మల్లారెడ్డికి ఈడీ నోటీసులు.. మాజీ మంత్రి ఏమంటున్నారంటే..!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డికి ఈడీ ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఆయన మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డికి ఈడీ ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఆయన మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్ల విషయంలో అక్రమాలు జరిగాయని గుర్తించడంతోనే ఈడీ ఈ నోటీసులు జారీ చేసిందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. గతేడాది జూన్ నెలలో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి మెడికల్ విద్యాసంస్థల్లో ఈడీ సోదాలు జరిపింది. 12 మెడికల్ కాలేజీల్లో పదుల సంఖ్యలో అధికారులు సోదాలు చేశారు. తనిఖీల అనంతరం భారీ సంఖ్యలో డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరువుగా పరిశీలించడం పూర్తి అయిన సందర్బంగానే ఇప్పుడు మాజీ మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ అక్రమాలపై వివరణ ఇవ్వాలని కూడా అధికారులు కోరారు.
పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగాలను మల్లారెడ్డి కొంతకాలంగా ఎదుర్కొంటూనే ఉన్నారు. తన విద్యా సంస్థల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని, అన్నీ నియమాల ప్రకారమే జరిగాయని మల్లారెడ్డి విద్యాసంస్థ యాజమాన్యాలు చెప్తున్నాయి. కానీ పీజీ మెడికల్ సీట్ల విషయంలో అవకతవకలు జరిగాయని అధికారులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లను బ్లాక్ చేశాయని, ఆ తర్వాత వాటిని అధిక ధరకు అమ్ముకున్నాయని ఈడీ గుర్తించిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటికి సంబంధించే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
నాకేలాంటి నోలీసులు రాలేదు: మల్లారెడ్డి
తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్ఫస్టం చేశారు. ‘నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నా కొడుక్కు నోటీసులు ఇచ్చారు. గతంలో ఈడీ సోదాలు జరిగాయి. విచారణకు రమ్మంటారు. అది ఎప్పుడూ జరిగేదే’’ అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా కొందరు కావాలనే ఇటువంటి అవాస్తలను ప్రచారం చేస్తున్నారని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.