ప్రయివేటు మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా
x

ప్రయివేటు మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా

తెలుగు రాష్ట్రాలతో బాటు 10 రాష్ట్రాల్లో సోదాలు


ప్రయివేటు మెడికల్ కాలేజీలలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. గురువారం తెలుగు రాష్ట్రాలతో బాటు 10 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమ నిబంధనలను పాటించకుండా మెడికల్ కాలేజీలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు సిబిఐ గుర్తించింది. కొన్ని రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మెడికల్ కాలేజీల ప్రతినిధులను సిబిఐ విచారించింది. ఈ నేపథ్యంలో ఈడీ ప్రత్యక్ష దాడులకు దిగడం గమనార్హం.

బీఆర్‌ఎస్‌ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర దర్యాప్తు సంస్థలకు కాంగ్రెస్ పార్టీతోపాటు పలువురు కంప్లయింట్ ఇచ్చారు. దీంతో సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు దాడులు ప్రారంభించాయి. అప్పటి సీఎం కేసీఆర్‌ ఇంటికి కూడా సీబీఐ, ఈడీ అధికారులు వచ్చారు. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలోకి రానివ్వకుండా రహస్యంగా జీవో జారీ చేసింది. ఐటీ దాడులు మాత్రం యధావిధిగా కొనసాగాయి. ఎన్నికల సమయంలో ఈ ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బీఆర్‌ఎస్‌ నేతలతోపాటు, కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై జరిగాయి. ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈడీ, సీబీఐ కూడా రాష్ట్రంలోకి మళ్లీ ఎంటరయ్యాయి. తాజాగా మెడికల్‌ సీట్ల స్కామ్‌లో అవకతవకలపై ఇప్పటికే రాష్ట్రంలోని పలు కళాశాలలను సీబీఐ, ఈడీ అధికారులు తనిఖీ చేశారు. తాజాగా ఈడీ మరో మారు చర్యలకు ఉపక్రమించింది.

మూడు కాలేజి ఆస్తులు సీజ్

మూడు మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన ఆస్తులను గతంలో ఈడీ సీజ్‌ చేసింది.

మెడికల్‌ సీట్లలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు వచ్చిన మూడు మెడికల్‌ కాలేజీలకు చెందిన రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఇందులో మల్లారెడ్డి కళాశాలకు చెందిన రూ.2.89 కోట్లు, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన రూ.2.01 కోట్లు, కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీకి చెందిన రూ.3.33 కోట్లు ఆస్తులను సీజ్ చేశారు.

మెడికల్‌ సీట్లను అమ్ముకుని పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలపై ఈడీ అధికారులు గతంలో దాడులు చేశారు. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌ వరంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు కూడా నమోదైంది. మెడికల్‌ కాలేజీలపై ఈడీ మెరుపు దాడులకు దిగింది. కీలక సమాచారాన్ని సేకరించింది. నీట్‌ పీజీ మెరిట్‌ ఆధారంగా కన్వీనర్‌ కోటా లేదంటే ఫ్రీ సీట్ల కింద చాలా వరకు ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్‌ చేసినట్లు గుర్తించింది.

నిరుడు జూన్‌లో మల్లారెడ్డి నివాసంతోపాటు మెడికల్‌ కాలేజీ, ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు జప్తు చేసింది. వేర్వేరు మెడికల్‌ కాలేజీ అడ్మిషన్లు 2016 నుంచి 2022 వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఎంఎన్‌ఆర్, చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీల్లో చేపట్టిన తనిఖీల్లోనూ కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read More
Next Story