‘నన్ను ఓడించడానికి కుట్రలు జరిగాయ్’
x

‘నన్ను ఓడించడానికి కుట్రలు జరిగాయ్’

రాజకీయాల్లో కొందరు అబద్ధాల పునాదులపై బతుకుతున్నారు. నిజాయతీగా పార్టీ కోసం కష్టపడటం తప్ప నాకు మరోకటి తెల్వదు.


బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రావడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వీడటానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. తాను పదవుల కోసం పార్టీలు మారలేదని, 2021 నుంచి ఆ పార్టీలో నరకం చూశానని అన్నారు. తనను పార్టీ నుంచి అనేక కుట్రలు చేసి మరీ వెళ్లగొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం హుజూరాబాద్ గురించి మాట్లాడుతూ.. ఈ నేల త్యాగాలకు నెలవన్నారు. ఎన్నో పోరాలు ఈ నేలపై పురుడు పోసుకున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఈటల.. కేసీఆర్, రేవంత్ ఇద్దరిపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. కుట్రలు చేయడంలో కేసీఆర్‌కు రేవంత్ ఏమాత్రం తీసిపోరని చురకలంటించారు. ప్రజలను మోసం చేయడమే ఈ ఇద్దరి నేతల లక్ష్యమని, ఆ దిశగానే వారు పాలన ఉందని దుయ్యబట్టారు. ‘‘గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆయనకు నా నిర్ణయాలను మొహమాటం లేకుండా చెప్పాను. గతంలో జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేశా. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నా ఓటమికి ఎంతోమంది కలిసి కుట్రలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నేను పోరాటు చేస్తే నాకు కరీంనగర్ ప్రజలు అండగా నిలిచారు’’అని చెప్పుకొచ్చారు.

నాకెవరి దయ అక్కర్లేదు

‘‘క్యాడర్‌కు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. నా చరిత్ర ఏంటో వారికి బాగా తెలుసు. వారికి నా గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.ధీరుడు ఎప్పుడూ వెనుదిరగడు. ఎంత వరకు ఓపిక పట్టాలో నాకు బాగా తెలుసు. వ్యక్తులు ఎదగకుండా బలపడిన పార్టీ ఇప్పటి వరకు ఏదీ లేదు. పార్టీ అనేది అందులోనే వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుంది.కార్యకర్తల ఆవేదన అర్థమైంది. వారి రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. పదవులే పరమావధిగా భావించేవాడిని కాదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేస్తా. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. రాజకీయాల్లోనే కాదు.. అన్నింట్లోనో కోవర్టులు ఉంటారు. వారి గురించి ఆలోచించొద్దు. హుజూరాబాద్‌ వస్తా.. మీ వెంటే ఉంటా.. స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకుంటా. కార్యకర్తలు కుంగిపోవద్దు’’అని ఈటల అన్నారు.

అవమానాలు, అవహేళనలు సహజం..

‘‘రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు సహజం. వాటిని తట్టుకున్నాం. నాకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ తెల్వదు. రాదు. కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేసుడు నా స్టైల్ కాదు. నాకది రాదు కూడా. పైకి ఒక మాట.. లోపల మరోమాట నాకు తెల్వదు. శత్రువుతో నేరుగా కోట్లాడతా. స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చరిత్ర నాది. నాపై గతంలో కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల్లో కొందరు అబద్ధాల పునాదులపై బతుకుతున్నారు. నిజాయతీగా పార్టీ కోసం కష్టపడటం తప్ప నాకు మరోకటి తెల్వదు’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంతేకాకుండా కాలం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరికీ అదే బదులిస్తుందని అన్నారు.

Read More
Next Story