జూబ్లీ ఎన్నికకు.. పోలింగ్ బూత్‌లు రెడీ..
x

జూబ్లీ ఎన్నికకు.. పోలింగ్ బూత్‌లు రెడీ..

పోలింగ్‌ బూత్‌కి నాలుగు చొప్పు మొత్తం 1,628 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం.


జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం శరవేగంగా పూర్తి చేస్తోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను అమలు చేస్తూ ఉపఎన్నికకు సర్వం సిద్ధం చేస్తోంది. తాజాగా పోలింగ్ బూత్‌ల ఏర్పాటును పూర్తి చేసింది. మొత్తం 127 పోలింగ్ స్టేషన్లలో 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు నాలుగు యూనిట్ల చొప్పున మొత్తం 1,628 బ్యాలెట్ యూనిట్లను సిద్దం చేసిట్లు చెప్పారు. అంతేకాకుండా పోలింగ్ సమయంలో ఎక్కడయినా బ్యాలెట్ యూనిట్లు మొరాయిస్తే వాటిని రీప్లేస్ చేయడం కోసం అదనంగా 20శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా ఉంచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపఎన్నిక పోలింగ్ ఎట్టిపరిస్థితుల్లో సాఫీగా సాగేలా చర్చలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మాగంటి సునీతపై కేసు..

ఉపఎన్నిక పోలింగ్‌కు భద్రత కూడా భారీగా ఉండనుంది. పోలింగ్‌ను పరిశీలించడం కోసం 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాడ్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఓటర్లను ఏ అభ్యర్థి కూడా మభ్య పెట్టకుండా ఉండటం కోసం వాహనాల తనిఖీలను కూడా అధికారులు ముమ్మరంగా చేపడుతున్నారని, ఇప్పటి వరకు రూ.2.90 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెలలడించారు. ఈ క్రమంలోనే మజీద్ దగ్గర ప్రచారం చేసినందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా ప్రచారం చేసినందుకు మాజీ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఉపఎన్నికకు భారీ భద్రత..

ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగడం కోసం భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర బలగాలు మంగళవారం నియోజకవర్గానికి చేరుకోనున్నాయని చెప్పారు. ఏడు కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 1600 మంది స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేసిన ఖర్చులకు సంబంధించిన రిజిస్టర్‌ను ఎన్నికల వ్యయ పరిశీలకులకు చూపించాలని ఆదేశాలు జరా చేశారు. రూ.10వేలకు మించి చేసిన ప్రతి పేమెంట్ కూడా చెక్కు రూపంలో ఉండాలని ఆదేశించారు.

Read More
Next Story