ఫాల్కన్ విమానాన్ని సీజ్ చేసిన ఈడీ
x
Falcon Jet Flight seized by ED

ఫాల్కన్ విమానాన్ని సీజ్ చేసిన ఈడీ

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED) ఉన్నతాధికారులు ఏకంగా ఒక విమానాన్నే సీజ్ చేశారు.


అధికారుల దాడుల్లో స్కూటర్ సీజ్ చేయటం, కారు, ఆస్తులు, డబ్బులు, బ్యాంకు లాకర్లను సీజ్ చేయటంగురించి వినుంటారు. అయితే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED) ఉన్నతాధికారులు ఏకంగా ఒక విమానాన్నే సీజ్ చేశారు. విమానాన్ని సీజ్ చేయటం బహుశా దేశంమొత్తంలో ఇదే మొదటిసారేమో. శంషాబాద్ విమానాశ్రయంలో ఉంచిన ఫాల్కన్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే తెలంగాణ(Telangana) కేంద్రంగా బయటపడిన ఫాల్కన్ స్కామ్(Falcon Scam) పెద్ద సంచలనమైంది. జనాల ఆశలనే పెట్టుబడిగా పెట్టి కొందరు వ్యక్తులు వందలాది కోట్లరూపాయలను దోచుకుని తర్వాత బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ లో అధికారులు గుర్తించిన మొత్తం రు. 850 కోట్లుగా లెక్కతేలింది.

పెట్టుబడుల ఇన్వాయిస్ డిస్కౌటింగ్ పేరుతో జనాలను ఫాల్కన్ సంస్ధ యాజమాన్యం బురిడీకొట్టించింది. ఈస్కామ్ లో కీలక సూత్రదారులు సీఎండీ అమర్ దీప్ కుమార్, వివేక్ సేఠ్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్, డైరెక్టర్ కావ్యా నల్లూరి, బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలుగా ఈడీ గుర్తించింది. అయితే దర్యాప్తులో అమర్, వివేక్, కావ్య, పవన్ కుమార్ అరెస్టవ్వగా ఆర్యన్, యోగేందర్ పరారీలో ఉన్నారు. ఇంతకీ ఏమిజరిగిందంటే అమర్ దీప్ పైన చెప్పిన కొంతమందితో కలిసి హైదరాబాద్ కేంద్రంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటుచేశాడు. ఈ ఫాల్కన్ ఏమిచేస్తుందంటే తమ సంస్ధలో పెట్టుబడులు పెట్టినవారికి 11-22 శాతం మధ్యలో వడ్డీలు చెల్లిస్తుంది. 11-22 శాతం వడ్డీలు చెల్లించటం అంటే చాలా చాలా ఎక్కువ రిటర్నులు చెల్లిస్తున్నట్లే. ఇక్కడే జనాల్లో ఆశలు బాగా పెరిగిపోయింది. మామూలుగా బ్యాంకుల్లో 100 రూపాయలు ఎఫ్డీ చేస్తే మహాయితే 70 పైసలు వడ్డీ వస్తుంది. అదే బయటవ్యక్తులకు అప్పిస్తే ఒక రూపాయో లేకపోతే అప్పు తీసుకునే వ్యక్తి అవసరాన్ని బట్టి రెండురూపాయలు కూడా వడ్డీ చెల్లించటానికి అంగీకరించవచ్చు. అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ వడ్డీలు చెల్లించేవాళ్ళు, వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ఇక్కడ అవసరాలు, అవకాశాలు అని చూడకుండా తమ సంస్ధలో పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరికీ ఫాల్కన్ యాజమాన్యం 11 నుండి 22 శాతం వడ్డీలు చెల్లిస్తామని చెప్పింది. చెప్పటమే కాకుండా రాతమూలకంగా కూడా వడ్డీ రేట్లపై కమిట్ మెంట్ ఇచ్చింది. దాంతో కొందరు అనుమానంతోనే ఫాల్కన్ లో పెట్టుబడులు పెట్టారు. అయితే యాజమాన్యం మాత్రం తీసుకున్న పెట్టుబడులకు ముందు చెప్పినట్లుగా 11-22 శాతం అంటే పెట్టుబడి పెట్టేటపుడు ఎంతవడ్డీకి అయితే అగ్రిమెంట్ జరిగిందో అంతవడ్డీని ఠంచనుగా చెల్లించింది. ఎప్పుడైతే తమ పెట్టుబడులకు అత్యధిక వడ్డీలను అందుకుంటున్నారో వెంటనే అదే విషయాన్ని డిపాజిట్ చేసిన ప్రతి పెట్టుబడిదారుడు ఒకరికి కాదు వంద, వెయ్యిమందికి చెప్పారు. ఫాల్కన్ సంస్ధకు పాజిటివ్ గా విపరీతమైన మౌత్ పబ్లిసీటీ జరిగింది. దాంతో ఒకళ్ళమీద నమ్మకంతో మరొకళ్ళు, ఎదురింటి వాడిమీద నమ్మకంతో పక్కింటివాడు పోలోమంటు పరుగెత్తుకుని వెళ్ళి ఫాల్కన్ లో పెద్దమొత్తాల్లో డిపాజిట్లు చేశారు.

