Fact Check: మహిళలకు పోలీసుల ఉచిత రైడ్ సర్వీస్ లో నిజమెంత?
అర్థరాత్రి సమయంలో మహిళలకు రక్షణ కోసం పోలీసులు "ఉచిత రైడ్ సర్వీస్" పథకాన్ని ప్రారంభించారని రెండు రోజులుగా ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం ఓ పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రసరించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్థరాత్రి సమయంలో మహిళలకు రక్షణ కోసం పోలీసులు "ఉచిత రైడ్ సర్వీస్" పథకాన్ని ప్రారంభించారని రెండు రోజులుగా ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.
ఇంతకీ మెసేజ్ లో ఏముందంటే...
"రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌లను (1091) సంప్రదించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. వాహనాన్ని అభ్యర్థించవచ్చు మరియు అభ్యర్థించవచ్చు. వారు 24x7 గంటలు పని చేస్తారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని PCR వాహనం/SHO వాహనం అతన్ని సురక్షితంగా అతని గమ్యస్థానానికి తీసుకెళ్తాయి. ఇది ఉచితంగా చేయబడుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. మీ భార్య, కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు, స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ నంబర్‌ను పంపండి.. సేవ్ చేయమని వారిని అడగండి.. పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరికీ షేర్ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశం లేదా మిస్డ్ కాల్ ఇవ్వగలరు.. తద్వారా పోలీసులు మీ లొకేషన్‌ను కనుగొని మీకు సహాయం చేయగలరు. భారతదేశం అంతటా వర్తిస్తుంది." అంటూ ఓ ప్రచారం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
విపరీతంగా షేర్ చేస్తున్న నెటిజన్లు...
ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు కలవరం కలిగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మహిళల సేఫ్టీ పై ఆందోళనలు నెలకొన్నాయి. అందులోనూ రాత్రి వేళల్లో మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. "ఇలాంటి తరుణంలో రాత్రి వేళల్లో మహిళల రక్షణ కోసం పోలీసులే ఉచిత రైడ్ సర్వీస్ ప్రారంభించారు. ఒక నెంబర్ కి కాల్ చేస్తే చాలు. పోలీస్ వాహనం వచ్చి సురక్షితంగా గమ్య స్థానానికి చేరుస్తుంది" అనే మెసేజ్ లు కొండంత భరోసాగా అనిపిస్తాయి. అందుకే తమవారి సేఫ్టీ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు క్రాస్ చెక్ చేయకుండా ఈ మెసేజ్ ని షేర్ చేస్తున్నారు. నిజమే అని నమ్మి కాల్ చేస్తే ప్రమాదంలో కూడా పడే అవకాశం ఉంది. టెక్నాలజీని అక్రమదారుల్లో వినియోగించుకుంటున్న కేటుగాళ్లు కూడా ఇలాంటి ప్రచారంతో కొత్త పన్నాగాలు మొదలుపెట్టి కూడా ఉండొచ్చు. అందుకే అప్రమత్తమైన పోలీసులు ఈ ప్రచారంలో నిజం లేదు అని ప్రకటించారు.