
Eagle Squad|తెలంగాణా పోలీసుల్లోకి ఈగల్ స్వ్కాడ్
ఈ విషయాలను బాగా ఆలోచించిన తెలంగాణాపోలీసులు(Telangana Police) ప్రత్యేకంగా మరోదళాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు.
తొందరలోనే తెలంగాణా పోలీసులకు ఈగల్ స్వ్కాడ్ సేవలు అందుబాటులోకి రాబోతోంది. ఈగల్ స్క్వాడ్ అంటే ఏమిటని అనుకుంటున్నారా ? ఆకాశంలో ఎగురుతు కాపలా కాయటానికి, విద్రోహశక్తులను పసిగట్టడానికి ఇప్పటికే ద్రోన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రుల పర్యటనల్లో పోలీసులు ఇప్పటికే ద్రోన్లను ఉపయోగిస్తున్నారు. భూమిపైన పోలీసులు కాపలాకాస్తుంటే ఆకాశంపైనుండి ద్రోన్లు(Drones) అత్యంత ప్రముఖుల పర్యటనల్లో కాపలాకాస్తుంటాయి. భూమిపైన ఉన్న జనాల కదలికలను ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోల రూపంలో పోలీసు ద్రోన్ కంట్రోలింగ్ పాయింటుకు అందిస్తుంటాయి. ముందుగానే అనుమానితుల ఫొటోలను ఫీడ్ చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తుల కదలికలు ప్రముఖుల పర్యటనల చుట్టుపక్కల ఎక్కడున్నా ద్రోన్లు వెంటనే పసిగట్టేస్తాయి.
అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే ఆకాశంలో ఎగురుతున్న ద్రోన్లను విద్రోహశక్తులు ఈజీగానే గమనిస్తాయి. కాబట్టి దానికి విరుగుడుగా తాము కూడా ఇంకేదో వ్యూహాన్ని పన్నుతాయి. ఈ విషయాలను బాగా ఆలోచించిన తెలంగాణాపోలీసులు(Telangana Police) ప్రత్యేకంగా మరోదళాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. ఆ ఆలోచనల్లోనుండి పుట్టుకొచ్చిందే ఈగల్ స్క్వాడ్(Eagle Squad). దీనికి బీజం మూడేళ్ళక్రితమే పడినా ఇపుడు అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ఈగల్ స్క్వాడ్ సేవలను తొందరలోనే తెలంగాణా పోలీసులు ఉపయోగించుకోబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు గద్దలను తెప్పించారు. గడచిన రెండేళ్ళుగా ఈ గద్దలకు అవసరమైన అన్నీ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మోయినాబాదులోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్లో 4 గద్దలకు ప్రత్యేకమైన శిక్షణిప్పించారు. ఇందుకోసం కోల్ కత్తా నుండి పక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వగలిగిన నిపుణుడిని రప్పించి మరీ రెండేళ్ళకుపైగా శిక్షణ ఇప్పించారు.
ఆకాశంలో ఎగురుతూ విద్రోహశక్తులను పసిగట్టడం, ఆ ఫోటోలు, వీడియోలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపటంలో గద్దలకు మంచి శిక్షణ ఇప్పించారు. ఈ 4 గద్దలతో కూడిన ఈగిల్ స్వ్కాడ్ అంతర్గత భద్రతా విభాగం పరిధిలో పనిచేస్తుందని సమాచారం. తొందరలోనే రంగంలోకి దిగబోయే ఈ స్వ్కాడ్ పనితీరును పోలీసు ఉన్నతాధికారులు శనివారం ప్రత్యక్షంగా పరీక్షించారు. రేవంత్ రెడ్డి(Revanth) ఇంటిమీద, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈగల్ స్వ్కాడ్ దాదాపు గంటసేపు ఎగరేశారు. ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగరగలవు, ఎంత ఎత్తునుండి ఫొటోలు, వీడియోలను మంచిక్లారిటితో పంపగలవు అన్న విషయాలను పరిశీలించారు. గద్దలు చిన్నపిల్లలుగా ఉన్నపుడే పోలీసులు నాలుగింటిని సేకరించారు. కోల్ కత్తా నుండి పక్షులకు శిక్షణ ఇచ్చే నిపుణుడిని పిలిపించారు. తమఅవసరాలు ఏమిటి, ఈగల్ స్క్వాడ్ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నామనే విషయాలను పోలీసు అధికారులు నిపుణుడికి వివరించారు. పోలీసుల అవసరాలు, ఆలోచనలకు తగ్గట్లుగానే నిపుణుడు సుమారు రెండేళ్ళపాటు నాలుగుగద్దలకు శిక్షణఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న నాలుగు గద్దల నైపుణ్యాన్ని శనివారం డీజీపీ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ గద్దలకు అత్యంత అధునాతనమైన కెమెరాలను అమర్చారు. వీటి ప్రధానమైన టార్గెట్ ఏమిటంటే సంఘవిద్రోహశక్తులు ఉపయోగించే ద్రోన్లను గుర్తించటం, కూల్చేయటమే. పనిలోపనిగా అత్యంత ప్రముఖల పర్యటనల్లో ఆకాశంలోనుండి కాపలాకాయటం. ఇప్పటికే పోలీసులను ద్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే ద్రోన్లు వాతావరణంలో మార్పులవల్ల నూరుశాతం సమర్ధవంతంగా పనిచేయటంలేదు. అందుకనే ప్రత్యేకంగా ఈగల్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపబోతున్నారు. గద్దలకు వాతావరణంలో మార్పులతో ఎలాంటి సమస్యలుండవు. 365 రోజులు, 24 గంటలూ ఆకాశంలో ఈగల్ స్క్వాడ్ ఎప్పుడైనా సేవలు అందించటానికి సిద్ధంగా తయారుచేశారు. కాబట్టి తొందరలోనే ఈగల్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపి అవసరానికి అనుగుణంగా మరిన్ని గద్దపిల్లలను సేకరించి ప్రత్యేకమైన శిక్షణను ఇప్పించాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు డిసైడ్ చేశారు. దేశంలోనే ఈగల్ స్వ్కాడ్ సేవలు ఉపయోగించోకోబోతున్నద రాష్ట్రం తెలంగాణానే. ప్రపంచంలో ఇప్పటికి ఈగల్ స్క్వాడ్ సేవలు అందుబాటులో ఉన్నది నెధర్ ల్యాండ్స్(Netherlands) పోలీసుల దగ్గర మాత్రమే.