నీళ్లెక్కడ? సూర్యాపేట రోడ్డు మీద ఉద్రిక్తత
x

నీళ్లెక్కడ? సూర్యాపేట రోడ్డు మీద ఉద్రిక్తత

సాగర్ పంటకాల్వలకు నీరు విడుదల చేసి, ఎండిపోతున్న తమ పంటలను కాపాడానికి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు.


సాగర్ నీటిని విడుదల చెయ్యాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. ఫలితంగా ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలంటూ పాలేరు నియోజకవర్గ రైతులు ఈ ఆందోళన చేపట్టారు.

పాలేరు పాతకాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన రైతులు జాతీయరహదారిపై బైఠాయించారు. సాగర్ నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. సాగునీరు విడుదల చేసేంతవరకు వెళ్ళేది లేదంటూ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. పొలాలకు నీళ్లు ఇవ్వకుంటే మేమే గేట్లు ఎత్తుతామంటూ రైతులు రంగంలోకి దూకారు.

ఈ సందర్బంగా నీటిపారుదల శాఖ అధికారులు. రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా ఫలితం కనిపించక పోవడంతో రైతులు గేట్లను ఎత్తేందుకు కదలడంతో పోలీసులు అడ్డుకున్నారు. తీవ్రఉద్రిక్తల మద్య రైతులు పాలేరు లాకులు ఎత్తి నీటిని విడుదల చేశారు. కాగా లాకులు ఎత్తిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా వుండగా అధికారులు మాత్రం సాగర్ జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో నీటిని విడుదల చెయ్యలేదని చెప్పారు. ఉన్న నీటిని ఇప్పుడే విడుదల చేస్తే వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నదాంతో విడుదల చెయ్యలేదన్నారు. సాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టం తక్కువగా ఉందని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీటిని విడుదల చేస్తామని జనవరి 26న నేరెడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో భారీనీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగిందని అధికారులు గుర్తు చేశారు.
సాగర్‌ జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో,సాగు నీటి విడుదల విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పడం జరిగిందని, అధికారులు రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. సాగర్ నీటిపై సమీక్ష జరిపిన తర్వాత విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా 20వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రెండు సార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.



Read More
Next Story