గొర్రెల స్కాంలో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ అరెస్ట్
వరుస విచారణలతో దూకుడు పెంచిన ఏసీబీ, గొర్రెల స్కాం దర్యాప్తులోనూ వేగం పెంచింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో శుక్రవారం ఇద్దరు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది.
వరుస విచారణలతో దూకుడు పెంచిన ఏసీబీ.. గొర్రెల స్కాం దర్యాప్తులోనూ వేగం పెంచింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో శుక్రవారం ఇద్దరు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్, గొర్రెల మేకల అభివృద్ధి సమాఖ్య ఎండి రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ లను అరెస్ట్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
నిందితులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి రూ.2.1 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో ఏసీబీ అధికారులు ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు.
ఫిబ్రవరి 2021-డిసెంబర్ 2023 మధ్యలో రామచందర్ నాయక్ ఎండిగా ఉన్న కాలంలో అక్రమాలు జరిగినట్టు విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్రోకర్లకు రామచందర్ వంతపాడారని అభియోగాలున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వానికి తెలియకుండా రామచందర్ గైడ్ లెన్స్ మార్చారు.
అంతేకాదు, రామ్ చందర్ తన కింది స్థాయి అధికారులను ప్రైవేట్ వ్యక్తులకు సహకరించాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించేందుకు రామచందర్ కి కళ్యాణ్ కుమార్ సహకరించారు. వీరిద్దరిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇద్దరి నిందితులను ఏసీబీ న్యాయమూర్తి ముందు ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నారు.
కాగా, తలసాని ప్రస్తుతం సనత్‌నగర్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి పాత్రపై ఏసీబీ ఏమీ చెప్పలేదు. ఇంతకుముందు వచ్చిన ఆరోపణలను తలసాని ఖండించారు. గొర్రెల పంపిణీలో ఎటువంటి స్కామ్ లేదని చెప్పారు.