కోయకుండానే నీళ్ళు తెప్పిస్తున్న ఉల్లిఘాటు
x
Onions

కోయకుండానే నీళ్ళు తెప్పిస్తున్న ఉల్లిఘాటు

ఇపుడు ఉల్లిపాయలను కోయకుండానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ధరలు వింటే చాలు కన్నీళ్ళొచ్చినంత పనవుతోంది.


మామూలుగా ఎవరికైనా ఉల్లిపాయలు కోసేటపుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ ఇపుడు ఉల్లిపాయలను కోయకుండానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ధరలు వింటే చాలు కన్నీళ్ళొచ్చినంత పనవుతోంది. విషయం ఏమిటంటే బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల కిలోధర రు. 100 పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్లలోనే చిన్న ఉల్లిపాయల ధరలు కిలో 50 రూపాయలు, పెద్ద ఉల్లిపాయల ధర కిలోకి రు. 70-80 మధ్యలో ఉంది. అందుకనే మార్కెట్లో పెద్ద ఉల్లిపాయల ధర కిలోకి రు. 100 పలుకుతోంది. మామూలుగా జనాలకు ఉల్లిపాయలు లేనిదే వంటలు సాద్యంకాదు. అసలు ఉల్లిపాయలు లేని వంటలను మనం ఏమాత్రం ఊహించలేము.

చాలా టిఫిన్లు, చాలా వంటల్లో ఉల్లిపాయలు లేకుండా రుచిరాదు. అందుకనే చాలా వంటల్లో ఉల్లిపాయలు వాడకం మనకు మస్ట్. అలాంటి ఉల్లిపాయలను ఇపుడు 100 రూపాయలు పెట్టి కొనాలంటే కళ్ళల్లో నీళ్ళు కాక మరేమొస్తుంది ? అందుకనే ఉల్లిపాయలను కోసేటపుడే కాదు ఇపుడు కోయకుండానే కనీళ్ళు వస్తున్నాయని అంటున్నది. తెలంగాణాకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కూరగాయల హోల్ సేల్ మార్కెట్లకు కర్నూలు, మహారాష్ట్రలోని షోలాపూర్ నుండి ప్రతిరోజు ఉల్లిపాయలు దిగుమవుతాయి. ఎంత తక్కువ వేసుకున్నా రోజుకు 50 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి.

ఈ ఉల్లిపాయలన్నీ నగరంలోని నాలుగు హోల్ సేల్ మార్కెట్ల నుండి రీటైల్ మార్కెట్లకు చేరుకుని అక్కడినుండి తోపుడు బండ్ల వ్యపారాస్తుల ద్వారా వినియోగదారులకు చేరుతుంటాయి. అలాంటిది కొద్దిరోజులుగా కర్నూలు, షోలాపూర్ నుండే ఉల్లిపాయల దిగుమతి తగ్గిపోయింది. ధరలు పెరుగుతుండటంతో మరింత ధరలు పెరిగితే లాభాలు అందుకోవచ్చని కర్నూలు, షోలాపూర్లోని వ్యాపారస్తులు ఉల్లిపాయల ఎగుమతులను నిలిపేసినట్లు తెలుస్తోంది. దాంతో హైదరాబాద్ లో ఉల్లిపాయల ధరలు పెరిగిపోతోంది. సరిగ్గా దసరా పండుగ ముందు ఉల్లి ధరలు ఆకాశానికి పెరిగిపోతుండటాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

మొన్నటి వేసవికాలంలో కిలో ఉల్లిపాయలు 20-25 రూపాయలకే దొరికిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు 100 రూపాయలు పెట్టి కొనాలంటే ఆడోళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలను, బడా వ్యాపారస్తులను శాపనార్ధాలు పెట్టుకుంటున్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో అయితే ఉల్లిపాయలకు బదులు కీరకాయలు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితిని అర్ధంచేసుకుని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఉల్లిపాయల ధరలను గనుక నియంత్రించకపోతే పండుగ సమయంలో ప్రభుత్వంపై జనాలు దుమ్మెత్తిపోయటం ఖాయమనే అనిపిస్తోంది.

Read More
Next Story