అధికారిక లాంఛనాలతో ముగిసిన డీఎస్ అంత్యక్రియలు
x

అధికారిక లాంఛనాలతో ముగిసిన డీఎస్ అంత్యక్రియలు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) అంత్యక్రియలు ముగిశాయి.


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ పట్టణంలోని స్మశాన వాటికలో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డీఎస్ చిన్న కుమారుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, కుటుంబ సభ్యులు, రాజకీయంగా నాయకులు, అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. డీఎస్ ను కడసారి చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువుల భారీగా తరలివచ్చారు. అంతకుముందు నిజామాబాద్ లోని డీఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.


రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ పాత్ర ఎనలేనిది -సీఎం రేవంత్

డీఎస్ కి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో డీఎస్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. గాంధీ కుటుంబానికి ఆత్మీయుడుగా డిఎస్ గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని సోనియాగాంధీకి వివరించారన్నారు. దీంతో కరీంనగర్ లో సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించారని సీఎం తెలిపారు. సోనియా గాంధీతో డీఎస్ కి ఉన్న అనుబంధం కారణంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం అయిందని చెప్పుకొచ్చారు.


2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డీఎస్ కృషి చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆయన పార్టీకి దూరమైనా.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎదురు పడినప్పుడు సోనియా గాంధీ, ఆయనను ఆత్మీయంగా పలకరించేవారని సీఎం తెలిపారు. పార్టీలో లేకపోయినా.. డీఎస్ మనవాడు అని సోనియా గాంధీ అన్నారని, ఆ సమయంలోనే మళ్ళీ పార్టీలో చేరతానని ఆయన చెప్పారని వెల్లడించారు. తాను చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలని మాత్రమే డీఎస్ కోరుకున్నారని, అందుకే అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఆయన ఇంటికి వెళ్లి పార్థివదేహంపై కాంగ్రెస్ జెండా కప్పారని, ఆయన చివరి కోరిక నెరవేర్చామని రేవంత్ అన్నారు.

Read More
Next Story