Harish Rao | రేవంత్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందా..?
ఢిల్లీలో అదానీతో దోస్తీ చేస్తూ గల్లీలో మాత్రం కుస్తీ చేస్తున్నట్లు రేవంత్ కలరింగ్ ఇస్తున్నారంటూ హరీష్ రావు చురకలంటించారు.
అదానీ(Adhani), మోదీ(Modi) వ్యవహారంపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సహా కాంగ్రెస్(Congress) నేతలు రాజ్‌భవన్ దగ్గర నిర్వహించిన ధర్నాపై హరీష్ రావు(Harish Rao) ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదానీ అవినీతి అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని, మణీపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ రెండిటికీ అధికారపక్షం నో చెప్పడంతో వీటిపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్.. తన శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ వరకు ‘చలో రాజ్‌భవన్’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించింది. దీనిపై అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర హరీస్ రావు స్పందించారు. ఢిల్లీలో అదానీతో దోస్తీ చేస్తూ గల్లీలో మాత్రం కుస్తీ చేస్తున్నట్లు రేవంత్ కలరింగ్ ఇస్తున్నారని, ఈయన తీరు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని విమర్శలు గుప్పించారు.
అక్కడ బీఆర్ఎస్ నామస్మరణే
‘‘మొదటి రోజు శాసనసభకు ఆదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద నిరసనగా టీషర్ట్స్ వేసుకొని వస్తే అడ్డుకున్నారు. ఇద్దరి దోస్తీకి కట్టుబడి సభ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఈరోజు రాజ్ భవన్ వద్ద ఆదానీ అవినీతి గురించి మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి సర్కస్ చేసిండు. అక్కడికి వెళ్లి కూడా కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించే మాట్లాడిండు తప్ప, ఆదానీ అవినీతి గురించి మాట్లాడింది తక్కువ. మీ పోరాటం ఆదాని మీద అయితే మొదటి రోజు మమ్మల్ని ఎందుకు అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. నిరసన తెలిపే అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదు.
మేము అడుగుతున్నా ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టడం లేదు’’ అని ప్రశ్నించారు.
రూ.12,400 కోట్ల పరిస్థితి ఏంటి..
‘‘దావోస్ వెళ్లి ఆదానీతో రూ.12,400 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నావు. నీకు నిజంగా ఆదానీ అవినీతి మీద పోరాటం చేయాలనుకుంటే ముందు వెంటనే అగ్రిమెంట్లు రద్దు చెయ్యి. అదానీ గ్రీన్‌తో రూ.5వేల కోట్ల కాంట్రాక్టు, వంద మెగావాట్ల డాటా సెంటర్‌కు రూ.5వేల కోట్లకు, రూ.1400 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ, అదానీ డిఫెన్స్ ఫేస్ కోసం రూ.వెయ్యి కోట్లతో అగ్రిమెంట్ చేసుకున్నావు. మొత్తంగా రూ.12,400 కోట్ల అగ్రిమెంట్ చేశారు. నీ మాటల్లో నిజాయితీ ఉంటే, వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు రూ.12,400 రద్దు చేసుకోవాలి. అగ్రిమెంట్లు రద్దు చేసి నీ చిత్తుశుద్దిని నిరూపించుకో రేవంత్ రెడ్డి’’ అని సవాల్ చేశారు.
అందరి పరువు తీశావు కదా రేవంత్
‘‘నేతి బీర కాయలో నీతి ఎంతనో, నీ పోరాటంలో నిజాయితీ అంతే. రామన్నపేటలో డ్రైపోర్టు కోసం ల్యాండ్ ఇస్తే సిమెంట్ ఫ్యాక్టీరికి అనుమతి ఇచ్చావు. ఆదానీ కోసం పోలీసులను పెట్టి అరెస్టులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలీసు పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ చేశావు. ఆదానీకి ఏజెంట్‌గా కొమ్ముకాస్తున్నావు. ప్రజల కోరిక మేరకు సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్, సర్కస్ ఫీట్లు తప్ప ఇంకేం లేదు. మీ డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనం మీ చిత్తశుద్ది లేని పోరాటం. ఆదానీ.. దేశ పరువు తీసిండు అని రేవంత్ రాజ్ భవన్ వద్ద అన్నాడు. మరి నువ్వు దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ పరువు తీశావు. ఆదానీకి రెడ్ కార్పెట్ వేశావు రాష్ట్ర పరువు తీశావు. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పరువును తీశావు. ఆదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద రేపు అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నీకు ఆ ధైర్యమే లేదు. అంతర్గతంగా ఒప్పందం మీకు ఉంది. సీఎం రాజ్ భవన్ వద్ద ట్రాఫిక్ జాం చేసిండు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ధర్నాలో పాల్గొన్న అందరి మీద కేసులు పెట్టాలి. ధైర్యం ఉంటే, చట్టం అందరికి సమానం అయితే వారి మీద కేసులు పెట్టండి’’ అని కోరారు.