
ఎంపీ ఈటెల రాజేందర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ?
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కేంద్ర బీజేపీ అధిష్ఠానవర్గం నియమించనున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందిన సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కేంద్ర బీజేపీ అధిష్ఠానవర్గం నియమించనున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందిన సమాచారం. బీసీ వర్గానికి అందులోనూ తెలంగాణలో ప్రభావవంతమైన ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటెలకు కాషాయ పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేలా చేయాలని బీజేపీ అధిష్ఠాన వర్గం యోచిస్తోంది. గత కొన్ని రోజులుగా బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ భన్సల్ కాషాయ పార్టీ నేతలతో చర్చలు జరిపిన తర్వాత బీజేపీ పగ్గాలు ఈటెలకు అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబతుున్నారు.
గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేసినప్పుడు పార్టీకి ఊపు తీసుకువచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ 8 ఎంపీ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దీంతోపాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో కమలనాథులు విజయం సాధించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జి కిషన్ నెడ్డి కేంద్రమంత్రి పదవి వల్ల తగిన సమయం ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసేలా కొత్త నాయకుడిని నియమించాలని నిర్ణయించారు. మరో వైపు బీజేపీ అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చినా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆ పదవి తీసుకునేందుకు నిరాసక్తత చూపించారని కమలనాథులు చెబుతున్నారు.
ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తెలంగాణలో బీజేపీ పటిష్ఠానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈటెల ప్రధానితో చర్చించారని చెబుతున్నారు. మరో వైపు ఆదివారం హైదరాబాద్ లో ఉన్న కేంద్ర మంత్రి, ప్రస్థుత బీజేపీ రాస్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకొని హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. మరో వైపు ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం ఉదయం ఢిల్లీకి ప్రయాణం కానున్నట్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయని ఓ బీజేపీ నాయకుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితుడిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రాజేందర్ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు అప్పజెపితే తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తారని ఢిల్లీకి చెందిన కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం.
Next Story