాముల కొకైన్, 105 గ్రాముల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.


ఫస్ట్ క్లాసులో ప్రయాణం

రోడ్డుమార్గంలో తనిఖీలు బాగా పెరిగిపోతుండటంతో స్మగ్లర్లు కొత్తమార్గాన్ని కనిపెట్టారు. అదేమిటంటే అప్పటివరకు గంజాయి వ్యాపారంతో ఎలాంటి సంబంధంలేని యువతను రంగంలోకి దింపుతున్నారు. వీరితో స్మగ్లింగ్ ఎలా చేయిస్తున్నారు ? ఎలాగంటే సదరు యువకుడితో పాటు కుటుంబం మొత్తానికి రైలులో ఫస్ట్ క్లాసులో వ్యాపారులే టికెట్లు బుక్ చేస్తున్నారు. కుటుంబంతో వెళుతున్నారు కాబట్టి లగేజి ఎక్కువగానే ఉంటుంది. అందులోను ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్నారు కాబట్టి బయటవారు ఎవరూ ఉండరు కూపేలో. కుటుంబం లగేజీలోనే గంజాయిని కూడా సర్దేస్తారు. దిగాల్సిన స్టేషన్ వచ్చినపుడు సంబంధిత వ్యక్తులు స్టేషన్ కు వచ్చి ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్న యువకుడి దగ్గరనుండి సరుకును తీసుకుంటున్నారు. సరుకును రవాణ చేసినందుకు యువకుడికి వ్యాపారులు రు. 10 వేలు ముట్టచెబుతున్నారు.


రైళ్ళల్లో యువకుల ద్వారా స్మగ్లర్లు గంజాయిని రవాణ చేయిస్తున్న మూడు ఘటనలు ఒడిసాలో బయటపడింది. దాంతో ఇపుడు పోలీసులు రైలు ప్రయాణాల మీద కూడా దృష్టి సారించారు. ఒడిసా నుండి ఏపీ, తెలంగాణ మీదుగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే రైళ్ళను గంజాయివ్యాపారస్తులు రవాణకు ఉపయోగించుకుంటున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ప్రధానంగా కోణార్క్ ఎక్స్ ప్రెస్, ఈస్ట్ కోస్ట్, విశాఖ-మహబూబ్ నగర్, నవజీవన్, దేవగిరి, గోదావరి, విశాఖ ఎక్స్ ప్రెస్, నాగావళి, హైదరాబాద్ దెక్కన్ రైళ్ళల్లో కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.


దొరికిన సమాచారం ఆధారంగా రైల్వే పోలీసులు, ఈగిల్ బృందాలు జరిపిన దాడుల్లో ఏడాదిలో 2,327 కిలోల గంజాయిని రైళ్ళల్లో పట్టుకున్నారు. గంజాయిని రవాణ చేస్తున్నారు అన్న అనుమానంతో 147 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 116 కేసులు నమోదుచేశారు. ఒకవేళ పోలీసుల దాడుల్లో యువత పట్టుబడినా వాళ్ళకు గంజాయి ప్యాకెట్లు ఎవరిచ్చారు అన్న విషయాలు తెలీకుండా వ్యాపారులు, కొరియర్లు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రాణాంతకంగా తయారైన గంజాయి వ్యాపారాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రభుత్వాలకు అర్ధంకావటంలేదు.

Read More
Next Story