‘సృష్టి’ కేసులోకి ఈడీ ఎంట్రీ..
x

‘సృష్టి’ కేసులోకి ఈడీ ఎంట్రీ..

మనీలాండరింగ్ అనుమానాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్.


‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ చేసిన ఈ ఆసుపత్రిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. పిల్లల ట్రాఫికింగ్‌తో డాక్టర్ నమ్రత భారీగా సంపాదించారు. నాలుగేళ్లలో రూ.500 కోట్ల లావాదేవీలు చేశారు. సరోగసి చేస్తాం అని నమ్మించి అనేక మంది జంటలను వీరు మోసం చేశారు. ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌కు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ఈ క్రమంలోనే డాక్టర్ నమ్రత భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. అందుకోసమే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందించాలని కోరుతూ గతంలోనే సిట్‌కు లేఖ కూడా రాసింది. కాగా తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు (ఈడీ) అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్లాది రూపాయలు అర్జించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్ లో ఇప్పటివరకు 30 మంది అరెస్ట్ అయ్యారు. సృష్టి ఫెర్టిలిటీ బ్యాంకు అకౌంట్లతో బాటు ఆమె వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లను కూడా గోపాలపురం పోలీసులు సీజ్ చేశారు. 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఈ బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు వార్తలు రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 80 మంది శిశువులను సరోగసీ పేరిట దంపతులకు విక్రయించినట్టు, ఐవిఎఫ్ కోసం వచ్చిన దంపతులకు సరోగసీకి రెఫర్ చేసేదాన్ని అని డాక్టర్ నమ్రత పోలీసుల కస్టడీలో ఒప్పుకున్నారు.

అసలు కేసు ఏంటంటే..

రాజస్ధాన్ కు చెందిన దంపతులు పిల్లలు పుట్టేందుకు వైద్యంకోసం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటి సెంటర్(Srushti Fertility Centre) అధినేత డాక్టర్ నమ్రతను(Dr Namratha) 2024, ఆగష్టులో కలిశారు. ఫెర్టిలిటీ టెస్టులు చేసిన డాక్టర్ దంపతులతో మాట్లాడి ఐవీఎఫ్ ద్వారా కష్టమని సరొగసి పద్దతిలో బిడ్డకోసం ప్రయత్నించమని సూచించారు. అందుకు దంపతులు అంగీకరించిన తర్వాత వాళ్ళని డాక్టర్ విశాఖపట్నంలోని(Vizag) మరో సెంటర్ కు పంపించారు. దంపతుల్లో భర్త స్పెసిమన్ ను కలెక్ట్ చేసిన తర్వాత అద్దెగర్భం ధరించే మహిళ గర్భంలోకి పంపుతామని చెప్పారు. అందుకు చాలా ఖర్చవుతుందని చెప్పటంతో దంపతులు అందుకు అంగీకరించారు.

కొంతకాలం తర్వాత సరోగసి ద్వారా పొందిన పిల్లాడికి తరచూ అనారోగ్యం వస్తుంటే దంపతులకు అనుమానం వచ్చింది. డాక్టర్ నమ్రత దగ్గరకు తీసుకొస్తే పిల్లాడికి వైద్యం చేయటం తనపనికాదని చెప్పటంతో దంపతులు వేరే డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. పిల్లాడికి కొత్త డాక్టర్ పరీక్షలు చేయించగా క్యాన్సర్ అని తేలింది. ఇదే విషయాన్ని డాక్టర్ దంపతులకు చెప్పగా వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే దంపతుల్లో రెండువైపులా ఎవరికీ క్యాన్సర్ లేదని డాక్టర్ తో చెప్పారు. దాంతో అక్కడ డాక్టర్ కు జరిగిన విషయం మొత్తం చెప్పటంతో డీఎన్ఏ టెస్టు చేయించారు. దాంతో పిల్లాడి డీఎన్ఏ, దంపతుల్లో తండ్రి డీఎన్ఏ మ్యాచ్ కాలేదు. అదే విషయాన్ని దంపతులకు డాక్టర్ చెప్పారు. ఈవిషయాన్ని దంపతులు డాక్టర్ నమ్రతతో మాట్లాడటానికి ప్రయత్నించినపుడు ఆమె ఇష్టపడకపోవటమే కాకుండా బెదిరింపులకు దిగటంతో దంపతులు వేరేదారిలేక పోలీసులను కలిశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జరిపిన దర్యాప్తులో డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున అక్రమ సరొగసీలు చేస్తున్నట్లు బయపడింది. అలాగే సరొగసి ముసుగులో పిల్లలను కొనటంతో పాటు అమ్ముతున్నట్లు ఆధారాలు బయపడినట్లు డీసీపీ చెప్పారు.

Read More
Next Story