ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రభాకర్ రావు లేఖ
x

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రభాకర్ రావు లేఖ

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అమెరికాలో ఉన్న తాను ఆరోగ్య సమస్యల కారణంగా భారతదేశానికి తిరిగి రావడాన్ని వాయిదా వేయవలసి వచ్చిందని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ (IO)కి తెలియజేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే భారతదేశానికి తిరిగి వస్తానని, వ్యక్తిగతంగా అన్ని సందేహాలకు సమాధానం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు జూన్ 23 న ఆయన జూబిలీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. కాగా, ఈ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

"జూన్ 26 నాటికి నేను ఇండియాకి తిరిగి రావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఉండిపోవాల్సి వచ్చింది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పడుతున్నాను. అమెరికా వైద్యుల సూచనలతో ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నేను ఎక్కడికీ పారిపోలేదు. మార్చి 22, 23 తేదీల్లో వాట్సాప్ కాల్ ద్వారా నేను మీకు ఈ విషయాన్ని తెలిపాను. నేను భారతదేశానికి తిరిగి వచ్చే వరకు వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ లో దర్యాప్తుకి సహకరిస్తాను" అని జూన్ 23 నాటి లేఖలో ప్రభాకర్ రావు పేర్కొన్నారు. అంతేకాదు, చట్ట నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన లేఖ ద్వారా కోరారు.

తనపై అసత్య ఆరోపణలు చేస్తూ... మీడియాకి లీకులిస్తున్నారని, ఈ దుష్ప్రచారాలు తనని, తన కుటుంబ సభ్యుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఇవి తన శారీరక, మానసిక ఆరోగ్యం మరింత క్షీణించేలా చేశాయన్నారు. తనకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్ తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని ప్రభాకరరావు లేఖలో రాశారు. ఓ పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. చట్టపరంగా విచారణ జపించాలని కోరారు. ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పోలీసుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని లేఖలో తెలియజేశారు.

కాగా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనధికారికంగా రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ కి సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుపైనా ఇప్పటికే నాన్ బెయిలబుల్ పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది.

Read More
Next Story