వాయిదాకు ‘ఎస్’ అనకుంటే.. సర్కార్ తో ‘ఢీ’ అంటాం: డీఎస్సీ అభ్యర్థులు
x

వాయిదాకు ‘ఎస్’ అనకుంటే.. సర్కార్ తో ‘ఢీ’ అంటాం: డీఎస్సీ అభ్యర్థులు

సర్కార్ డీఎస్సీ ని కనీసం మూడు నెలలకు వాయిదా వేయాలని టెట్ కు ఈ మధ్య అర్హత సాధించిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష సిలబస్ చూసుకోవడానికి కూడా..


డీఎస్సీని వెంటనే వాయిదా వేయాలని నిరుద్యోగులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. వందల మంది అభ్యర్థులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకురావడంతో అక్కడ చాలా సేపు ఉద్రిక్తత తలెత్తెంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడున్న వారందరిని అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే 5 వేల పోస్టులతో డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే దీనిపై టీచర్ ఉద్యోగార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్నే లేకుండా చేయడానికే ఈ విధంగా తక్కువ ఉద్యోగాలతో డీఎస్సీ ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ప్రకటించింది. దీనితో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాత ప్రభుత్వం ప్రకటించిన 5 వేల పోస్టులకు అదనంగా మరో 6 వేల పోస్టులు జత చేసి మొత్తం 11, 062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు- 2,849, ఎస్జీటీ- 7, 304, లాంగ్వేజీ పండిట్- 727, పీఈటీ- 182 పోస్టులు ఉన్నాయి.
అలాగే మరోసారి టెట్ నిర్వహించడానికి కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మే 20న టెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ పూర్తయిన నేపథ్యంలోనే ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయడానికి నడుంబిగించింది. ఈ లోపు టెట్ పరీక్ష ఫలితాలు జూన్ 2 విడుదల చేసింది. జూన్ చివరి వారంలోనే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి 2. 79 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
వివాదం మొదలు..
జూన్ 2 టెట్ ఫలితాలు ప్రకటించడం, జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్ష ఉండటంత అభ్యర్థులు ఆందోళనకు గురైయ్యారు. కొంతమంది అభ్యర్థులు తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యారు. కేవలం నెల రోజుల్లోనే ఉద్యోగ పరీక్ష షెడ్యూల్ విడుదల చేయడంతో ఎక్కడ నుంచి చదవడం మొదలు పెట్టాలి. పుస్తకాలు ఎప్పుడు సమకూర్చుకోవాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
కనీసం సిలబస్ సంబంధించినవి అన్ని సమకూర్చుకోవడానికే నెల రోజులు పడుతుందని మరి చదవడానికి సమయం ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు ఆగష్టులో గ్రూప్ 2 పరీక్ష ఉండటంతో ఇంకా గందరగోళంగా తయారైంది. రెండు కీలకమైన క్యాడర్ కావడంతో ఏదో ఒక పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా కేవలం డీఎస్సీ పైనే ఆశపెట్టుకున్న చాలా మంది వెంటనే దీనిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో అభ్యర్థులు ఉద్యమ బాట పట్టారు.
వాయిదా వేయాల్సిందే..
ఇదే అంశంపై హనుమకొండ జిల్లాకు చెందిన డీఎస్సీ అభ్యర్థిని నల్లగోని దివ్య ది ఫెడరల్ తో మాట్లాడారు. ‘‘ డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాల్సిందే. కేవలం నెల రోజుల సమయంలో అభ్యర్థులు ఎలా చదువుతారు. నేను ఇంతకుముందే టెట్ కు అర్హత సాధించాను. అయినా కొత్త గా టెట్ అర్హత సాధించిన వారికి కనీసం మూడు నెలల సమయం అయినా ఇవ్వకపోతే ఎలా? సిలబస్ గురించి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి’’ అని కోరారు.
‘‘ నేను డీఎడ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక అయినా తరగతులు చెప్పేది 1- 5 వరకే..కానీ డీఎస్సీకి చదవాల్సింది మాత్రం 1 -ఇంటర్ వరకూ ఉన్న అన్ని సబ్జెక్ట్ లు చదవాలి. వీటికి తోడు కరెంట్ అఫైర్స్, జీకే అంటూ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అవసరమా?’’ అని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి కేవలం 20 పోస్టులు మాత్రమే ఉన్నాయని, ఆశావాహులు మాత్రం వేలల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు వెంటనే మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన మరో అభ్యర్థిని ఎంగల అనూష కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎన్నికల్లో హమీ ఇచ్చినట్లు వెంటనే మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరారు. ప్రస్తుత డీఎస్సీలో అతి తక్కువ పోస్టులు ఉన్నాయని, ఈ నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేయలేదని అభిప్రాయపడ్డారు.
‘‘ డీఎస్సీని వెంటనే వాయిదా వేయాలి. నెలన్నర సమయంలోనే ఎలా చదవుతాం. పరీక్ష కేవలం 80 మార్కులకే నిర్వహిస్తున్న చదవాల్సిన సిలబస్ మాత్రం ఎవరెస్ట్ అంతా ఉంది. పేజీలు తిప్పడానికే కనీసం నెల పడుతుంది. ఇంకా చదివేదెప్పుడూ?’’ అని ప్రశ్నించారు.
మరో అభ్యర్థిని సౌమ్య( పేరు మార్చాం) మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తరువాత ప్రభుత్వం మరో మాట చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని కేవలం 11 వేల పోస్టులతో డీఎస్సీని ప్రకటించారని, ఒక వైపు మూసివేసి పాఠశాలలను తెరిపిస్తామంటూ , ఇంకోవైపు తక్కువ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్ని రోజులు గ్రూప్ 2 కోసం చదివాం.. ఇప్పుడు సడన్ గా డీఎస్సీ పరీక్ష తేదీలు ఇచ్చారు. వాటికి, గ్రూప్స్ కి మధ్య కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఎలా చదవాలి.. ఎలా రాయాలి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని.. పోటీ పరీక్షల నిర్వహణ విధానం ఇది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పరీక్షకు .. మరొక పరీక్షకు మధ్య తగినంత వ్యవధి ఇవ్వాలని కోరారు. లేకపోతే ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.
Read More
Next Story