1500 కోతుల కు.ని ఆపరేషన్లకు రూ.3 కోట్ల ఖర్చు
x
బోనులో బంధించిన కోతులు (ఫొటో క్రెడిట్ : మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ )

1500 కోతుల కు.ని ఆపరేషన్లకు రూ.3 కోట్ల ఖర్చు

తెలంగాణలో కోతుల నియంత్రణ కోసం కోట్లాదిరూపాయలు వెచ్చిస్తున్నా బెడద తీరడం లేదు.నిర్మల్‌లో మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటరు ఉన్నా కోతుల సంఖ్య పెరుగుతుంది.


తెలంగాణలో కోతుల నియంత్రణ కోసం దక్షిణాది రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారి నిర్మల్ జిల్లాలో కోతుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి (Spending Crores of Rupees) నిర్మించినా కోతుల బెడద (Monkey Menace) తీరడం లేదు. ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా’ కోతుల సంఖ్యను నియంత్రించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించినా, నాలుగేళ్లలో కేవలం 1500 కోతులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ( Family Control Operations) చేశారు.

తెలంగాణలో ఏ యేటికాఏడు పెరిగిపోతున్న కోతుల సమస్యను నియంత్రించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. తెలంగాణలో పంటలే కాకుండా గ్రామాలపై వానర మూకలు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కోతుల జనాభాను నియంత్రించేందుకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని నిర్మల్ జిల్లా చించోలి వద్ద మంకీ రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటరును నిర్మించాలని 2017-18 వ సంవత్సరంలో నిర్ణయించారు.



ఒక్క కోతిని పట్టుకుంటే రూ. 1500

ఒక్క కోతిని పట్టుకుంటే 1500రూపాయలు ఇవ్వాలి.నిధుల కొరతతో కోతులను పట్టుకునే వారు కరవయ్యారు. ఆపరేషన్ చేసిన కోతికి గుర్తుగా నుదుట టాటూ వేసి, వాటిని అడవుల్లో వదులుతున్నారు. కోతులను పట్టుకొని పునరావాస కేంద్రానికి తరలించడం పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లో కోతులను పట్టుకునేవారు కరువయ్యారు.



రూ. 2కోట్లతో మంకీ రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటరు

నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలో రూ. 2కోట్లతో నిర్మించిన మంకీ రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటరును 2020 డిసెంబరు 20వతేదీన అప్పటి రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రంలో కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు సర్జికల్ పరికరాలను సిమ్లా నుంచి రూ.36.51 లక్షల రూపాయలు వెచ్చించి కొన్నారు. చించోలిలో కోతులకు ఆపరేషన్లు చేసేందుకు ప్రీ ఆపరేటివ్ కేర్ యూనిట్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్ భవనాన్ని నిర్మించారు.ఈ భవన నిర్మాణం కోసం రూ.68.50 లక్షలను ఖర్చు చేశారు. 45 కోతుల బోన్లు, నాలుగు బాక్సులు,9 కోతుల క్యాచ్ బోన్లను ఏర్పాటు చేశారు.



కోతులకు ఆపరేషన్ ఎలా చేస్తారంటే...

గ్రామాల నుంచి పట్టుకువచ్చిన కోతులను ప్రీ ఆపరేటివ్ కేర్ యూనిట్ బోన్లలో ఉంచి వాటికి పశువైద్యాధికారి సిఫార్సు మేర ఒక్కో కోతికి ఒక అరటిపండు, 200 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, మూడు బ్రెడ్ ముక్కలు అందిస్తారు. ఆపరేషన్ చేయాల్సిన కోతులను నీళ్లతో కడిగి, శరీరంపై రోమాలను షేవ్ చేస్తారు. ఎనిమల్ హ్యాండర్లు కోతులను ఆపరేషన్ కు సిద్ధం చేసి ఆపరేషన్ థియేటరుకు తీసుకువస్తే తాను మత్తు ఇంజక్షన్ ఇచ్చి కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేస్తామని డాక్టర్ శ్రీకర్ రాజు
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.ఆపరేషన్ చేశాక మూడు రోజుల పరిశీలనలో ఉంచి కోతులను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ వివరించారు.

