
War tanks|డ్యుయల్ మోడ్ యుద్ధట్యాంకు ట్రయల్ సక్సెస్
జేమ్స్ బాండ్ సినిమాలో నీళ్ళల్లోను, నేలపైనా నడవగలిగే డ్యుయల్ వెహికల్ ను హీరో నడిపే సన్నివేశం ప్రేక్షకులను అబ్బురపరిచింది.
జేమ్స్ బాండ్ సినిమాలో నీళ్ళల్లోను, నేలపైనా నడవగలిగే డ్యుయల్ వెహికల్ ను హీరో నడిపే సన్నివేశం ప్రేక్షకులను అబ్బురపరిచింది. అప్పట్లో ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని ఎంతో ఆసక్తిగా చూశారు. అది సినిమా కాబట్టి ఏదో చూపించారులే అనుకోవచ్చు. అయితే అచ్చంగా అలాంటి వాహనాన్నే మన శాస్త్రజ్ఞులు ఇపుడు నిజంచేసి ఆశ్చర్యపరిచారు. అదికూడా మామూలు వాహనం కాదు ఏకంగా యుద్ధట్యాంకునే తయారుచేశారు. నీళ్ళలోను, నేలపైనా నడపగలిగిన యుద్ధట్యాంకు(War Tanks)ను తయారుచేసింది ఎవరోకాదు రక్షణరంగ శాస్త్రజ్ఞులు(Defence Scientists). తయారైంది కూడా తెలంగాణా(Telangana), సంగారెడ్డి జిల్లా కందిమండలంలోని ఎద్దుమైలారం గ్రామంలోని డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్లో. అవును, ఎద్దుమైలారంలోని రక్షణరంగ పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలు యుద్ధట్యాంకుల తయారీపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. భూమిపైనేకాదు నీళ్ళల్లోకూడా ఒకే సామర్ధ్యంతో ప్రయాణించగలిగిన ట్యాంకుల తయారీలో బాగా పరిశోథనలు చేశారు.
సంవత్సరాలపాటు పడినకష్టానికి తగినఫలితం సాధించారు. కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్దచెరువులో దీనికి సంబంధించిన ట్రయల్ రన్ ను శాస్త్రవేత్తులు విజయవంతంగా పూర్తిచేశారు. 14.5 టన్నుల బరువుండే యుద్ధట్యాంకును చెరువులో ఒక వైపును నీళ్ళల్లో దింపి మరోవైపును ఒడ్డుకు డ్రైవ్ చేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా నీళ్ళల్లో ప్రయాణించిన ఈ యుద్ధట్యాంకు అవతల ఒడ్డుకు చేరుకుని ఆపై భూమిపైన కూడా చక్కగా ప్రయాణించింది. ఈ ట్రయల్ రన్ చూడటానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఎందుకంటే నీళ్ళల్లోకి దిగిన ఈ 14.5 టన్నుల బరువున్న ట్యాంకు చక్కగా పడవలాగ నీటిపైన తేలుతు ఇవతల ఒడ్డుకు చేరుకుంది. ఈ ట్యాంకులో 14 మంది అధికారులు ప్రయాణించారు.
నీళ్ళల్లో ఉన్నపుడు మోటారు బోటులాగ, నేలపైన 65 కిలోమీటర్ల స్పీడుతో కారులాగ యుద్ధట్యాంకు ప్రయాణించటాన్ని జనాలు బాగా ఎంజాయ్ చేయటమే కాదు ఇంతటి మహత్తర యుద్ధట్యాంకును రూపొందించిన శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రతిఏడాది 120 ట్యాంకులను తయారుచేసి మిలిటరీకి అందిస్తామని క్వాలిటీఅధికారి రత్నప్రసాద్ చెప్పారు. మిలిటరీకి అప్పగించేముందే ట్యాంకులకు 25 రకాల ట్రయల్ రన్ ద్వారా పరీక్షిస్తామన్నారు. ఇదే విషయమై కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి(Central Minister Kishan Reddy) సంతోషాన్ని వ్యక్తంచేశారు. డ్యుయల్ మోడ్ యుద్ధట్యాంకును రూపొందించిన శాస్త్రవేత్తలను అభినందించారు. మేక్ ఇన్ ఇండియా(Make In India) నినాదంతో ఆత్మనర్భర్ భారత్ లక్ష్యంతో దేశంలో రక్షణ పరికరాల తయారీని నరేంద్రమోడి ప్రభుత్వం(Narendra Modi Government) పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణాలోని అనేక ఎంఎస్ఎంఈ, పెద్ద పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు రంగసంస్ధలు రక్షణ పరికరాలను తయారు చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. యుద్ధపరికరాలను ఆర్మీకి అందించటమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. ఇపుడు విజయవంతంగా పరీక్షించిన డ్యుయల్ మోడ్ యుద్ధట్యాంకులకు తోడు భవిష్యత్తులో మరెన్నో రక్షణ పరికరాలను జోడించాలని కిషన్ రెడ్డి కోరుకున్నారు.