
వీక్షణం వేణు ఇంటిపై ఎన్ఐఏ పోలీసుల దాడులు
వరవరరావును అరెస్ట్ చేసి సుదీర్ఘకాలంగా జైల్లో ఉంచిన కేంద్ర దర్యాప్తు సంస్థ- ఎన్ఐఏ ఇప్పుడు ఆయన మేనల్లుడు నెల్లుట్ల వేణుగోపాల్ ఇంట్లో సోదాలు చేపట్టింది
విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకత్వం చుట్టూ ఉచ్చు బిగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆమధ్య విరసం నేత, మావోయిస్టుల అభిమాని వరవరరావును అరెస్ట్ చేసి సుదీర్ఘకాలంగా జైల్లో ఉంచిన కేంద్ర దర్యాప్తు సంస్థ- ఎన్ఐఏ ఇప్పుడు ఆయన మేనల్లుడు నెల్లుట్ల వేణుగోపాల్ ఇంట్లో సోదాలు చేపట్టింది. వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ ఇంటిని ఎన్ఐఏ పోలీసులు చుట్టుముట్టి అడుగడుగూ తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లో గురువారం తెల్లవారు జామున ఈ సోదాలు ప్రారంభం అయ్యాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు చేపట్టింది. హిమాయత్ నగర్‌లోని ఓ అపార్ట్మెంట్ నుంచి వీక్షణం పత్రిక నడుస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ కూడా ఆ ఇంటిలోనే ఉంటున్నారు.
వేణుగోపాల్ విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు మేనల్లుడు. ఆయన సహచరి కూడా జర్నలిస్టే. 2018లో పుణే సమీపంలో భీమా కోరేగావ్‌లో హింస ప్రేరేపించినందుకు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో గతంలో వరవరరావు అరెస్ట్ అయ్యారు. మావోయిస్టులతో వేణుగోపాల్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయన ఇంటిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఎల్బీనగర్‌లో ఉంటున్న మరో విరసం సానుభూతిపరుడు రవి శర్మ ఇంటిని కూడా తనిఖీ చేశారు. ఎన్ఐఎ ఇటీవలి కాలంలో విరసం, మావోయిస్టుల నేతల, సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు చేపట్టింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంటున్న విరసం నేత కల్యాణరావు సహా పలువురి ఇళ్లల్లో ఆమధ్య ఎన్ఐఎ పోలీసులు వరుస సోదాలు నిర్వహించారు.
ఎవరీ వేణుగోపాల్...
ఎన్ వేణుగోపాల్ తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పాత్రికేయుడు. ప్రస్తుతం వీక్షణం, పొలిటికల్ ఎకానమీ అండ్ సొసైటీ తెలుగు మాసపత్రికకు సంపాదకులుగా ఉన్నారు. వరంగల్ జిల్లా మర్కాజీకి చెందిన వేణు గోపాల్ విద్యాభ్యాసం అంతా వరంగల్, హనుమకొండలో సాగింది. విద్యార్థి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. అనేక సామాజిక అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్నది ప్రభుత్వ ఆరోపణ. విద్యార్థి ఉద్యమం నుంచే వామపక్ష భావాలవైపు నడిచిన వేణుగోపాల్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నక్సలైట్ సానుభూతిపరులతో సంబంధాలున్నాయనేది పోలీసుల ఆరోపణ. ఆయన ఇప్పటికే అనేక సార్లు జైలుకు వెళ్లివచ్చారు.
వేణుగోపాల్ ఇంటిపై దాడిని ఖండించిన ప్రజాసంఘాలు..
జర్నలిస్టు, కవి, విప్లవ రచయిత ఎన్.వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలను పలు ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లోకి చొరబడి సోదాలు చేయడం అన్యాయం, చట్టవిరుద్ధమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) నేతలు మామిడి సోమయ్య, జి.ఆంజనేయులు ఖండించారు. వేణు ఇంట్లో సోదాలు అక్రమం అంటూ పలు ప్రజాసంఘాలు కూడా ఖండించాయి.

