రుణమాఫీలో వివాదాలు పెరిగిపోతున్నాయా ?
x
Loan waiver

రుణమాఫీలో వివాదాలు పెరిగిపోతున్నాయా ?

ఎన్నికల సమయంలో రు. 2 లక్షల వరకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ లక్షలాది రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ మండిపోతున్నాయి.


మూడోదశ గడువు సమయం దగ్గరకు వస్తున్న నేపధ్యంలో రుణమాఫీచుట్టూ వివాదాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల సమయంలో రు. 2 లక్షల వరకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఆంక్షల పేరుతో లక్షలాది రైతులను మోసం చేస్తోందని ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గోల గోల చేసేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు అధికార కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోతున్నది. ఇదే సమయంలో రుణమాఫీ లబ్దిపొందటానికి తమకు అన్నీ అర్హతులున్నా తమకెందుకు రుణమాఫీ కాలేదంటు రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తాజాగా రుణమాఫీలో లబ్ది జరగని రైతుల కోసం బీజేపీ హెల్ప్ లైన్ ఏర్పాటుచేయటంతో రుణమాఫీ అంశంలో వివాదం మరింతగా పెరిగిపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది. తమ హయాంలో లక్ష రూపాయల రుణమాపీ చేసినపుడే 36.68 లక్షల మంది రైతులకు లబ్ది జరిగిందనట్లు బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు. అలాంటిది ఇపుడు రు.2 లక్షల రుణమాఫీ జరుగుతున్నపుడు మొత్తం లబ్దిపొందే రైతుల సంఖ్య 36 లక్షలేనా అంటు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ప్రశ్నలు ఆలోచించాల్సిందే. మూడు విడతల రుణమాఫీలో లబ్దిపొందే రైతుల సంఖ్య మొత్తం 35.5 లక్షలుగా ఫైనల్ అయ్యింది. ఇంతమంది రైతులకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం రు. 24,449 కోట్లు. అంటే రుణమాఫీలో మొత్తం లబ్దిపొందే రైతుల సంఖ్య సుమారు 36 లక్షలయితే జరిగే మాఫీ రు. 24,449 కోట్లు.

మొదటివిడతలో రుణమాఫీ అందుకున్న 11.34 లక్షల రైతులకు అందిన లబ్ది రు. 6,034 కోట్లు. రెండో విడతలో రుణమాఫీ లబ్దిదారులు 6.40 లక్షల మంది రైతులకు అందిన లబ్ది రు. 6,190 కోట్లు. ఇక మూడో విడతలో వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం లబ్దిపొందే రైతుల సంఖ్య 17.55 లక్షలయితే అందుకోబోతున్న లబ్ది రు. 12,225 కోట్లు. ఇక్కడే ప్రభుత్వ లెక్కలతో బీఆర్ఎస్ నేతలు విభేదిస్తున్నారు. కేవలం లక్ష రూపాయల రుణమాఫీ వల్ల తమ ప్రభుత్వంలో 36.68 లక్షలమంది రైతులు లబ్ది అందుకున్నపుడు రు. 2 లక్షల రూపాయల లబ్దిలో రైతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండాలి కదా అన్నది కారుపార్టీ నేతల లాజిక్. వీళ్ళ ప్రశ్న లాజికల్ గానే ఉంది.

అయితే బీఆర్ఎస్ ప్రశ్నకు అధికారపార్టీ నేతలు ఒక సమాధానమిస్తున్నారు. అదేమిటంటే బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు కూడా రుణమాఫీ అందినట్లు ఎదురుదాడి చేస్తున్నారు. అప్పట్లో రైతురుణమాఫీ అందుకున్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్ తో పాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిదులు, ఆదాయపు పన్ను కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు, ఇతర వృత్తుల్లో ఆర్ధికంగా బలమైన స్ధితిలో ఉన్నవారికి కూడా రుణమాఫీని కేసీఆర్ ప్రభుత్వం గుడ్డిగా అమలుచేసిందని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఎదురుదాడిలో కూడా నిజముంది. అనర్హులకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రుణామాఫీ చేస్తోందని అప్పట్లోనే అనేక ఆరోపణలున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకంలో అమలుచేస్తున్న నిబంధనలను అమలుచేస్తోంది. దీనికి అదనంగా మరికొన్ని నిబంధనలను కూడా చేర్చి పథకాన్ని కఠినంగా అమలుచేయటంతో అనర్హులతో పాటు కొందరు అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని గోలపెరిగిపోతోంది. బీఆర్ఎస్ హయాంలో మొదటి విడతలో మాఫీ అయిన సొమ్ము సుమారు రు. 19 వేల కోట్లయితే ఇపుడు మాఫీ అయ్యింది రు. 6034 కోట్లు మాత్రమే. రుణమాఫీ అయిన నిధులే సుమారు రు. 13 వేల కోట్లున్న కారణంగా అదే దామాషాలో రైతుల సంఖ్య కూడా తగ్గిపోయింది.

అర్హతలుండీ రుణమాఫీ కాని రైతుల విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ కాకపోవటానికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కొన్ని కారణాలను చెబుతున్నారు. అదేమిటంటే 2018, డిసెంబర్ 12వ తేదీకన్నా ముందు రుణం తీసుకునుండటం, కుటుంబం మొత్తానికి లక్షన్నర రూపాయల లోపు రుణం ఉంటేనే మాఫీ అవుతుందని, రుణమాఫీ దరఖాస్తుకు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డును జతచేయకపోవటం, రుణాలను రీషెడ్యూల్ చేసుకోకపోవటం లాంటి అనేక కారణాలను చెబుతోంది. తొందరలోనే ప్రభుత్వంతో పాటు బ్యాంకుల నుండి అధికారులు గ్రామాలకు వచ్చి సమవేశాలు నిర్వహిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామసభల్లో తమ దరఖాస్తులతో పాటు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులను అందచేస్తే రుణమాఫీ అమలుకు అర్హత వస్తుందని అప్పుడు రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

అర్హులందరికీ మాఫీ అవుతుంది.

ఇదే సమయంలో బ్యాంకుల్లో కూడా సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదని సమాచారం. ఇదే విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు రైతు రుణమాఫీ 32 బ్యాంకుల ద్వారా జరుగుతున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ లబ్దిని అందుకోని రైతుల సంఖ్య సుమారు 18 వేలుంటుందన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించి తొందరలోనే వీరందరికి సుమారు రు. 83 కోట్లు లబ్ది అందిస్తామని చెప్పారు. రుణమాఫీ అమలులో కచ్చితంగా నిబంధనలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ లబ్దిదారుల్లో అనర్హులున్నారని తెలిసినా పట్టించుకోలేదన్నారు. అనర్హులందరినీ తమ ప్రభుత్వం ఏరేస్తుండటం వల్లే లబ్దిదారుల సంఖ్యలో తేడా కనబడుతోందన్నారు.

బీజేపీ హెల్ప్ లైన్

కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు రుణమాఫీ అంతా మోసమే అని కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రు. 2 లక్షలు మాఫీ చేస్తామని హామీలిచ్చి ఇపుడు నిబంధనల పేరుతో రైతులను మోసంచేస్తున్నట్లు ఆరోపించారు. రుణమాఫీకి అర్హతలుండీ మాఫీ కాని రైతుల వివరాల కోసమే తమ పార్టీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొందరలోనే ప్రతి గ్రామంలోను రైతుల పక్షాన రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రుణమాఫీ కాని అర్హుల రైతుల జాబితాలను సేకరిస్తామన్నారు. ఇందులో భాగంగానే 8886 100 097 హెల్ప్ లైన్ ఏర్పాటుచేసినట్లు కూడా కిషన్ చెప్పారు. మొత్తానికి ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు రుణమాఫీ బాగా వివాదాస్పదమవుతున్నట్లు అర్ధమవుతోంది.

Read More
Next Story