దక్షిణాదిలోనే ఏకైక కోతుల పునరావాస కేంద్రం
దక్షిణాదిలోనే నిర్మల్ జిల్లాలోని గండి రామన్న అర్బన్ పార్కులో మంకీ రెస్క్యూ సెంటరును అయిదేళ్ల క్రితం రూ.2 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతను అటవీ, పశుసంవర్థకశాఖ పర్యవేక్షిస్తోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకొని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేందుకు నిర్మల్ కు తీసుకురావాలి. కాని నిధుల కొరత పేరిట గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకొని రావడం లేదు. ఈ కేంద్రంలో రోజుకు 100 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే సామర్ధ్యం ఉన్నా, గ్రామాల నుంచి కోతులను తీసుకొని రాకపోవడంతో ఈ కేంద్రం ఖాళీగా ఉంటోంది.



బడ్జెట్ కేటాయింపులు ఘనం...నిధుల విడుదల అంతంత మాత్రం

రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటరులో కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు ఏటా రూ.50లక్షల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నా, నిధుల విడుదల అంతంతమాత్రంగానే ఉంది. 2018- 19 నుంచి 2023-24 వ ఆర్థిక సంవత్సరం వరకు గత ఆరేళ్లలో 2.4 కోట్లరూపాయల బడ్జెట్ కేటాయించినా, ఈ కేంద్రానికి కేవలం 80.22లక్షల రూపాయలే విడుదల చేశారు. ఈ కేంద్రానికి కోతులను తరలించేందుకు నాలుగు రెస్య్యూ వ్యాన్లు, బోన్ల కొనుగోలు కోసం రూ.22 లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదించినా నిధులు కేటాయించలేదు. గతంలో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రస్థుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కోతుల పునరావాస కేంద్రాన్ని సందర్శించినా, ఈ కేంద్రానికి నిధులు కేటాయించలేదు.

ఖర్చు అధికం...ఫలితం నామమాత్రం
కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కోతుల పునరావాస కేంద్రంలో 2020 డిసెంబరు నుంచి ఇప్పటివరకు కేవలం 1500 కోతులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.తెలంగాణలోని ఏడు జిల్లాల నుంచి 3579 కోతులను ఈ కేంద్రానికి తరలించారు. కానీ ఇందులో గర్భం దాల్చిన కోతులు, పిల్ల కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయమని ఈ కేంద్రం పశువైద్యాధికారి డాక్టర్ శ్రీకర్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. 813 మేల్ కోతులు, 654 ఆడ కోతులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని డాక్టర్ శ్రీకర్ రాజు వివిరించారు.



అటవీ జిల్లాల్లో పెరిగిన వానరాల సంచారం

తెలంగాణ రాష్ట్రంలోని అటవీ జిల్లాలైన (Telangana Forest) నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, యాదాద్రి భువనగిరి,మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, వరంగల్, ములుగు, కొమురం భీం అసిఫాబాద్,భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల,జగిత్యాల,కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో కోతుల బెడద అధికమైంది.

కోతుల విధ్వంసంతో పంటల నష్టం
కోతుల బెడదతో తెలంగాణలో వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోతున్నారు. కోతులకు భయపడి తాము పండ్ల తోటలు, కూరగాయల పంటలు వేయడం లేదని పలు గ్రామాల రైతులు చెప్పారు. కోతుల బెడదతో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గింది.మందలుగా వస్తున్న వానర మూకలు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.కోతులను అడవిలోకి తరలించినా మళ్లీ ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి చేరుతున్నాయని జన్నారం అటవీ డివిజన్ కు చెందిన అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.

జనవాసాల్లోకి కోతుల దండు
గ్రామాల్లో ఇళ్లపై వానరాల గుంపులు దాడులు చేసి నల్లాలు, పైపులను విరగగొడుతున్నాయి. ఇళ్ల వద్దకు వానర సైన్యం వచ్చిందంటే చాలు ఇళ్లలో ప్రజలు తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై గుంపులు గుంపులుగా వానరాలు స్వైర విహారం చేస్తున్నాయి. అటవీ గ్రామాల్లో కోతుల బెడదతో సతమతం అవుతున్నామని ఇందన్ పల్లి గ్రామానికి చెందిన ఆత్రం సక్కు
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.

