గొర్రెల పంపిణీ కుంభకోణం దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది
x

గొర్రెల పంపిణీ కుంభకోణం దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది

హైదరాబాద్ లోఆరు చోట్ల సోదాలు


గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఈడీస్పీడ్ పెంచింది. హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టడంతో పెద్దల్లో టెన్షన్ పెరిగిపోతుంది. మాజీ పశు సంవర్దక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతాయని సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్‌‌‌కు దిల్‌సుక్‌నగర్‌లో ఉన్న ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగానే కళ్యాణ్‌ను ఈడీ అధికారులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి వరకు ఈడీ కార్యాలయంలో ఆయనను విచారించారు.

పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ రామచందర్‌ నాయక్‌, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్‌, పలువురి ఇళ్లలో ఇప్పటికే అధికారులు తనిఖీలు చేశారు. ఈ కుంభకోణంపై ఏసీబీ తొలుత కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో దాదాపు రూ.750 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కెసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు కాజేసినట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. .

కొంత మంది అమ్మకం దారులకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో నమోదైనప్పటికీ ఆ నిధుల్ని ఈ ముఠా స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు దర్యాప్తు అధికారుల విచారణలో తేలింది. అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు అనుమానాలున్నాయి. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉండొచ్చని ఏసీబీ, ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో రాష్ట్ర నిధులతో పాటు కేంద్రానికి చెందిన (ఎన్‌సీడీసీ) నిధులను కూడా వాడినట్లు ఈడీ అధికారులు పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

గొర్రెల పంపిణీ పథకం కథా కమామీషు

రూ. 12,000 కోట్ల బడ్జెట్‌తో 2017 జూన్ 20న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలకు గాను రూ. 1,25,000 ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను అమాంతం రూ.1,75,000కు పెంచారు. ఇందులో రూ. 1,31,250ను రాష్ట్ర ప్రభుత్వం భరించగా.. రూ. 43,750ను లబ్దిదారుడు భరించారు. ఈ పథకంలో గొర్రెలు ప్రమాదవశాత్తూ చనిపోతే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు రూ. 5,000 , పొట్టేలుకు రూ.7 వేల భీమా అందించింది. గొర్రెలు చనిపోయిన 10 రోజుల్లోనే ఈ భీమా డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఈ పథకంలో పలు దశల్లో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. గొర్రెల పంపిణీ కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

Read More
Next Story