పాల్కన్ మినిమం పెట్టుబడి రు. 25 వేలు అయితే మ్యాగ్జిమమ్ పెట్టుబడి రు. 9 లక్షలు. మెచ్యూరిటి పీరియడ్ 45 రోజుల నుండి 180 రోజులు. అత్యధిక వడ్డీలను అందుకుంటున్న డిపాజిట్ దారులు మినిమం ఎమౌంట్ పెడితే వచ్చే వడ్డీ తక్కువకాబట్టి ఎంతవీలుంటే అంత ఎక్కువగా డిపాజిట్లు చేశారు. ఈ విధంగా తెలుగురాష్ట్రాల్లో మాత్రమే సుమారు 7 వేలమంది దగ్గర రు. 1700 కోట్లు డిపాజిట్ చేశారు. పెట్టుబడిదారులకు వాళ్ళ డిపాజిట్ అగ్రిమెంట్ ప్రకారం రు. 850 కోట్ల వడ్డీని చెల్లించింది. వడ్డీలను చెల్లించిన ఫాల్కన్ సడెన్ గా బోర్డు తిప్పేసింది. అంటే వడ్డీల రూపంలో రు. 850 కోట్లు చెల్లించిన యాజమాన్యం డిపాజట్లు రు. 850 కోట్ల తీసుకుని పరారైపోయింది.

ఎప్పుడైతే ఫాల్కన్ బోర్డు తిప్పేసిందో వెంటనే డిపాజిట్లకు వడ్డీలు రావటం ఆగిపోయింది. డిపాజిట్ దారులు వెళ్ళిచూడగా తాళాలువేసిన ఆఫీసు కనబడింది. దాంతో అనుమానం వచ్చిన డిపాజిట్ దారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటమే కాకుండా ఫిర్యాదు కూడా చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తర్వాత ఈడీతో పాటు ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ)కు బదిలీచేశారు. కేసు దర్యాప్తు మొదలుపెట్టిన ఈడీ అధికారులు దోచుకున్న రు. 850 కోట్లతో అమర్ దీప్ దుబాయ్(Dubai) పారిపోయాడని తెలుసుకున్నారు. దుబాయ్ కు ఎలా పారిపోయాడని ఆరాతీసినపుడు ఒక విషయం తెలిసింది. అదేమిటంటే డిపాజిట్ దారుల డబ్బుతో అమర్ విలావంతమైన 8 సీట్ల జెట్ విమానాన్ని(Jet Flight) సొంతానికి కొనుక్కున్నాడని. 14 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన విమానాన్ని అమర్ దుబాయ్ కు వెళ్ళటానికి ఉపయోగించుకునేవాడు.

దుబాయ్ ప్రయాణాలు లేనపుడు దీన్నే ఎయిర్ అంబులెన్సు(Air Ambulance)గా ఉపయోగించేవాడు. అంటే అవసరమైన ఖరీదైన వ్యక్తులకు గంటకు 3 లక్షల రూపాయల అద్దెకు తన జెట్ విమానాన్ని తిప్పేవాడు. అంటే ఒకవైపు జనాల నుండి వందల కోట్ల రూపాయలు దోచుకోవటమే కాకుండా ఆ డబ్బులతో విలాసవంతమైన జెట్ విమానాన్ని(ఎన్ 935 హెచ్ హాకర్ 800ఏ) కొని దాన్ని ఎయిర్ అంబులెన్సుగా అద్దెకు తిప్పటం ద్వారా కూడా డబ్బులు సంపాదించాడు. ఈనెల 5 వ తేదీన అమర్ తన పార్టనర్లతో దుబాయ్ పారిపోయాడని ఈడీ అధికారులు గుర్తించారు. అందుకనే దేశంలోని అన్నీవిమానాశ్రయాలకు అమర్ తో పాటు జెట్ విమానం పేరుతో లుకౌట్ నోటీసులు జారీచేశారు. రెండురోజుల తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుండి ఈడీ అధికారులకు ఒక మెసేజ్ అందింది. అదేమిటంటే దుబాయ్ నుండి ఒక జెట్ విమానం హైదరాబాదుకు వచ్చిందని. వెంటనే ఈడీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని విమానాన్ని గుర్తించారు.

ఎప్పుడైతే తాము లుకౌట్ నోటీసు జారీచేసిన విమానమే దుబాయ్ నుండి వచ్చిందని నిర్ధారణ చేసుకున్నారో అర్జంటుగా విమానానికి సంబంధించిన సిబ్బందిని పిలిపించారు. వారితో విమానంలోపలికి వెళ్ళి సోదాలు చేశారు. సిబ్బంది ఇచ్చిన సమాచారం ద్వారా అమర్ దీప్ ఎక్కడున్నాడో కనుక్కుని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 14 కోట్ల రూపాయలతో విమానాన్ని కొనుగోలు చేసిన అమర్ మరో రు. 3 కోట్లు పెట్టి ఇంటీరియర్లు చేయించుకున్నాడు. విమానంలోపల ఇంటీరియర్లు చూసిన ఈడీ ఆశ్చర్యపోయింది. విమానంలోపల అంత విలాసంగా ఉంది. ఫిబ్రవరి 15వ తేదీన కావ్య, పవన్ను అరెస్టుచేసిన ఈడీ తాజాగా అమర్ ను కూడా అరెస్టుచేసింది. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరికోసం వెతుకుతున్నది. అరెస్టయిన నిందుతల విచారణలో గతంలో కూడా వీళ్ళు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. మరీ కేసు ఎప్పటికి దర్యాప్తు పూర్తవుతుందో ? బాధితులకు ఎప్పటికి న్యాయం జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story