
‘ఆయిల్ పామ్ రైతులకు ప్రత్యేక గ్యారెంటీ’
రైతులకు లాభాలను తెచ్చిపెట్టే అద్భుతమైన పంట ఆయిల్ పామ్ అన్న మంత్రి సీతక్క.
ఆయిల్ పామ్ సాగుతో రైతులు అద్భుత లాభాలను పొందుతారని మంత్రి సీతక్క చెప్పారు. ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని ఆమె కోరారు. రైతాంగాన్ని లాభాల బాట పట్టించే పంట ఆయిల్ పామ్ అని అన్నారు. 10 ఎకరాల పొలం ఉన్న రైతులు ఐదు ఎకరాల్లో ఈ పంట వేయాలని సూచించారు. ఈ పంటకు ఉన్న గ్యారెంటీ మరే పంటలకు లేదని వివరించారు. ములుగు జిల్లా మంజీరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయిల్ పామ్ పంట ప్రయోజాలను మంత్రి సీతక్క వివరించారు. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని, ఒక్కో మొక్కను సబ్సిడీతో రూ.25కే అందిస్తున్నామని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం. రైతులకు దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చిన తొలి రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్ర. అలాగే దేశంలోనే మొదటి సారి రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారే’’ అని చెప్పారు.
‘‘మహిళలకు వడ్డీలేని రుణాలు. యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నాం. దేశవ్యాప్తంగా నిర్భయ పథకం కింద ఎంపికైన 10 జిల్లాల్లో ములుగు కూడా ఒకటి. త్వరలోనే జిల్లాకు ఐటీ సంస్థ వస్తుంది. ఈ నెల 18న ఈ సంస్థకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేస్తారు’’ అని చెప్పారు.