జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటర్ల తుది జాబితా ఇదే..
x

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటర్ల తుది జాబితా ఇదే..

యువ ఓటర్లు అంటే 18-19 సంవత్సరాల వయసు వారు 6,106 మంది ఉన్నారు.


జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా బిజీ బిజీగా వ్యూహ రచన, వాటి అమలును చేపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో తమ బలం పెంచుకునేలా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నియోజకవర్గంలో మొత్తం 3,99,000 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. జూలై 1, 2025 నాటికి 18ఏళ్లు నిండిన వారు ఓటు వేయడానికి అర్హులుగా సవరించిన జాబితాలో 2,07,382 మంది పరుషులు, 1,91,593 మంది మహిళలు ఉన్నారు. అదే విధంగా 25 మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు. లింగ నిష్పత్తి చూసుకుంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు 924 మంది మహిళలు ఉన్నారు.

ఓటర్ల జాబితాలో యువ ఓటర్లు అంటే 18-19 సంవత్సరాల వయసు వారు 6,106 మంది, 80ఏళ్లు పైబడిన వారు 2,613 మంది ఉన్నారు. వికలాంగులు 1,891 మంది ఉన్నారు. వారిలో 519 మంది చూపు కోల్పోయిన వారుగా అధికారులు వెల్లడించారు. 667 మంది కదలికల లోపం ఉన్నవారు కాగా 311 మంది వినికిడి లేదా మాట లోపం ఉన్న వారు. మిగిలిన 722 మంది ఇతర కేటగిరీలకు చెందిన వారుగా అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలో విదేశీ ఓటర్లు మొత్తం 95 మంది ఉన్నారు. నియోజకవర్గంలో ఉపఎన్నికను 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లలో నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 2న ప్రాథమిక ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. దాని ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,92,669 మంది ఉన్నారు. సవరణల తర్వాత కొత్తగా 6,976 మంది చేరగా, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కూడా కలుపుకుంటే వీరి సంఖ్య 3,99,000గా ఉంది.

Read More
Next Story