
KTR and ED|నోటీసులతో కేటీఆర్ కు స్వాగతం పలికిన ఈడీ
తాజానోటీసులతో కేటీఆర్ ను విచారణకు కొత్త సంవత్సరం(2025 New Year)లో ఈడీ స్వాగతం పలికింది
కొత్తసంవత్సరంలో నోటీసులతో కేటీఆర్ కు ఈడీ స్వాగతం పలికింది. ఫార్ములా ఈ కార్ రేసు అవినీతిలో జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కు నోటీసులు జారీచేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ ఖాతా నుండి ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్ఇవో) అనే ప్రైవేటుసంస్ధకు రు. 55 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. ఆర్ధికశాఖ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)(RBI) అనుమతి తీసుకోకుండా పౌండ్లలో విదేశీకంపెనీకి చేసిన చెల్లింపుల్లో నిబంధనల ఉల్లంఘన జరగటమే కాకుండా అవినీతి జరిగిందని ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఫార్ములా కార్ రేసు అవినీతిపై విచారణ జరిపిన ఏసీబీ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బీ లక్ష్మీనారాయణరెడ్డి మీద కేసులు పెట్టింది. మంత్రి హోదాలో కేటీఆర్ నోటిమాటతో తాను ఎఫ్ఈవో సంస్ధకు రు. 55 కోట్లు చెల్లించినట్లు ఇప్పటికే అర్వింద్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నిర్వహించిన విచారణలో రాతమూలకంగా ఒప్పుకున్నారు. కేటీఆర్ నోటిమాటతో అర్వింద్ రు. 55 కోట్లు చెల్లించటమే విచిత్రంగా ఉంది. విదేశీకంపెనీకి చెల్లింపులు చేసేటప్పుడు ఆర్ధికశాఖ, క్యాబినెట్ అనుమతితో పాటు ఆర్బీఐ అనుమతి తప్పనిసరని నిబంధనలు చెబుతున్నాయి. అయితే మంత్రి హోదాలో తాను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ వాదన ఎలాగున్నా అవినీతి జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అందుకనే ఏసీబీ(ACB) కేటీఆర్ మీద ఏ1గా, అర్వింద్ కుమార్ పైన ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డి మీద ఏ3గా కేసులు నమోదుచేసింది.
ఎప్పుడైతే పై ముగ్గురిమీద ఏసీబీ కేసులు నమోదుచేసిందో వెంటనే ఈడీ(ED) కూడా రంగంలోకి దిగేసింది. ముగ్గురిపైనా ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ),(Money Laundering) ఫారెన్ ఎక్స్ చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్(ఫెమా) కేసులు నమోదుచేసింది. రు. 55 కోట్ల బదిలీలో హవాలా(Hawala) కోణం కూడా ఉందేమోనని ఈడీ విచారణ చేస్తోంది. ఈవిషయాలను విచారించేందుకే జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ కేటీఆర్ కు నోటీసులు జారీచేసింది. అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 2,3 తేదీల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టంచేసింది. అంటే కేటీఆర్ ను విచారించేముందు మొదటగా బీఎల్ఎన్ రెడ్డిని మరుసటిరోజు అర్వింద్ ను ఈడీ విచారించబోతోంది. తర్వాత నాలుగురోజుల గ్యాప్ తీసుకుని వీళ్ళిద్దరు చెప్పిన విషయాలను విశ్లేషించి అప్పుడు 7వ తేదీన కేటీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ పద్దతిలో విచారణ చేయబోతోందని అర్ధమవుతోంది.
తాజానోటీసులతో కేటీఆర్ ను విచారణకు కొత్త సంవత్సరం(2025 New Year)లో ఈడీ స్వాగతం పలికింది. విచారణ తర్వాత అరెస్టు అంటుందా లేకపోతే విచారణ చేసి వదిలేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. కేటీఆర్ అయితే అరెస్టుకు కొంతకాలంగా మానసికంగా సిద్ధపడిపోయున్నారు. ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ వాదన భిన్నంగా ఉంది. ఫార్ములా కార్ రేసు నిర్వహణ ద్వారా హైదరాబాదును ప్రపంచంలో పాపులర్ అయ్యేట్లుగా తాను ప్రయత్నించినట్లు చెబుతున్నారు. కార్ రేసు జరిగుంటే విదేశాల నుండి పెట్టుబడులు భారీగా వచ్చేవని అంటున్నారు. ఫార్ములా కార్ రేసులో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని బల్లగుద్దకుండానే చెబుతున్నారు. కార్ రేసును రేవంత్ రెడ్డి రద్దుచేయటం వల్ల ప్రభుత్వానికి రు. 700 కోట్ల నష్టం వచ్చినట్లు వాదిస్తున్నారు. ప్రభుత్వానికి వందల కోట్లరూపాయల నష్టం వచ్చేట్లుగా వ్యవహరించినందుకు రేవంత్ మీదే కేసుపెట్టాలని కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఈడీ విచారణలో ఏమి బయటపడుతుందో చూడాల్సిందే.