కోతుల బెడద నుంచి కాపాడండి : పసర సుందరయ్యనగర్ వాసుల వినతి
వానర మూకల దాడుల నుంచి తమను కాపాడాలని పసర సుందరయ్యనగర్ గ్రామస్థులు ప్రభుత్వానికి విన్నవించారు.అడవుల్లో మారేడు, నేరేడు పండ్ల చెట్ల స్థానంలో జామాయిల్ వేయడం వల్ల అడవుల్లో కోతులకు తినేందుకు ఆహారం లేక అవి గ్రామాల్లోకి వస్తున్నాయని గ్రామ నాయకుడు సోమ మల్లారెడ్డి చెప్పారు. వన్యప్రాణులైన కోతులను అటవీశాఖ అధికారులు పట్టుకొని అడవుల్లోకి తరలించాలని ఆయన కోరారు. కోతుల దాడుల్లో పలువురు గ్రామస్థులు గాయపడ్డారు. కోతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పసర సుందరయ్యనగర్ వాసులు ఆందోళన చేశారు. కోతులు ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి.

వరంగల్ జిల్లాలో...
వరంగల్ జిల్లా శివనగర్ లో కోతుల సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లపై వెళ్లే వృద్ధులు, మహిళలు, పిల్లలపై కోతులు దాడులు చేస్తున్నాయి.కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్ధాలను కింద పడేస్తున్నాయి. పది రోజుల్లో కోతులు ముగ్గురిపై దాడి చేసి కరిచాయి.



పంచాయతీ ఎన్నికల్లో కోతుల సమస్యే కీలకం

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద సమస్య కీలకంగా మారింది. కోతులు తమ గ్రామాలపై పడి పంటలు ధ్వంసం చేయడమే కాకుండా ఇళ్లలో నరకం చూపిస్తున్నందున ఈ సమస్యను తీర్చే వారినే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారు.

తెలంగాణలో 3కోట్లకు చేరిన కోతులు
ఒక్కో కోతి పది పిల్లలకు జన్మనిస్తుండటంతో వానరాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. తెలంగాణలో కోతుల సంఖ్య 3 కోట్లకు చేరిందని అటవీశాఖ అధికారులే చెబుతున్నారు. ఇప్పటి వరకు కోతులను నియంత్రించేందుకు మూడు కోట్ల రూపాయలు వెచ్చించినా కేవలం 1500 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. దీంతో కోతుల నియంత్రణ నిధులు వృథాగా మారాయని రైతు సంఘం నాయకుడు బాపన్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కోతుల పునరావాస కేంద్రం మూసివేస్తారా?
నిర్మల్ లోని మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటరును నిధుల కొరత సమస్యతో మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్మల్ జిల్లా అటవీశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కరోనా మహమ్మారి వల్ల ఈ కేంద్రం రెండేళ్లు సజావుగా పనిచేయలేదు.



కోతుల నియంత్రణకు అటవీశాఖ చర్యలేవి?

వన్యప్రాణులైన కోతులు గ్రామాల్లో సంచరిస్తుండటంతో వాటిని పట్టుకొని అడవుల్లోకి తరలించాల్సిన అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారు. అడవుల నరికివేత, పోడు సేద్యం, అడవుల్లో పండ్ల చెట్లు తగ్గిపోవడంతో కోతులకు తినడానికి తిండి లేక అవి గ్రామాల బాట పడుతున్నాయి. అడవిలోని ఉసిరి, కరక, పరికి,చెర్రి, చిరంజీ, ఇప్ప చెట్లను నరికి పోడు సేద్యం చేయడంతో కోతులకు అడవుల్లో ఆహారం లేకుండా పోయింది. దీంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయి. అడవుల సమీపంలోని గ్రామాల్లో కోతుల దండులు స్వైర విహారం చేస్తూ ప్రజలను అల్లాడిస్తున్నాయి. అడవుల్లో పండ్ల మొక్కలు నాటి కోతులకు ఆహారం అడవుల్లోనే లభించేలా చేయాల్సిన అటవీశాఖ విఫలమైంది. దీంతో జనావాస ప్రాంతాల్లో కోతుల బెడద అధికమైంది. కోతుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతులు, అటవీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Read More
Next Story