కుటుంబ సర్వేపై చర్చ.. ఆ బాధ్యత వారిదేనన్న మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. తాజాగా ఈ సర్వేపై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఇంకా చాలా మంది తమ సమాచారం ఇవ్వాల్సి ఉన్నట్లు గుర్తించడంతో ఈ అంశంపై ఈరోజు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సర్వే ఎలా సాగుతుంది, ఎంత వరకు పూర్తయింది వంటి అంశాలపై చర్చించారు. సమగ్ర ఇంటింటి సర్వేలో ఇంకా ఎవరైనా సమాచారం ఇవ్వని వారు ఉంటే వారి నుంచి సమాచారం సేకరించేలా కుల సంఘాలు చొరవ తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతంలో సమాజాన్ని ప్రభావితం చేసే రాజకీయ నాయకులు , అధికారులు , వ్యాపారస్తులు వివిధ రంగాల వారు ఇంకా సమాచారాన్ని ఇవ్వని వారు ఉంటే సమాచారాన్ని ఇవ్వాలని ఈ సమావేశంలో చర్చించారు. కులాల వారిగా సంఖ్య లేనిపక్షంలో వారికి పథకాలు అందవని చెప్పారు.
‘‘ఇంటింటి కుటుంబ కుల సర్వే లో పల్లె ప్రాంతాల్లో ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములై సమాచారాన్ని ఇచ్చారు. పట్టణ ప్రాంతంలో ఇప్పటి వరకు కుల సర్వేలో సమాచారాన్ని ఇవ్వలేదో ఈ సమాచారం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా అన్ని కులాలకు సంబంధించిన వారికి ప్రభుత్వ పథకాలు న్యాయబద్ధంగా అందాలంటే పూర్తి సమాచారం ఉండాలి. కాబట్టి మీ ఇంటికి సమాచార సేకరణ అధికారి రాకపోయి ఉంటే వారిని పిలుచుకొని సమాచారాన్ని ఇవ్వాలి. దీనిని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి’’ అని సూచించారు.
‘‘ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకత్వం వహించే ప్రజా ప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్‌లు సమాజాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వారు సర్వేలో భాగస్వాములు కావాలి. గతంలో అనేక సందర్భాల్లో కుల సర్వేపై డిమాండ్ చేసిన కుల సంఘాలు దళిత, గిరిజన, బీసీ సంఘాలు అన్ని కూడా ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని సమాజంలో భాగస్వామ్యులయ్యే సంచార జాతులు, అన్ని వర్గాల వారు సమాచారం ఇచ్చే విధంగా భాగస్వాములు కావాలి’’ అని తెలిపారు.
‘‘ప్రభుత్వం కూడా సమాచార సేకరణ ద్వారానే నూతన పథకాలు ఇవ్వాలనుకుంటుంది. వారికి సమాచారం లేకపోతే భవిష్యత్ లో పథకాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కుటుంబ సర్వేలో చురుగ్గా పాల్గొనాలి. కుల సర్వే లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని తెలిపారు.