
ప్యాన్ ఇండియా స్టార్ అవబోతున్న జగ్గారెడ్డి
కాంగ్రెస్(Congress) సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి(Jagga Reddy) ఓ సినిమాలో పూర్తిస్ధాయి క్యారెక్టర్లో నటించబోతున్నారు
రాజకీయాల్లో నేతలు ఈపార్టీ నుండి ఈ పార్టీకి ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి దూకటం చాలా సహజం. దీనికి ఫిరాయింపు రాజకీయాలే తాజా ఉదాహరణ. అలాగే సినిమాల్లో బాగా పాపులారిటి సంపాదించిన కొందరు రిటైర్ అయ్యే సమయానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం చాలామందికి తెలిసిందే. ఇందుకు ఎంజీఆర్(MGR), ఎన్టీఆర్(NTR), జయలలిత(Jayalalitha) పెద్ద ఉదాహరణలు. అయితే రాజకీయాల్లో బాగా బిజీ ఉంటూ సినిమాల్లోకి దూకిన నేతలు చాలా అరుదు. సినిమాల్లో కనిపించాలనే ఉత్సాహంతో చాలాకొద్దిమంది నేతలు తమ ఉబాలటం కొద్ది ఒకటి, రెండు సన్నివేశాల్లో కనిపించారు. ఇందుకు ఉదాహరణ కేంద్రమాజీ మంత్రి, గవర్నర్ గా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు(Ch Vidyasagar Rao). ఇపుడిదంతా ఎందుకంటే కాంగ్రెస్(Congress) సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి(Jagga Reddy) ఓ సినిమాలో పూర్తిస్ధాయి క్యారెక్టర్లో నటించబోతున్నారు. జగ్గారెడ్డి అనే పేరుతోనే తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ట్యాగ్ లైన్ ‘ఏ వార్ ఆఫ్ లవ్’ అని.
పూర్తిస్ధాయి ప్యాన్ ఇండియా సినిమా(Pan India Cinema)లో నటించబోతున్న పొలిటికల్ స్టార్ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి9Revanth), పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) అనుమతి కూడా తీసుకున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రెడీ అవబోతోంది. సినిమా మొత్తం ప్రేమకథ చుట్టూనే తిరుగబోతోందన్న విషయం ట్యాగ్ లైన్ తోనే అర్ధమవుతోంది. బహుశా కులాంతర లేదా మతాంతర ప్రేమ వివాహం ఇతివృత్తం నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోందేమో. ఎందుకంటే ఇపుడు కులాంతర లేదా మతాంతర ప్రేమ వివాహాలే హాట్ టాపిక్ కాబట్టి. నిజానికి ప్రేమ ఇతివృత్తంగా ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చుంటాయి. అయితే ప్రేమ అన్నది నిత్యనూతనం కాబట్టి ఇదే ఇతివృత్తంతో కాస్త కొత్తదనాన్ని చూపిస్తే చాలు ఆ సినిమా పెద్ద హిట్ అయిపోతోంది. దేశవ్యాప్తంగా ప్రేమలు, పెళ్ళిళ్ళ సబ్జెక్టు ఎప్పుడూ వివాదాస్పదం అవుతునే ఉంది.
తాజాగా నల్గొండలో ప్రేమించి పెళ్ళిచేసుకున్న కూతురు భర్తను(అల్లుడు) అమ్మాయి తండ్రే హత్యచేయించటం ఆమధ్య తెలుగురాష్ట్రాల్లో పెద్ద సంచలనమైపోయింది. ఆ ఘటన తాలూకు కేసులో కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు మళ్ళీ సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనాలుగా మారిన ప్రేమలు, పెళ్ళిళ్ళు, వివాదాలు చాలానే ఉన్నాయి. అందుకనే సినిమా మేకర్స్ కూడా ప్రేమకథ, వివాహాన్నే ఇతివృత్తంగా తీసుకున్నట్లున్నారు. అందులో జగ్గారెడ్డిది బాగా పవర్ ఫుల్ క్యారెక్టర్. సినిమా ఇంట్రవెల్ కు ముందు ఎంట్రీఇచ్చి శుభంకార్డు పడేవరకు ఉండే పూర్తిస్ధాయి నిడివి ఉన్న క్యారెక్టర్లో జగ్గారెడ్డి నటిస్తున్నారు. రాబోయే ఉగాది పండుగ సందర్భంగా షూటింగ్ మొదలవ్వబోతున్న సినిమా 2026 ఉగాది పండుగకు పూర్తి అవుతుంది. సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను మేకర్స్ విడుదలచేశారు. ఈ వర్కింగ్ స్టిల్స్ లో జగ్గారెడ్డి క్యారెక్టర్ ఉగ్రరూపం కనబడుతోంది. ఈ వర్కింగ్ స్టిల్స్ జగ్గారెడ్డి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా కథేమిటో మేకర్స్ చెప్పలేదుకాని బహుశా కులాంతర లేదా మతాంతర ప్రేమజంటకు అండగా నిలబడి ఇద్దరికీ వివాహం చేసే క్యారెక్టర్లో జగ్గారెడ్డి నటించబోతున్నారని అర్ధమవుతోంది. నిజజీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్లో తననే నటించమని సినిమా మేకర్స్ పట్టుబట్టడంతో కాదనలేక సినిమాకు ఒప్పుకున్నట్లు జగ్గారెడ్డే చెప్పారు.
జగ్గారెడ్డి నేపధ్యం
టీఆర్ఎస్ పార్టీ తరపున 2004లో మొదటిసారి సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీచేసిన జగ్గారెడ్డి గెలిచారు. తర్వాత కొంతకాలానికే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగ్గన్న మళ్ళీ 2018 ఎన్నికల్లో గెలిచారు. 2023 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోయారు. గెలుపు, ఓటములతో సంబంధంలేకుండా జగ్గారెడ్డి అంటే నియోజకవర్గంలో బాగా ఫాలోయింగ్ ఉన్న నేతనే చెప్పాలి. వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ప్రకటనలతో జగ్గారెడ్డి ఎప్పుడూ రాజకీయాల్లో కేంద్రబిందువుగానే ఉంటారు. రాజకీయాల్లో సంచలనంగా ఉండే జగ్గారెడ్డి మరి సినిమా క్యారెక్టర్లో ఎలాగుంటారో చూడాలని ఆయన అభిమానులు తెగ ఆరాటపడిపోతున్నారు. సినిమాలో కూడా సక్సెస్ అవ్వాలని జగ్గారెడ్డికి మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదామా ?