
చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్
ఇద్దరు కేంద్ర కమిటీ నాయకులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు చనిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యానారాయణ రెడ్డి చనిపోయిన వారిలో ఉన్నారు. ఘటనా స్థలిలో ఏకే 47, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు.
మహరాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు భధ్రతా బలగాలకు సమాచారమందింది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకోగానే మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు
సుందర్ రాజ్ తెలిపారు.
249 మంది చనిపోయారు
చత్తీస్ గడ్ లో ఈ సంవత్సరం జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 249 మంది మావోయిస్టులు నేలకొరిగారు. వీరిలో 220 మంది బస్తర్ డివిజన్ లోనే మృతి చెందినట్టు భధ్రతా బలగాలు పేర్కొన్నాయి.
సెప్టెంబర్ 11న జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు మోడెం బాలకృష్ణతో బాటు పదిమంది గరియాబంద్ జిల్లాలో చనిపోయారు.
ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు పెరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు చెబుతున్నారు. మావోయిస్టులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని వారు కోరుతున్నారు. జన జీవన స్రవంతిలోకి కలిసిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువైందని తెలుస్తోంది. మరో వైపు వివిధ ఎన్ కౌంటర్లలో వందలాదిమంది చనిపోవడంతో మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది.
ఇటీవల వరుసగా మావోయిస్టు పార్టీ లేఖలు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఏది నిజమో ఏది అబద్దమో తెలియడం లేదు.