ఖర్చంతా మార్గదర్శే భరించాలి
x
T high court and Margadarsi

ఖర్చంతా మార్గదర్శే భరించాలి

చందాదారులందరికీ యాజమాన్యం డిపాజిట్లు తిరిగి చెల్లించిందా ? లేదా ? అన్న విషయం తెలుసుకోవాలని హైకోర్టు అనుకున్నది.


మొత్తం ఖర్చంతా మార్గదర్శే భరించాలని హైకోర్టు తేల్చిచెప్పింది. చందాదారులందరికీ యాజమాన్యం డిపాజిట్లు తిరిగి చెల్లించిందా ? లేదా ? అన్న విషయం తెలుసుకోవాలని హైకోర్టు అనుకున్నది. మరి దీనికి మార్గం ఏమిటి ? ఏమిటంటే చందాదారుల జాబితాలను ప్రకటించటమే. తమ డిపాజిట్ దారులు ఎంతమంది ? తాము చెల్లించిన డిపాజిట్ల వివరాలను చందాదారుల వివరాలతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వటమే. చందాదారుల వివరాలు, చెల్లించిన డిపాజిట్ల వివరాలను పత్రికల్లో ప్రకటిస్తే దాన్నిబట్టి చందాదారులు స్పందిస్తారని హైకోర్టు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం తేల్చిచెప్పింది. మార్గదర్శి చందాదారుల వివరాలు ఓపెన్ కావాలన్నా, డిపాజిట్లను పూర్తిగా చెల్లించింది లేనిది తెలుసుకోవాలంటే అన్నీ వివరాలను పూర్తిగా బహిర్గతం చేయటం ఒకటే మార్గమని ఇద్దరు జస్టిసులు అభప్రాయపడ్డారు.

ఇదే సమయంలో మరో కీలకమైన ఆదేశాలను కూడా జారీచేశారు. అదేమిటంటే మార్గదర్శి చందాదారులు, డిపాజిట్ల వివరాలను మూడు దినపత్రికల్లో ప్రకటనల రూపంలో ప్రచురించాలన్నారు. పైగా మూడు దినపత్రికల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల ఖర్చంతా మార్గదర్శి యాజమాన్యమే భరించాలని స్పష్టంగా చెప్పారు. చందాదారులు, డిపాజిట్ల వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లీషు దినపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రచురించాలని ధర్మాసనం చెప్పింది. అడ్వర్టైజ్మెంట్లు ప్రచురణైన వారంలోగా రిజిస్ట్రీ బిల్లులను మార్గదర్శి యాజమాన్యానికి అందించాలని, బిల్లులు అందిన వారంరోజుల్లోగా యాజమాన్యం మొత్తం బిల్లులను చెల్లించాలని ఇద్దరు జడ్జీలు ఆదేశించారు. తర్వాత విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.

వివాదం ఏమిటి ?

చట్ట వ్యతిరేకంగా రామోజీరావు మార్గదర్శి ద్వారా చందాదారుల నుండి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ కోర్టులో కేసు వేశారు. 2006లో అరుణ్ కుమార్ వేసిన కేసు ఇంకా జీడిపాకం లాగ సాగుతున్నది. ఇప్పటికే ఒకసారి మార్గదర్శి అన్నీ చట్టాలను తుంగలో తొక్కినట్లు నిర్ధారణైంది. అయినా చట్టంలోని ఏవో లొసుగులను పట్టుకుని రామోజీ కేసు ఫైనల్ కాకుండా ఏదో రూపంలో ఏదో కోర్టులో శక్తివంతన లేకుండా లాగుతునే ఉన్నారు. ఈమధ్యనే రామోజీ చనిపోయారు కాబట్టి ఆ బాధ్యత ఇపుడు వారసుల మీదపడింది. డిపాజిట్ దారుల వివరాలను బహిర్గతం చేయాలని ఉండవల్లి ఎంతగా పోరాటం చేసినా ఉపయోగంలేకపోయింది.

అయితే చందాదారుల వివరాలు బహిర్గతం చేయాల్సిందే అని హైకోర్టు ధర్మాసనం కూడా అభిప్రాయపడటంతో మార్గదర్శి యాజమాన్యానికి వేరేదారిలేకపోయింది. ఇందులో భాగంగానే మూడు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు, ఖర్చంతా మార్గదర్శే భరించాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. చందాదారుల వివరాలు తనకు అందించాలన్న ఉండవల్లి వాదనతో సుప్రింకోర్టు ఏకీభవించింది. ఇదే సమయంలో కేసులో అందరి వాదనలు పూర్తిగా విని సరైన నిర్ణయం తీసుకోమని సుప్రింకోర్టు తెలంగాణా హైకోర్టును ఆదేశించింది. పైగా ఆరుమాసాల్లో కేసును తేల్చేయాలని కూడా చెప్పింది. దాంతో డిపాజిట్ దారుల వివరాలను బహిర్గతం చేయాల్సిందే అని హైకోర్టు మార్గదర్శి యాజమాన్యాన్ని ఆదేశించింది. పనిలోపనిగా ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలను అందించాలని కూడా చెప్పింది. డిపాజిట్ దారుల వివరాలు కోరుతు అఫిడవిట్ దాఖలుచేస్తే రిజిస్ట్రీయే అందిస్తుందని ఉండవల్లికి కోర్టు చెప్పింది. అక్టోబర్ 1వ తేదీ విచారణ సమయంలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన మూడు దినపత్రికలను తమ ముందుంచాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. కాబట్టి డిపాజిట్ దారుల వివరాలు ఈనెలాఖరులోగా ప్రకటనల రూపంలో బహిర్గతమయ్యే అవకాశముంది.

Read More
Next Story